కళ్లలో ఒత్తులేసుకొని కోటి ఆశలతో ఎదురుచూసిన కర్షకులను కనీస కనికరం లేకుండా నిలువునా వంచించింది కాంగ్రెస్ ప్రభుత్వం. రైతుభరోసా నుంచి మొదలుకొని రుణమాఫీ దాకా అన్నింటా దగా చేసింది. చివరికి సీజన్ ముగిసినా చిల్లిగవ్వ కూడా చేతికి అందించలేదు. రోజుల తరబడి ఎదురుచూసిన రైతులు మళ్లీ షావుకార్ల దగ్గరకు వెళ్లి పంటల పెట్టుబడి కోసం వడ్డీకి డబ్బులు తెచ్చుకున్నారు. సీజన్ ముగిసే నాటికి రైతుభరోసా అందించినా నాలుగు నెలల వడ్డీ కలిపి సేటుకు చెల్లించేద్దామనుకున్నారు.
కానీ కాంగ్రెస్ సర్కారు చేసిన మోసంతో తలలు పట్టుకొని పొలంలో కూర్చుంటున్న దయనీయ దృశ్యాలు ఉమ్మడి జిల్లాలో కలిచివేస్తున్నాయి. గత ప్రభుత్వంలో ఠంచనుగా అందిన రైతుబంధుతో రాజసాన్ని పొందిన రైతులందరూ.. నేడు పంటల సాయం కోసం రేయింబవళ్లూ ఎదురుచూస్తున్నారు. గత కేసీఆర్ పాలనలో సీజన్‌కు ముందుగానే అందిన పెట్టుబడి సాయంతో సాగు సరంజామానంతా ముందే సిద్ధం చేసుకొని ఉన్న సంగతులను మననం చేసుకుంటున్నారు. కేసీఆర్ తమ వెంట లేని లోటు స్పష్టంగా కన్పిస్తోందంటూ సహచర సాగుదారులతో సంభాషిస్తున్నారు.
-ఖమ్మం, నమస్తే తెలంగాణ ప్రతినిధి/ భద్రాద్రి కొత్తగూడెం, నమస్తే తెలంగాణ, సెప్టెంబర్ 30
అనేక రైతు సంక్షేమ పథకాలకు కొర్రీలు పెట్టుకుంటూ వస్తున్న కాంగ్రెస్ సర్కారు.. రైతుభరోసా పథకంలో కూడా వానకాలం సీజన్‌కు రాంరాం చెప్పినట్లుగానే కన్పిస్తోంది. వానకాలం సీజన్ ప్రారంభానికి ముందే అందాల్సిన పంటల పట్టుబడి సాయం ఇంకా అందనేలేదు. అన్నదాతల ఎదురుచూపులతోనే కాలం గడిచిపోయింది. సరిగ్గా నేటితో వానకాలం సీజనే ముగిసిపోయింది. అంటే దాదాపు నాలుగు నెలలపాటు ‘అదిగో.. ఇదిగో..’ అంటూ కాంగ్రెస్ పాలకులు కాలయాపన చేశారు తప్ప కర్షకులు అప్పులకు పోకుండా పంటల పెట్టుబడి అందించలేదు.
ఈ వానకాలం సీజన్లో ఖమ్మం జిల్లా రైతులు 4.40 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు వేశారు. ఇప్పటికే పెసర పంట చేతికొచ్చింది. మార్కెట్లో విక్రయానికీ వెళ్తోంది. మరో వారం పది రోజుల్లో వరి, పత్తి పంటలు కూడా చేతికి రానున్నాయి. జూన్‌లో మొదలయ్యే వానకాలం సీజన్.. సెప్టెంబర్‌తో ముగుస్తుంది. అక్టోబర్‌తో ప్రారంభమయ్యే యాసంగి సీజన్ జనవరి, ఫిబ్రవరి నెలల్లో పూర్తవుతుంది. అయితే, ఎకరానికి రూ.15 వేలు ఇస్తామంటూ గొప్పలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వానకాలం సీజన్ ముగిసిపోయినా నేటికీ నయాపైసా జమచేయలేదు.
