బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు మురుసు పట్టింది. సోమవారం రోజంతా నిరాటంకంగా వర్షం కురిసింది. అదీగాక ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు భద్రాద్రి జిల్లాకు వరద పోటెత్తింది. భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం క్రమేపీ పెరుగుతోంది. వాజేడు, వెంకటాపురం మండలాల్లో ఉధృతి భారీగా పెరగడంతో దుమ్ముగూడెం వద్ద పర్ణశాలకు వరద పోటెత్తింది. పర్ణశాల వద్ద నారచీరల ప్రాంతం నీట మునిగింది. ఇక, జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల చెరువులు మత్తళ్లు పోస్తున్నాయి. వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి.
భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ) : మణుగూరు మండలం పగిడేరు వాగు పొంగడంతో ఎగువ ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అశ్వాపురం మండలం గొందిగూడెం – ఎకలకగూడెం గ్రామాల మధ్య వాగు పొంగడంతో అక్కడ కూడా రాకపోకలు నిలిచిపోయాయి. ఇక, చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరింది. 17 వేల క్యూసెక్కుల నీటిని అధికారులు బయటకు వదులుతున్నారు. పాల్వంచ మండలం కిన్నెరసాని ప్రాజెక్టులో 407 అడుగుల పూర్తిస్థాయి నీటిమట్టానికి గాను ప్రస్తుతం 404 అడుగుల మేర నీళ్లు ఉన్నాయి. దీంతో అధికారులు ఒక గేటు నుంచి నీటిని విడుదల చేస్తున్నారు. రాత్రికి వరద మరింత పెరిగితే మరో రెండు గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతామని అధికారులు తెలిపారు. ఇక, సుజాతనగర్ మండలం సింగభూపాలెం చెరువులో కూడా అలుగు పారుతోంది.
భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. సోమవారం ఉదయం 5 గంటలకు 34.1 అడుగుల వద్ద ఉన్న ప్రవాహం గోదావరి ఉదయం 10 గంటలకు 35.7 అడుగులకు, మధ్యాహ్నం 3 గంటలకు 37.1 అడుగులకు, రాత్రి 10 గంటలకు 38.50 అడుగులకు చేరింది. రాత్రికి వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను ముందస్తుగా అప్రమత్తం చేస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో గర్భిణులను పీహెచ్సీలకు తరలించేలా చర్యలు చేపడుతున్నారు. దుమ్ముగూడెం హెడ్ లాకుల సమీపంలో 17 అడుగుల వద్ద గోదావరి ప్రవహిస్తోంది. సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో తూరుబాక వాగు పొంగి ప్రవహిస్తోంది.
రానున్న నాలుగు రోజులూ వర్ష సూచనలు ఉన్నందున కూసుమంచి మండలం పాలేరు జలాశయానికి వరద మరింత పెరిగే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే, పాలేరు పూర్తిస్థాయి నీటిమట్టం 23 అడుగులు అయినప్పటికీ సోమవారం సాయంత్రానికి 22.25 అడుగులకు తగ్గింది. ఒకవేళ వరద అకస్మాత్తుగా పెరిగే అధికారులను అప్రమత్తం చేస్తామని ఇరిగేషన్ ఎస్ఈ మంగళంపుడి వెంకటేశ్వర్లు తెలిపారు.
ప్రముఖ పుణ్యక్షేత్రమైన పర్ణవాల వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. భారీ వర్షాలకు సీత వాగు పొంగడంతో చరిత్రాత్మకమైన సీతమ్మవారి నార చీరెల ప్రాంతం పూర్తిగా నీట మునిగింది. అలాగే, చిన్న గుబ్బలమంగి వాగులో అలుగుపడి ఉధృతంగా ప్రవహిస్తోంది.
చెరువులను తలపిస్తున్న పొలాలు..
కరకగూడెం మండలంలో చెరువులు నిండుకుండలను తలపిస్తున్నాయి. పంటపొలాలు చెరువులుగా మారాయి. ఈ మండలంలోని కొత్తగూడెం – కొరంవారిగుంపు గ్రామాల మధ్య చప్టా ప్రమాదకరంగా మారడంతో ఇరు గ్రామాలకూరాకపోకలు నిలిచిపోయాయి. అయినప్పటికీ స్థానికులు ప్రమాదకరంగా చప్టాను దాటుతుండడంతో అధికారులను ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. అశ్వాపురం మండలం గొందిగూడెం కొత్తూరు – ఎలకలగూడెం గ్రామాల మధ్య ఉన్న ఇసుక వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. అధికారులు ఆ మార్గంలో రాకపోకలు నిలిపివేశారు.
చర్ల మండలం తాలిపేరు ప్రాజెక్టులోకి ఎగువన ఉన్న ఛత్తీస్గఢ్ నుంచి వరద వచ్చి చేరుతోంది. అప్రమత్తమైన అధికారులు సోమవారం సాయంత్రం ఆరు గంటల సమయానికి 8 గేట్లను 3 అడుగుల మేర, 2 గేట్లను పూర్తిగా ఎత్తి 23 వేల క్యూసెక్కుల నీటిని దిగువనున్న గోదావరిలోకి వదిలారు. రిజర్వాయర్ పూర్తి సామర్థ్యం 74 మీటర్లుండగా ప్రస్తుతం 72.31 మీటర్ల వద్ద నీటి నిల్వ ఉంది.