బోనకల్లు, మార్చి 22 : కాంగ్రెస్ ఆరు గ్యారెంటీ పథకాల అమల కోసం క్షేత్రస్థాయిలో సీపీఎం పోరాటాలకు రూపకల్పన చేస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు పొన్నం వెంకటేశ్వరరావు, మధిర డివిజన్ కార్యదర్శి మడిపల్లి గోపాల్ రావు తెలిపారు. శనివారం స్థానిక వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమరవీరుల భవనంలో సీపీఎం మండల కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అధికారం కోసం ఎన్నికల సమయంలో కాంగ్రెస్ అమలకు సాధ్యం కానీ అనేక హామీలను ఇచ్చిందన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయకుండా తెలంగాణ ప్రజలను మోసం చేస్తుందని విమర్శించారు.
ఆరు గ్యారంటీ పథకాల్లో కేవలం ఒక పథకాన్ని మాత్రమే అమలు చేసి తాము అన్ని సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు ప్రకటనలు చేస్తూ ప్రజలను మోసం చేసే ప్రయత్నాలు చేస్తున్నారని, ఈ ప్రయత్నాలను సీపీఎం తిప్పి కొడుతుందన్నారు. గ్రామ స్థాయిలో సంక్షేమ పథకాల అమలుపై, అందవలసిన సంక్షేమ పథకాలపై సర్వే నిర్వహించనున్నట్లు, ఈ సర్వే ఆధారంగా క్షేత్రస్థాయిలో ప్రజా పోరాటాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రజలను ఎంతో కాలం మోసం చేయలేరని వారు స్పష్టం చేశారు. రైతు రుణమాఫీ కాంగ్రెస్ ప్రభుత్వం అంకెల గారడీలతో రైతులను మోసం చేస్తుందని విమర్శించారు. బోనకల్లు మండలంలో 15,500 ఎకరాల్లో అన్నదాతలు యాసంగిలో మొక్కజొన్న పంటను సాగు చేశారని తెలిపారు. వారబందీ విధానం వల్ల మండలంలో చివరి ఆయకట్టుకు సాగరనీరు అందక పంటలు ఎండిపోయినట్లు చెప్పారు. దళారులు గ్రామాల్లోకి ప్రవేశించక ముందే ప్రభుత్వమే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలని కోరారు.
పాలకులు అనుసరిస్తున్న విధానాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విమర్శలు చేసుకోవడం మినహా వారు చేసిన అభివృద్ధి ఏమీ లేదన్నారు. సీతారామ ప్రాజెక్ట్ పూర్తి చేయడం వల్లనే ఉమ్మడి ఖమ్మం జిల్లా సస్యశ్యామలం అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు దొండపాటి నాగేశ్వరరావు, పూర్వ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు చింతలచెరువు కోటేశ్వరరావు, మండల కార్యదర్శి కిలారు సురేశ్, నాయకులు కారంగుల చంద్రయ్య, తుళ్లూరు రమేశ్, దొండపాటి సత్యనారాయణ, గుగులోత్ నరేశ్, చిట్టిమోదు నాగేశ్వరరావు, తెల్లాకుల శ్రీనివాసరావు, బంధం శ్రీనివాసరావు, కందికొండ శ్రీనివాసరవు, పసుపులేటి నరేశ్, తుళ్లూరు రమేశ్, నిమ్మల రామారావు, నోముల పుల్లయ్య, పిల్లలమర్రి వెంకట అప్పారావు, మర్రి తిరపతిరావు, కూచిపూడి మురళీకృష్ణ పాల్గొన్నారు.