కారేపల్లి, ఏప్రిల్ 10 : ప్రజా పాలనలో నూతన రేషన్ కార్డుల కోసం వచ్చిన దరఖాస్తులను ఈ నెల 30 లోగా ఆన్లైన్లో నమోదు చేయాలని ఖమ్మం జిల్లా సివిల్ సప్లయ్ ఆఫీసర్ చందన్ కుమార్ సిబ్బందికి సూచించారు. ప్రభుత్వం కొద్దిరోజుల క్రితం ప్రారంభించిన సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం కొనసాగుతున్న వివరాలను గురువారం ఖమ్మం జిల్లా కారేపల్లిలో ఆయన పరిశీలించారు. రేషన్ షాపుల్లో పంపిణీ జరిగే తేదీల్లో అధికారులు పరిశీలించాలని తాసీల్దార్ సంపత్ కుమార్కు సూచించారు.
సన్న బియ్యం పంపిణీ, పనివేళల వివరాలు ఆయా షాపుల ముందు బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. బియ్యం పంపిణీలో ఎటువంటి అక్రమాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత ఆయా మండలాధికారులపైనే ఉందన్నారు. బియ్యం పంపిణీ విషయంలో ప్రతినెల డీలర్లతో సమావేశాలు ఏర్పాటు చేసి నిబంధనలు తెలియజేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సివిల్ సప్లయ్ ఆర్ఐ పవన్ కుమార్ పాల్గొన్నారు.