రఘునాథపాలెం : రఘునాథపాలెం మండల కేంద్రంలో ఏర్పాటు చేసే మెగా పార్క్‌ను మోడల్‌గా తీర్చిదిద్దాలని రాష్ట్ర రవాణాశాఖా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అధికారులను ఆదేశించారు. రఘునాథపాలెం రెవిన్యూ సర్వే నెం.22లో బృహత్ పల్లెప్రకృతి వనం ఏర్పాటు కోసం కేటాయించిన స్థలాన్ని బుధవారం జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్‌తో కలిసి మంత్రి పరిశీలించారు. పార్క్‌కు ఆనుకొని అయ్యవారికుంట ఉండటంతో చెరువును సైతం ట్యాంక్‌బండ్ మాదిరిగా అభివృద్ది చేయాలన్నారు. చెరువును కలుపుకొని సర్వే నెం.21,22లలో 20ఎకరాలు ఉన్నట్లు తహసీల్దార్ నర్సింహారావు మంత్రి దృష్టికి తీసుకరావడంతో మొత్తం స్థలాన్ని మెగా పార్క్ కోసం కేటాయించాలని సూచించారు. వెంటనే పనులు ప్రారంభించి చుట్టూ ట్రెంచ్ కొట్టాలన్నారు.
20ఎకరాల సువిశాల ప్రాంగణంలో నిత్యం మండల ప్రజలు వాకింగ్ చేసుకునేందుకు వాకింగ్ ట్రాక్, పిల్లలు ఆడుకునేందుకు ఆటువస్తువులతో కూడిన చిల్డ్రన్స్ పార్క్, చెరువును లోటస్ పాండ్‌గా తీర్చిదిద్దాలన్నారు. అంతేకాక పార్క్‌కు ఓ పక్కన పెద్ద ఎత్తున మొక్కలు నాటి అడవిని తలపించేలా మొక్కలను నాటాలన్నారు. పట్టణాల్లోని పార్క్‌లకు తీసిపోని విధంగా బృహత్ పల్లె ప్రకృతి వనంలో సదుపాయాలు కల్పించాలని సూచించారు. ఈ మేరకు త్వరితగతిన పనులు ప్రారంభించాలని ఈ సందర్భంగా మంత్రి అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో అధనపు కలెక్టర్లు మధుసూదన్‌రావు, స్నేహలత మొగిలి, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, ఏఎంసీ చైర్మన్ లక్ష్మీప్రసన్న, వైస్ చైర్మన్ కొంటెముక్కల వెంకటేశ్వర్లు, జెడ్పీటీసీ మాళోతు ప్రియాంక, వైస్ ఎంపీపీ గుత్తా రవికుమార్, టీఆర్ఎస్ మండల పార్టీ అద్యక్షుడు కుర్రా భాస్కర్‌రావు, రఘునాథపాలెం సర్పంచ్ గుడిపూడి శారధ, ఉపసర్పంచ్ కుందేసాహెబ్, నాయకులు గుడిపుడి రామారావు, సుడా డైరెక్టర్ దేవభక్తుని కిషోర్‌బాబు, వాంకుడోతు సురేష్, ఎంపీడీవో రామకృష్ణ, గ్రామ కార్యదర్శి ప్రసన్నకుమార్, ఫారెస్ట్ అధికారులు పాల్గొన్నారు.