కారేపల్లి, సెప్టెంబర్ 13 : ఖమ్మం జిల్లా సింగరేణి (కారేపల్లి) మండల పరిధిలోని కారేపల్లి క్రాస్ రోడ్ (రామలింగాపురం)లో నూతనంగా సైడ్ డ్రైనేజీ నిర్మాణం చేపట్టేందుకు అధికారులు శనివారం ప్రతిపాదనలు రూపొందించారు. గత నెల 28వ తేదీన ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన్ స్థానికుల అభ్యర్థన మేరకు గ్రామంలో పర్యటించి డ్రైనేజీ సమస్యను పరిశీలించారు. సైడ్ కాలువల నిర్మాణానికి అయ్యే వ్యయ ప్రతిపాదనలను సంబంధిత అధికారులతో రూపొందించి తనకు పంపించాలని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర మాజీ ఎంపీపీ, జడ్పిటిసి, ఆత్మ కమిటీ చైర్మన్ ముత్యాల సత్యనారాయణకు సూచించారు.
దీంతో పంచాయతీరాజ్ అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ), వర్క్ ఇన్స్పెక్టర్ వినయ్ కారేపల్లి క్రాస్ రోడ్ ను శనివారం సందర్శించి సైడ్ కాలువలకు కొలతలు వేశారు. సంబంధిత ప్రతిపాదనను ఎంపీ వద్దిరాజు రవిచంద్రకు అందజేయనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కాంట్రాక్టర్ బానోతు రాందాస్, మాజీ వార్డు సభ్యుడు సిద్ధంశెట్టి నాగయ్య, బీఆర్ఎస్ యూత్ నాయకులు షేక్ సైజన్, సురభి సాగర్, షేక్ పెద్ద పాషా, గ్రామ పెద్దలు కంసాని వెంకన్న, అనుముల నర్సయ్య, సైజన్ పాల్గొన్నారు.