కారేపల్లి, జూలై 14 : కారేపల్లి పెద్దచెరువు, కుంటలో అక్రమంగా మట్టి తవ్వకాలు చేస్తున్నారని, వాటిని నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం కారేపల్లి తాసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. కారేపల్లి మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఆధ్వర్యంలో మత్స్యకారులు, గ్రామస్తులు ఈ ధర్నా పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇండ్లకు మట్టి పేరుతో అక్రమార్కులు యదేచ్ఛగా పెద్దచెరువు, కుంటలలోని మట్టిని అమ్ముకుంటున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. చెరువులో పెద్ద గుంతలు తీయటంతో అవి ప్రమాద భరితంగా మారి మత్స్యకారులకు ప్రమాదం జరిగే అవకాశం ఉందన్నారు.
ఇప్పటికే కబ్జాతో చెరువు కుచించుకపోయిందని, అక్రమ మట్టి తవ్వకాలతో మత్స్యకారుల జీవనంపై ప్రభావం పడుతుందన్నారు. వెంటనే మట్టి తోలకాలు ఆపటానికి చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. వినతిపత్రాన్ని తాసీల్దార్ అనంతుల రమేశ్‌కు అందజేశారు. ఈ కార్యక్రమంలో మత్స్య సహకారం సంఘం అధ్యక్ష, కార్యదర్శులు తురక సాంబయ్య, చింతల సంపత్‌కుమార్, తురక రాంబాబు, అక్కుల రామకృష్ణ, తురక నారాయణ, నాగరాజు, చింతల హన్మంతు, పిట్టల సత్యనారాయణ పాల్గొన్నారు.