ఖమ్మం వ్యవసాయం, మే 2: దాదాపు పక్షం రోజులు కావొస్తున్నా ఉమ్మడి జిల్లాను అకాల వర్షాలు విడువడం లేదు. గత నెల 20 నుంచి జిల్లాలో రోజు విడిచి రోజు వాన కురుస్తూనే ఉంది. వాన ఎప్పుడు విడిచిపోతుందా? కోసిన పంటను అమ్ముకుందామా? అనుకుంటూ రైతులు ఎదురు చూస్తున్నారు. దీంతో అన్నదాతలు అయోమయంలో పడ్డారు. కోసిన పంటను ఆరబెట్టుకునే ప్రయత్నం చేస్తున్న తరుణంలోనే మరో రోజు భారీ గాలులతో కూడిన వర్షం కురుస్తోంది. వ్యవసాయ శాఖ అధికారులు సైతం పంటను అంచనా వేయలేని పరిస్థితిలో లేరు. అయినప్పటికీ ఇప్పటికే మూడు దఫాలుగా పంటనష్టం వేసి ప్రాథమిక నివేదికను ఉన్నతాధికారులకు అందజేశారు.
తడిసిన పంటను ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, ఏ ఒక్క రైతూ అధైర్య పడవద్దని ప్రజాప్రతినిధులు కల్లాలను సందర్శించి రైతులకు భరోసా కల్పిస్తున్నారు. ఇప్పటికే ధాన్యం కొనుగోలు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆయా మండలాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. మరో రెండు రోజుల్లో మక్కలు కొనుగోలు చేసేందుకు కూడా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసే ప్రయత్నాల్లో ఉంది. అయితే మక్క పంటను ఇప్పటికే కోసినప్పటికీ, వరి పొలాలను ఆయా మండలాల్లో కోయాల్సి ఉంది. దీంతో ఆయా గ్రామాల్లో వరి పొలాలు నేలకు ఒరిగిపోతున్నాయి. వెన్నులు రాలిపోవడంతో రైతులు నష్టపోతున్నారు.
21 మిల్లీమీటర్ల వర్షపాతం..
గడిచిన 24 గంటల్లో (సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు) ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 21.1 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా రఘునాథపాలెం మండలంలో 48.4 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. సింగరేణి మండలంలో 36.2 మి.మీ, ఖమ్మం అర్బన్ మండలంలో 34.2 మి.మీ, ఏన్కూరు మండలంలో 33.1 మి.మీ, మిగిలిన మండలాల్లో 20 నుంచి 30 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. వారం రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు దెబ్బతిన్న పంట పొలాలను జిల్లా వ్యవసాయశాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు పరిశీలిస్తున్నారు.