ఖమ్మం రూరల్, జూలై 14 : ఖమ్మం జిల్లా ఖమ్మంరూరల్ మండలంలోని కస్నాతండా గ్రామానికి చెందిన మహిళ సోమవారం విద్యుత్ హైటెన్షన్ వైర్లు తగిలి మృతిచెందింది. దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు స్థానిక విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట మృతదేహంతో ధర్నా చేసి కార్యాలయంపై దాడి చేశారు. పూర్తి వివరాల్లోకెళ్తే.. కస్నాతండాకు చెందిన మారుతి ముత్తమ్మ(44) సోమవారం ఉతికిన దుస్తులను డాబా గోడపై ఆరేసే క్రమంలో చీర హైటెన్షన్ విద్యుత్ వైర్లకు తగలడంతో మంటలంటుకొని అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది.
దీంతో కుటుం బ సభ్యులు, గ్రామస్తులు ఆగ్రహించి మృతదేహంతో స్థానిక పల్లెగూడెం విద్యు త్ సబ్‌స్టేషన్ ఎదుట ఖమ్మం -మహబూబాబాద్ జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు. మహిళ కుటుంబానికి పరిహారం చెల్లించాలని, తక్షణమే హైటెన్షన్ వైర్లను తొలగించాలని డిమాండ్ చేశారు. పలు పార్టీల నాయకులు సైతం మద్దతు తెలిపారు.
యువకులు ఆగ్రహంతో సబ్‌స్టేషన్ కార్యాలయంపై దాడి చేశారు. తలుపులు, ఇతర వస్తు సామగ్రిని ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న ఖమ్మంరూరల్ పోలీసులు సీఐ ముష్కారాజ్ ఆధ్వర్యంలో ఆందోళనకారులను చెదరగొట్టారు. విద్యుత్‌శాఖ తరఫున మృతురాలి కుటుంబానికి రూ.2 లక్షలు, ప్రభుత్వం తరఫున మరో రూ.5 లక్షల పరిహారం అందజేస్తామని తహసీల్దార్ పీ.రాంప్రసాద్ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. మహిళ మృతదేహాన్ని పోలీసులు ఖమ్మం ప్రభుత్వ వైద్యశాలకు పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
కస్నాతండాలో విద్యుత్ షాక్‌తో మృతిచెందిన ముత్తమ్మ ఇంటి విద్యుత్ కనెక్షన్‌కు అనుమతి లేదని ఎస్ఈ ఇనుగుర్తి శ్రీనివాసచారి ఒక ప్రకటనలో తెలిపారు. ముత్తమ్మ కొత్త ఇంటిని 11 కేవీ విద్యుత్ లైన్ కింద నిర్మించుకున్నదని, ఇంటికి నాలుగు ఫీట్ల దూరంలో విద్యుత్ వైర్లు ఉన్నాయని, ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున కనెక్షన్ ఇవ్వడం కుదరదని హెచ్చరించినా ఇంటి నిర్మాణం చేపట్టిందని పేర్కొన్నారు. అధికారుల అనుమతి లేకుండా విద్యుత్ వినియోగిస్తుండడంతో ఏప్రిల్ 19వ తేదీన ఆమెపై విద్యుత్ చౌర్యం కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. విద్యుత్ లైన్ల కింద ఇండ్లు నిర్మించుకోవద్దని, లైన్లు మార్చడానికి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.