కాంగ్రెస్ సర్కారు కాలయాపనతో వేసారిన రైతులు మళ్లీ వడ్డీ వ్యాపారుల తలుపు తడుతున్నారు. అప్పులు దొరకని రైతులు కొందరు తమ పంట చేలను బీడుగా వదిలేయగా.. తక్కువ పెట్టుబడి దొరికిన మరికొందరు రైతులు పంట విస్తీర్ణాన్ని తగ్గించారు. ఇదే సమయంలో వచ్చిన వర్షాలు, వరదలు వారిని మరోసారి దెబ్బతీశాయి. ఇప్పుడు మొదలయ్యే యాసంగికి కూడా రైతుభరోసా అందకపోతే ఇంకోసారి కూడా అప్పులతోనే సాగుకు సన్నద్ధం కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఖమ్మం జిల్లాలో ప్రతి వానకాలం సీజన్లో 3.10 లక్షల మంది రైతులకు గాను సుమారు రూ.350 కోట్ల మేర రైతుబంధు నిధులు అందేవి. రెండు సీజన్లకు కలిపి ఇంచుమించుగా రూ.550 కోట్ల నిధులు రైతుల ఖాతాల్లో జమ అయ్యేవి.
కానీ నేడు నయాపైసా లేదు.భద్రాద్రి జిల్లాలో 4,77,538 ఎకరాల్లో అన్నదాతలు వివిధ పంటలను సాగుచేస్తున్నారు. వీటిల్లో ఏ ఒక్క ఎకరానికి కూడా ఈ సీజన్లో రైతుభరోసా పంటల పెట్టుబడి సాయం అందలేదు. గత కేసీఆర్ ప్రభుత్వంలో ఈ జిల్లాలో 1,20,163 మంది సాధారణ రైతులతోపాటు 22,036 మంది పోడు రైతులకు కలిపి రూ.213 కోట్లకు పైగా రైతుబంధు సాయం అందేది. దీంతో ఇక్కడ ఏటికేడు సాగు విస్తీర్ణం పెరిగేది. ఇప్పుడా జాడే లేకుండాపోయింది. ఇక యాసంగి యాక్షన్ ప్లాన్ ఊసు కూడా కన్పించడం లేదు.
రైతులకు ఏ ఇబ్బందులు రాకుండా ముందే ఆలోచన చేసిన నాయకుడు కేసీఆర్. పంటల సాగు కోసం ఆయన పాలనలో ఏనాడూ ఇంత ఇబ్బంది పడలేదు. నాకు ఐదు ఎకరాల సాగు భూమి ఉంది. రైతు భరోసా రాలేదు. దీని గురించి ప్రభుత్వం ఒక్కమాట కూడా చెప్పడం లేదు. రేపటితో యాసంగి మొదలవుతుంది. ఇప్పుడు రెండు సీజన్లవి కలిపి ఇస్తారో లేక ఒక్క సీజన్వే ఇస్తారో చూడాలి. గతంలో రూ.2 లక్షల పంట రుణం తీసుకున్నాను. బ్యాంకు వాళ్లు ఒత్తిడి తెస్తే రూ.90 వేలు కట్టాను. కానీ ఇంతవరకు నా పంట రుణం మాఫీ కాలేదు.
-కొమ్మినేని నర్సింహారావు, రైతు, కొణిజర్ల
రైతుభరోసాకు అందించాల్సిన నిధులను రైతు రుణమాఫీకి మళ్లించిన కాంగ్రెస్ ప్రభుత్వం.. దానినీ సక్రమంగా పూర్తిచేయలేదు. లెక్కనేనన్ని కొర్రీలతో అనేకమందికి ఎగనామం పెట్టింది. దీంతో ఇటు రైతుభరోసా అందక.. అటు రుణమాఫీ కాక కర్షకులందరూ కష్టాలకు ఎదురీదుతున్నారు. గొప్పలు చెప్పిన రుణమాఫీ కూడా సగంమంది రైతులకు కాలేదు. ఉదాహరణకు ఖమ్మం డీసీసీబీని పరిశీలించినా ఈ విషయం స్పష్టమవుతోంది. ఇక్కడ రూ.2 లక్షల్లోపు రుణాలు కలిగిన రైతులు 1.69 లక్షల మంది ఉన్నారు. కాగా, వారిలో కేవలం 65 లక్షల మంది రైతుల రుణాలు మాత్రమే మాఫీ అయ్యాయి. అంటే ఇంకా లక్షమందికిపైగా రుణమాఫీ కావాల్సి ఉంది.
