భద్రాచలం, జనవరి 4 : ముక్కోటి ఏకాదశి అధ్యయనోత్సవాల్లో భాగంగా భద్రాచలం రామాలయంలోని గోకుల రామంలో గల వన విహార మండపంలో గురువారం స్వామివారికి విలాసోత్సవం కార్యక్రమాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. స్వామివారిని వెంకటేశ్వరునిగా అలంకరించి కల్పవృక్ష వాహనంపై వేంచేపు చేసి ప్రధానాలయం నుంచి మేళతాళాలు, మంగళవాయిద్యాలు, భక్తుల జయజయధ్వానాల నడుమ వన విహార మండపానికి తీసుకొచ్చి ప్రత్యేక పూజలు చేశారు.
పట్టణ ప్రముఖులు హరిశ్ఛంద్రనాయక్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకొని పరవశించిపోయారు. ఈ సందర్భంగా పట్టణానికి చెందిన శ్రీరామ నాట్యాలయం వారి ఆధ్వర్యంలో కూచిపూడి, భరతనాట్యం, శాస్త్రీయ నృత్యాలను ప్రదర్శించారు. చిన్నారులు చేసిన నృత్యాలను చూసి ప్రేక్షకులు మైమరిచిపోయారు.