మూడు నెలల బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేయాలన్న తొందరలో కొత్తగా సాఫ్ట్‌వేర్‌ను రూపొందించిన ప్రభుత్వం.. దాని వినియోగంపై రేషన్ డీలర్లకు ముందస్తుగా అవగాహన కల్పించలేదు. తెలియక పొరపాటుగా ఆపరేట్ చేసినా సరిదిద్దుకునే అవకాశాన్ని ఆ సాఫ్ట్వేర్ అప్లికేషన్ (యాప్)లో కల్పించలేదు. దీంతో సరైన అవగాహన లేకుండా రంగంలోకి దిగిన డీలర్లు.. దాని ఆపరేటింగ్‌లో పొరపాట్లు చేస్తున్నారు. ఫలితంగా అనేక తంటాలు పడుతున్నారు.
ఆఖరికి అదనపు కోటా రేషన్ బియ్యాన్ని కోల్పోతున్నారు. ఆ తరువాత కార్డుదారులకు సమాధానం చెప్పలేక తెల్లమొహం వేస్తున్నారు. ‘వన్ నేషన్ వన్ రేషన్’ అని, ‘పేద కుటుంబాలు తమ రేషన్‌ను దేశంలో ఎక్కడి చౌకదుకాణం నుంచైనా తీసుకోవచ్చు’ అని ఆర్భాటాలు ప్రదర్శిస్తున్న కేంద్ర ప్రభుత్వం.. దాని అమలుకు సరైన చర్యలు తీసుకోకపోవడంతో క్షేత్రస్థాయిలో ఇటు డీలర్లు, అటు కార్డుదారులు ఇబ్బందులు పడుతున్నారు. -రఘునాథపాలెం, జూన్ 15
మూడు నెలల రేషన్ బియ్యం పంపిణీ కోసం కొత్తగా ప్రభుత్వం తీసుకొచ్చిన సాఫ్ట్వేర్ రేషన్ డీలర్లను అవస్థలకు గురి చేస్తూనే ఉంది. నూతన అప్లికేషన్‌పై అవగాహన కల్పించకపోవడంతో దానిని అర్థం చేసుకునేందుకు డీలర్లు సతమతవుతున్నారు. ‘ఈ-పాస్’ యంత్రంలో ఆప్డేట్ చేసిన సాఫ్ట్వేర్ అప్లికేషన్ (యాప్)ను ఎలా ఆపరేట్ చేయాలో అర్థం కాక జూన్ నెల మొదట్లో అనేకమంది డీలర్లు షాపులను బంద్‌పెట్టి కూర్చున్నారు. అయితే ‘ఆరు వేలిముద్రలు మూడు తూకాలు’ విధానం వల్ల జరుగుతున్న జాప్యాన్ని గుర్తించిన ప్రభుత్వం.. దానిని మూడు వేలిముద్రలకు కుదించి డీలర్లకు కాస్త ఉపశమనం కలిగించింది. కానీ కొత్త సాఫ్ట్‌వేర్‌పై డీలర్లకు ముందస్తు అవగాహన కల్పించకపోవడంతో నిత్యం వారు ఏదో ఒక సమస్యను ఎదుర్కొంటూనే ఉన్నారు.
తాజాగా పోర్టబిలిటీ రేషన్ (అదనపు కోటా) రిక్వెస్ట్ విషయంలోనూ డీలర్లకు సమస్య ఎదురైంది. పోర్టబిలిటీ రిక్వెస్ట్ ఎన్నిసార్లు పెట్టినా గత సాఫ్ట్వేర్ తీసుకునేది. ఎన్నో ఏళ్లుగా ఉన్న ఈ సాఫ్ట్‌వేర్‌పై డీలర్లకు అవగాహన ఉండడంతో వారు ఈ పోర్టబిలిటీ రిక్వెస్ట్‌ను సులువుగా పెట్టేవారు. కానీ మూడు నెలల బియ్యం పంపిణీ కోసం జూన్‌లో వచ్చిన కొత్త అప్లికేషన్ అర్థం కాకపోవడంతో పోర్టబిలిటీ రిక్వెస్ట్ విషయంలో పొరపాట్లు చేసి తలలు పట్టుకుంటున్నారు.
పోర్టబిలిటీ రేషన్ రిక్వెస్ట్ ‘కేజీల్లో’ చూపిస్తుండగా కొందరు డీలర్లు దానిని గమనించకుండా ఎప్పటిలాగానే ‘క్వింటాళ్లు’గా భావించి రిక్వెస్ట్ పెట్టేశారు. కానీ అప్లికేషన్ మాత్రం ‘కేజీల్లో’ తీసుకుంటోంది. దీంతో డీలర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 100 క్వింటాళ్ల అదనపు కోటా కోసం రిక్వెస్ట్ పెట్టుకున్న డీలర్లకు కేవలం క్వింటా మాత్రమే కేటాయింపు జరుగుతోంది. దీంతో తన షాపు పరిధిలో 100 క్వింటాళ్ల అదనపు కోటా అవసరమై అర్జీ పెట్టుకున్న డీలర్‌కు క్వింటా మాత్రమే కోటా రిలీజ్ కావడంతో బిక్కమొహం వేస్తున్నాడు. బియ్యం కోసం వచ్చిన కార్డుదారులకు సమాధానం చెప్పలేక సతమ తమవుతున్నాడు.