ఖమ్మం వ్యవసాయం, అక్టోబర్ 7 : ఖమ్మం నగర వ్యవసాయ మార్కెట్లో ఖరీదుదారులు ఆర్డీ(రేట్ డిఫరెన్స్) దందాకు తెరలేపినట్లు ప్రచారం జోరుగా జరుగుతున్నది. అసలే అన్‌సీజన్ కావడంతో నీకింత& నాకింత అన్నట్లుగా వ్యవహారం సాగుతోంది. ఖరీదుదారుల సిండికేట్ దందానా.. మరేమిటో తెలియదు కానీ రెండు నెలలుగా జెండాపాటలో మార్పులేదు. ప్రస్తుతం రైతులు వానకాలం పంటలను అమ్మునేందుకు సిద్ధం కాగా.. ఖరీదుదారులు మరో దందాకు తెరలేపారు.
కొందరు దడవాయిలను మచ్చిక చేసుకొని మార్కెట్ అధికారులకు తెలియకుండా ఆర్డీ దందాకు పాల్పడుతున్నారు. ఎండుమిర్చి పంటను కొనుగోలు చేసి దడవాయిల రికార్డుల్లో మాత్రం తక్కువ ధరకు పంటను కొనుగోలు చేసినట్లు చూపుతున్నారు. విదేశాలకు ఆశించిన మేర ఎగుమతులు లేకపోవడంతో అసలైన ఖరీదుదారులు కొనుగోళ్లకు దూరంగా ఉన్నారు. దేశీయ వాడకం నిమిత్తం కొనుగోలు చేసి, ఇతర రాష్ర్టాలకు ఎగుమతి చేసే కొందరు వ్యాపారులు ఈ దందాకు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తున్నది. ఈ తతంగం కేవలం దడవాయిలు, వ్యాపారులకు మధ్య అవగాహనతోనే కొనసాగుతుండడం విశేషం.
దీనికితోడు ఒక్కరిద్దరు పత్తి, మిర్చి ఖరీదుదారులు ఏకంగా జీరో దందాకు తెగబడుతున్నట్లు కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. వ్యాపారులు, ఖరీదుదారులు, దడవాయిల మధ్య పొరపొచ్చాలు రావడంతో మార్కెట్లో బహిరంగంగానే ఆరోపణలు చేసుకుంటున్నారు. మార్కెట్లో అక్రమ వ్యాపారాలు, ఎలాంటి ఆధారాలు లేని వ్యక్తుల చేతుల్లోకి కాంటాలు వెళ్లడంతోనే సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని కొందరు వ్యాపారులు వాపోతున్నారు.
నగర వ్యవసాయ మార్కెట్ ఏర్పడి దాదాపు 90 సంవత్సరాలు కావస్తున్నది. ఈ కాలంలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. పదుల సంఖ్యలో ఉన్న కమీషన్ వ్యాపారులు వందల సంఖ్యలోకి వచ్చారు. ఖరీదుదారులు 20-30 నుంచి 350 మందికి పైగానే అయ్యారు. వీరితోపాటు ట్రాలీ అసోసియేషన్, హమాలీలు, చివరకు ఉద్యోగుల సంఖ్య సైతం రెండు మూడు రెట్లు పెరిగింది. కానీ.. దడవాయిలు గతంలో 86 మంది ఉండగా.. అదే సంఖ్య నేటికీ కనపడుతున్నది.
మార్కెట్ ఏర్పడిన తొలినాళ్లలో దడవాయి పని చేయలేని వారు తన వారసుడు లేదా ఇతర వ్యక్తులకు పనిని అమ్ముకునే వారు. రానురాను దాని విలువ భారీగా పెరిగిపోయింది. ఒక్కో దడవాయి పని ఇతర వ్యక్తి కొనుగోలు చేస్తే ఆందుకు ప్రతిఫలంగా రూ.15 లక్షల నుంచి రూ.18 లక్షల వరకు ముట్టజెప్పడం విశేషం. గత కొద్దినెలల్లోనే 86 మందిలో 20 మంది వరకు పని అమ్ముకున్నట్లు సమాచారం.
అయితే ఇంత పెద్దమొత్తంలో పని కొన్న కొత్త వ్యక్తులే అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఖరీదుదారులకు సహకరిస్తూ తక్కువ ధరను వేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. కాంటాల ప్రక్రియలో సైతం అనేక అవకతవకలకు పాల్పడుతున్నట్లు ప్రచారం జరుగుతున్నది. కేవలం నల్లరంగు అంగీ తప్ప వారికి లైసెన్స్ లేకపోవడంతోనే ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని మార్కెట్ వర్గాల్లో విస్తృత ప్రచారం జరుగుతున్నది.
వ్యవసాయ మార్కెట్లో జీరో, ఆర్డీ దందాకు ఏమాత్రం తావులేదు. ఖరీదుదారులు జీరో దందాకు పాల్పడే అవకాశం లేకుండా నూతన సాంకేతిక పరిజ్ఞానం వాడుతున్నాం. గేట్ ఎంట్రీలు, అవుట్ఫుట్లను నిరంతరం పరిశీలిస్తున్నాం. వేమెన్ ఇంటిగ్రేషన్ విధానం కొనసాగుతున్నది. దడవాయిలు కొందరు పని అమ్ముకున్నారని తెలిసింది.. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకుంటాం.
– ప్రవీణ్‌కుమార్, ఖమ్మం ఏఎంసీ సెక్రటరీ