బోనకల్లు, మార్చి 10 : తెలంగాణ రైతులకు ప్రతి ఎకరానికి నీరు సరఫరా అయిన తర్వాతే ఆంధ్రాకు నీళ్లిస్తామని ఇరిగేషన్ కల్లూరు ఎస్ఈ గాలి వాసంతి తెలిపారు. పంటలు వెలవెల.. రైతులు విలవిల, ఆంధ్రాకు నీళ్లా పేరిట నమస్తే తెలంగాణ దినపత్రికలో సోమవారం ప్రచురితమైన వార్తకు ఇరిగేషన్ ఉన్నతాధికారులు స్పందించారు. జిల్లా ఇరిగేషన్ అధికారులు బీబీసీ కెనాల్ కు సరఫరా అవుతున్న నీటిని పరిశీలించాలని ఆదేశించడంతో కల్లూరు నీటి పారుదల శాఖ ఎస్ఈ వాసంతి.. మధిర ఈఈ రామకృష్ణ, బోనకల్లు డీఈ తమ్మారపు వెంకటేశ్వర్లు, మధిర డీఈ నాగ బ్రహ్మయ్యతో కలిసి సరఫరా అవుతున్న సాగునీరును పరిశీలించారు. బీబీసీ కెనాల్, కలకోట మేజర్, ఆళ్లపాడు మైనర్, నారాయణపురం మేజర్, వల్లపురం, రాపల్లి మేజర్లను పరిశీలిస్తూ అధికారులకు తగు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా ఎస్ఈ వాసంతి నమస్తే తెలంగాణతో మాట్లాడుతూ.. బోనకల్లు బ్రాంచ్ కెనాల్ పరిధిలోని ప్రతి ఎకరానికి ప్రభుత్వ ఆదేశాల మేరకు సాగునీరు సరఫరా చేసేందుకు పర్యవేక్షణ చేస్తున్నట్లు తెలిపారు. జీరో రెగ్యులేటర్ కొనిజర్ల నుంచి 21 రెగ్యులేటర్ వరకు అన్ని షట్టర్లను క్లోజ్ చేసి బీబీసీ కెనాల్‌కు నీటి సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. రైతులు కూడా సాగు నీటిని సద్వినియోగం చేసుకుని తోటి రైతులకు సహకరించాలన్నారు. చివరి భూముల వరకు సాగు నీటిని సరఫరా చేసి పంటలను కాపాడుతామన్నారు.
రైతులు సమన్వయం పాటించి అధికారులకు సహకరించాలని కోరారు. 1,300 క్యూసెక్కుల నీటిని బీబీసీ కెనాల్ కి సరఫరా చేస్తే కాల్వకు ఇబ్బందులు తలెత్తినట్లు చెప్పారు. అందుకోసమే కేవలం 1,000 క్యూసెక్కుల నీరు మాత్రమే తీసుకుంటున్నామన్నారు. ఈ నీళ్లు కూడా జీరో నుంచి 54 కిలోమీటర్ల వరకు వెళ్లవలసి ఉందన్నారు. కానీ బీబీసీ కెనాల్ పరిధిలోని రైతులకు నీరు సరఫరా చేసిన తర్వాతనే కింద ప్రాంతమైన ఆంధ్రాకు పంపించడం జరుగుతుందన్నారు. రైతులు ఆందోళన చెందవద్దని చివర భూముల వరకు సాగునీటిని సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు.