బోనకల్లు, మార్చి 25 : ఖమ్మం జిల్లా బోనకల్లు మండల కేంద్రంలోని కొత్త మసీదులో ముస్లిం ఐక్య సంఘం ఆధ్వర్యంలో 400 మంది పేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ సందర్భంగా మంగళవారం తోఫా (పండుగ సామాగ్రి) పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సెంట్రల్ కమిటీ అధ్యక్షుడు మౌలానా షేక్ ముజాహిద్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ముస్లింల సంక్షేమం పట్ల, అభివృద్ధి పట్ల ప్రత్యేక దృష్టి సారించి బడ్జెట్ కేటాయించాలని కోరారు. ముస్లింలకు రాజీవ్ వికాస్ రుణాల్లో ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ముస్లింలకు రిజర్వేషన్ 4 శాతం నుండి 12 శాతానికి పెంచాలని, ముస్లింలకు సబ్ ప్లాన్ ప్రకటించాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరారు.
ముస్లిం ఐక్య సంఘం ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు.మండల అధ్యక్షుడు షేక్ మహబూబ్ పాషా మాట్లాడుతూ.. మండల కేంద్రం నందు రైతు వేదికలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున శుక్రవారం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఇఫ్తార్ విందు కార్యక్రమానికి అన్ని గ్రామాల ముస్లిం సోదరులు హాజరుకావాలన్నారు. ఈ కార్యక్రమంలో ముస్లిం ఐక్య సంఘం గౌరవ సభ్యుడు జానీ పాషా, సెంట్రల్ కమిటీ సభ్యులు జానీమియా, మండల ప్రధాన కార్యదర్శి చాంద్ పాషా, ఉపాధ్యక్షుడు షాజహాన్, బోనకల్ మజీద్ కమిటీ అధ్యక్షుడు మీరా సాహెబ్, కమిటీ సభ్యులు రఫీ, దస్తగిరి, బాబు, రంజాన్, షరీఫ్ పాల్గొన్నారు.