కేసీఆర్ సీఎంగా ఉన్నంతకాలం ఏ ఒక్క రైతూ ఇబ్బంది పడలేదు. ముఖ్యంగా రైతుబంధు సాయం మాత్రం అస్సలు ఆగలేదు. వానకాలం సీజన్ వచ్చిందంటే చాలు.. జూన్ జూలై నెలల్లోనే పంటల సాయం అందేది. దీంతో ముందుగానే మందుకట్టలు తెచ్చిపెట్టుకునే వాళ్లం. కానీ ఈ సంవత్సరం నాలుగు నెలలు గడిచినా ఇంత వరకు రైతుబంధు సాయం అందలేదు. కేసీఆర్‌కంటే ఎక్కువే ఇస్తామంటూ చెప్పిన కాంగ్రెసోళ్లు ఇప్పుడు అసలుకే మోసం చేశారు.
-రేగళ్ల అప్పయ్య, రైతు, ముత్తగూడెం
నాకు ఐదెకరాల సాగు భూమి ఉంది. గత వర్షాకాలం తొలకరిలో పెట్టుబడి కోసం గత సీఎం కేసీఆర్ సహాయం చేశారు. యాసంగి సాగుకు రెండో దఫా కూడా సరైన సమయంలో పెట్టుబడి సహాయం అందేది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు భరోసా, రుణమాఫీ అని చెప్పినా వాటి ఊసే లేదు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం రైతు రుణమాఫీ, రైతు భరోసా అమలు చేసి రైతులను ఆదుకోవాలి.
-బానోత్ వాలునాయక్, రైతు, మొక్కంపాడుతండా
ఇప్పటివరకు రైతు భరోసా రాలేదు. వానకాలం సీజన్ అయిపోయింది. ఇంకెప్పుడిస్తారు? ముందుగా వేసిన వరి పంట మరో 20 రోజుల్లో కోతకు వస్తుంది. నాకు రుణమాఫీ కూడా కాలేదు. సీఎం రేవంత్‌రెడ్డి మాటలపై నమ్మకం పోయింది. మాకైతే రైతు భరోసా రాలేదు. కాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆశలు వదులుకున్నాం. ఎన్నికల ముందు ఎన్నో ఆశలు కల్పించి ఇప్పుడు నిరాశపరచడం ఎంతవరకూ సబబు?
-మొడియం రాముడు, రైతు, అశ్వారావుపేట
గత కేసీఆర్ పాలనలో వ్యవసాయం స్వర్ణయుగం. ఆయన పాలనే బాగుంది. రైతుకు ఏడాదికి రూ.10 వేల చొప్పున రెండు దఫాలుగా రైతుబంధు వేశారు. ఆ పంటల సాయంతో వ్యవసాయాన్ని పండుగలా చేసే వాళ్లం. కానీ కాంగ్రెస్ వచ్చిన తర్వాత రైతు నడిరోడ్డుపై నిలబడ్డాడు. మొదటి విడత రైతుబంధు ఇంకా వెయ్యలేదు. యాసంగి పంట కూడా మొదలు కాబోతున్నది. ప్రభుత్వ పథకాల కోసం అధికారుల చుట్టూ తిరగాల్సి వస్తోంది.
-కొండా రాము, రైతు, సున్నంబట్టి గ్రామం
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇప్పటివరకు రైతుబంధు వేయకుండా రైతులను మోసం చేసిండు. రైతుబంధు పడితే పంట పెట్టుబడికి పనికొచ్చేది. కానీ.. గత కేసీఆర్ ప్రభుత్వం రైతులను రాజులా చూసింది. వ్యవసాయాన్ని పండుగలా చేసింది. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను తిప్పించుకుంటూ కాలయాపన చేస్తోంది. ఇప్పటి వరకు రైతుబంధు వేయకపోతే వ్యవసాయం ఎలా చేసేది? ప్రభుత్వం మేల్కొని ఖాతాల్లో రైతుబంధు వేయాలి.
