– ఎకరానికి రూ.91 లక్షలు చెల్లించాలని డిమాండ్
– ఇళ్ల స్థలానికి గజానికి రూ.20 వేలు చెల్లించాలి
– గ్రామ సభలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్కు కారేపల్లి నిర్వాసితుల వినతి
కారేపల్లి, అక్టోబర్ 24 : డోర్నకల్ – భద్రాచలం రోడ్ రైల్వే లైన్ డబ్లింగ్ పనుల్లో వ్యవసాయ భూములు, ఇండ్లు కోల్పోతున్న నిర్వాసితులందరికీ మార్కెట్ రేటు ప్రకారం డబ్బులు చెల్లించి న్యాయం చేయాలని భూ సేకరణ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రాజేశ్వరికి కారేపల్లి భూ నిర్వాసితులంతా కలిసి వినతి పత్రం అందజేశారు. మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో శుక్రవారం రైల్వే లైన్ డబ్లింగ్ భూ నిర్వాసితులతో గ్రామ సభ నిర్వహించారు. ఈ సభలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పాల్గొని భూ సేకరణ నిబంధనలను వెల్లడించారు. భూ నిర్వాసితులు ఇచ్చిన విన్నపాలను కూడా ఉన్నతాధికారులకు నివేదిస్తానని తెలిపారు. ఈ గ్రామ సభలో పలువురు నిర్వాసితులు మాట్లాడుతూ.. సింగరేణి రెవెన్యూ గ్రామం నాన్ ఏజెన్సీ కాబట్టి వ్యవసాయ భూములకు ఎకరానికి రూ.91 లక్షల చొప్పున, ఇండ్లు కోల్పోయిన వారికి గజం ఒక్కింటికి రూ.20 వేల చొప్పున మార్కెట్ రేటు చెల్లించాలని భూ నిర్వాసితులు కోరారు.
రెవెన్యూ రికార్డుల ప్రకారం మార్కెట్ వ్యాల్యూ చూసినా కారేపల్లికికి చెందిన భవనాసి గణేష్ సర్వే నెంబర్ 200/2/1/1 లో రూ.91,48,000గా చూపుతోందని, గుండెబోయిన కోటేశ్వరరావుకు చెందిన సర్వే నంబర్ 77ఆ/2 లో రూ.11,25,000 గా నమోదయిందన్నారు. ఇదే గ్రామానికి చెందిన ముండ్ల సుధాకర్ సర్వే నంబర్ 52అ/6 లో రూ.11,25,000 గా భూ భారతిలో మార్కెట్ వాల్యూ నమోదై ఉన్నదని పేర్కొన్నారు. ఈ ముగ్గురు రైతుల పేర్లు భూ సేకరణ ఫైనల్ గెజిట్ జాబితాలో ఉన్నాయి కాబట్టి ఈ మార్కెట్ వ్యాల్యూలను కూడా పరిగణలోకి తీసుకుని న్యాయం చేయాలని భూ నిర్వాసితులు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ను వేడుకున్నారు. ఈ గ్రామ సభలో తాసీల్దార్ రమేశ్, రైల్వే జేఈ శ్రీకాంత్, ఏఓ అశోక్, సర్వేయర్ కిరణ్ పాల్గొన్నారు.

Karepally : ‘రైల్వే లైన్ భూ నిర్వాసితులకు మార్కెట్ రేటు చెల్లించాలి’