మణుగూరు టౌన్, జూన్ 22 : కనీసం అంబులెన్స్ వెళ్లేందుకూ మార్గంలేని కారణంగా ఓ వ్యక్తి ఊపిరి అనంతవాయువుల్లో కలిసిన అమానవీయ ఘటన భద్రాద్రి జిల్లా మణుగూరులో సోమవారం చోటుచేసుకుంది. ఇసుక లోడింగ్, ట్రాన్స్‌పోర్టు కోసం స్థానిక గోదావరి ఇసుక ర్యాంపుల వద్దకు వచ్చి వెళ్లే భారీ లారీలు మణుగూరు ఏడూళ్లబయ్యారం మార్గంలో దండు కడుతున్నాయి. కిలోమీటర్ల మేర రహదారిని ఆక్రమిస్తున్నాయి. రోడ్డు మధ్యన కనీసం మనుషులు నడిచి వెళ్లేందుకు కూడా వీల్లేనంతగా లారీలన్నీ రోడ్డుపై నిలిచి ఉంటున్నాయి. చాలా నెలలుగా ఈ సమస్య ఉన్నప్పటికీ, నమస్తే తెలంగాణ సహా వివిధ మాధ్యమాలు ఈ సమస్యను వెలుగులోకి తెచ్చినప్పటికీ ప్రభుత్వం, యంత్రాంగం స్పందించలేదు. ఇసుక ఆదాయం మీద తప్ప స్థానికులు, ప్రయాణికుల ఇబ్బందుల గురించి పట్టించుకోని ప్రభుత్వం.. ఈ సమస్యను తీవ్రమైనదిగా భావించలేదు. దీంతో ఈ మార్గంలో వేలాది ఇసుక లారీలు రహదారికి ఇరువైపులా దండు కడుతున్నాయి.
కనీసం ఇతర వాహనాలు వెళ్లేందుకు వీల్లేనంతగా రహదారిని ఆక్రమిస్తున్నాయి. గంటల తరబడి వేచి ఉంటేగానీ కిలో మీటరు దూరాన్ని దాటి వెళ్లలేని పరిస్థితి. అంబులెన్సుల్లోని రోగులతోపాటు ఆర్టీసీ బస్సుల్లోని ప్రయాణికులదీ అదే దయనీయ స్థితి. తాజాగా చోటుచేసుకున్న విషాదకర ఘటన.. ఇసుక లారీల దండు వల్ల ప్రజల ప్రాణాలకు ఎంతటి ముప్పు ఉందోనన్న స్పష్టతనిచ్చింది. మణుగూరు మండలంలోని దమ్మక్కపేట గ్రామానికి చెందిన కొమరం వంశీ (33) కుటుంబ కలహాల నేపథ్యంలో సోమవారం పురుగులమందు తాగాడు. ఈ విషయాన్ని గమనించిన అతడి కుటుంబ సభ్యులు, స్థానికులు వెంటనే అంబులెన్స్ ద్వారా అతణ్ని మణుగూరు ఆసుపత్రికి తరలిస్తున్నారు.
అప్పటికే ఏడూళ్లబయ్యారం మణుగూరు మార్గంలో సాంబాయిగూడెం నుంచి రామానుజవరం రహదారిపై సుమారు రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచి ఉన్నాయి. వాటి మధ్య నుంచి కనీసం మనుషులు నడిచి వెళ్లేందుకు కూడా వీల్లేనంతగా రహదారిపై నిలిపి ఉన్నాయి. దీంతో అప్పటికే భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఆర్టీసీ బస్సులు కూడా ఆ ట్రాఫిక్‌లోనే చిక్కుకొని ఉన్నాయి. అదే సమయంలో వంశీని ఆసుపత్రికి తరలిస్తున్న అంబులెన్స్ కూడా వచ్చింది. సుమారు రెండు కిలోమీటర్ల మేర నిలిచి ఉన్న ఇసుక లారీలను దాటడం వీలు కాలేదు. దీంతో వంశీ కుటుంబ సభ్యులు నలుగురు కలిసి అతడిని తమ భుజాలపై మోసుకుంటూ ఇసుక లారీలను దాటారు. అక్కడ మరో వాహనం ఎక్కించుకొని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే పరిస్థితి విషమించి వంశీ మృతిచెందాడని, ఓ అర్ధగంట ముందైనా అతడిని తీసుకొచ్చి ఉంటే బతికేవాడని వైద్యులు తెలిపారు. దీంతో అతడి కుటుంబ సభ్యులు బోరున విలపించారు. రహదారిపై నిలిచిన ఇసుక లారీలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
మణుగూరు సమీపంలోని గోదావరిలో ఇసుక ర్యాంపులు ఉండడంతో ఇసుక రవాణా కోసం వేలాది లారీలు కొన్ని నెలలుగా నిత్యం ఇక్కడికి వస్తున్నాయి. ఇసుక లోడ్ చేసుకొని హైదరాబాద్ వంటి సుదూర ప్రాంతాలకు రవాణా చేస్తున్నాయి. ఈ క్రమంలో ఇసుక లోడింగ్ కోసం వచ్చిన లారీలు తమ క్యూ వచ్చే వరకూ మణుగూరు ఏడూళ్ల బయ్యారం మార్గంలో రహదారి పక్కన నిలిచి ఉంటున్నాయి. ముఖ్యంగా సాంబాయిగూడెం రామానుజవరం మధ్య రహదారికి ఇరువైపులా గుట్టలు ఉండడంతో పార్కింగ్‌కు చోటులేక డ్రైవర్లందరూ లారీలను రహదారిపైనే నిలిపి ఉంచుతున్నారు.
దీంతో రోడ్డుకు ఇరువైపులా నిలిపి ఉన్న లారీల మధ్య కనీసం బైక్ వెళ్లేందుకుగానీ, లేదంటే మనుషులు నడిచి వెళ్లేందుకు గానీ చోటు ఉండడం లేదు. దీంతో నిత్యం ఇక్కడ ట్రాఫిక్ జామ్ అవుతోంది. ఆర్టీసీ బస్సులు కూడా ఈ రెండు కిలోమీటర్ల ప్రయాణానికి గంటల తరబడి సమయం తీసుకుంటున్నాయి. దూర ప్రాంతాల నుంచి మణుగూరుకు వచ్చే బస్సుల్లో వచ్చే ప్రయాణికులు ఇక్కడ ట్రాఫిక్‌లో చిక్కుకుంటే వారే.. స్వచ్ఛందంగా బస్సు దిగి నడుచుకుంటూ మణుగూరుకు చేరుకుంటున్నారు. ఈ ప్రదేశంలో ఇసుక లారీల వల్ల ప్రమాదాలకు గురైన వారూ ఉన్నారు. రెండు రోజుల క్రితం ఈ ట్రాఫిక్‌లో చిక్కుకున్న ఓ విద్యార్థిని నీట్ పరీక్షకు చేరుకోలేకోయింది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులు, క్షతగాత్రులు నిత్యం ట్రాఫిక్‌లో చిక్కుకుంటుండడం గమనార్హం.