-దుర్గారావు, రైతు, కేశవపట్నం
ఎన్నికల ముందు ఎన్నో హామీలు ఇచ్చిన కాంగ్రెస్.. ఎన్నికల తర్వాత ప్రభుత్వంలోకి వచ్చి రైతులను నట్టేట ముంచింది. సోమవారంతో వానకాలం సీజన్ ముగిసింది. పంట పెట్టుబడికి ముందుగానే ఇవ్వాల్సిన రైతుబంధు పంట అయిపోయే దశకు వచ్చినా ఇవ్వలేదు. వానకాలం కూడా అయిపోయింది. రైతు పెట్టుబడి సాయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పట్లో ఇచ్చేలా లేదు. పెట్టుబడి సాయం లేక ఎంతోమంది చిన్న, సన్నకారు రైతులు అప్పుల పాలయ్యారు.
-దొడ్డపునేని శ్రీదేవి, మహిళా రైతు, కొత్తకారాయిగూడెం
గత ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు ఎన్నో విధాల సహాయ సహకారాలు అందించారు. రైతును రాజుగా చేసేందుకు ఎనలేని కృషి చేశారు. అన్నదాతలను అన్ని విధాలా ఆదుకున్నారు. రైతుబంధు, రైతుబీమా అందించారు. కానీ.. ప్రస్తుత ప్రభుత్వం విత్తనాలు, ఎరువులు, కరెంట్ సహా అని విషయాల్లో ఇబ్బంది పెడుతున్నది. అదిగో ఇదిగో పెట్టుబడి సాయం అంటూ కాలం వెళ్లదీస్తున్నది. వానకాలం కాస్తా అయిపోయింది. రైతులను ఏం చేయాలనుకుంటున్నారు?
-చెక్కిలాల లక్ష్మణరావు, రైతు, ఉప్పలచెలక
వానకాలం ముగిసినా పంటల పెట్టుబడి సాయాన్ని కాంగ్రెస్ సర్కారు అందించలేదు. రైతు భరోసాపై మంత్రులు ఎవరికి తోచినట్లుగా వారు మాట్లాడుతున్నారు. రేవంత్‌రెడ్డి సర్కారు రైతు భరోసా పథకాన్ని అటకెక్కించింది. వానకాలం ఆరంభంలోనే రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తామని గొప్పలు చెప్పిన ప్రభుత్వం.. ఇప్పటి వరకూ దాని ఊసు ఎత్తడం లేదు. రైతులను మోసం చేసిన ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో గుణపాఠం తప్పదు.
-యక్కంటి కృష్ణారెడ్డి, రైతు, ఏడూళ్లబయ్యారం
రైతుబంధు కోసం ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నా. అదిగో వేస్తాం.. ఇదిగో వేస్తాం అని చెప్పినప్పుడల్లా ఎదురు చూడడమే మా వంతు అయ్యింది. కానీ.. సీజన్ పోయినా కూడా ఇంతవరకు మా ఖాతాల్లో డబ్బులు వేయలేదు. గత ముఖ్యమంత్రి కేసీఆర్ పంటకు ముందే రైతుబంధు ఇచ్చి అన్ని విధాల కృషి చేశారు. పెట్టుబడి కోసం ఇప్పుడు పడుతున్న ఇబ్బందులు ఎన్నడూ పడలేదు.
-వెలివెల కృష్ణయ్య, రైతు, పెనుబల్లి
వానకాలం పంట చేతికొచ్చే సమయానికి కూడా రైతు భరోసా రాకపాయే. అప్పు తెచ్చి సాగు చేయాల్సి వచ్చింది. రైతు భరోసా వస్తుందో రాదో తెలియదు. పంటలకు పెట్టుబడికి సాయం అందక ఇబ్బందులు పడుతున్నాం. గత కేసీఆర్ ప్రభుత్వంలో సాగుకు ముందుగానే రైతుబంధు వచ్చింది. అప్పుడు పెట్టుబడి భారం లేకపాయే. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా అందించి ఆదుకోవాలి.
-వీరబోయిన మోహనరావు, రైతు, మర్రిగూడెం