ఇందులో రూ.133 కోట్లు మెటీరియల్, రూ.199 కోట్లు కూలీల వేతనాలు
20 మండలాల్లో 81.21 లక్షల పని దినాలే లక్ష్యం
మంత్రి అజయ్ చొరవతో రూ.34 కోట్లతో పనులు మంజూరు
గ్రామాల్లో సిమెంట్, కాంక్రీట్ రోడ్లు, డ్రైనేజీలకు ప్రాధాన్యం
మార్గదర్శకాలు జారీ చేసిన ప్రభుత్వం
ఖమ్మం ఫిబ్రవరి 14, (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఖమ్మం జిల్లాలో 2022-23 ఆర్థిక సంతవ్సరానికి 81,21,635 పని దినాలు కూలీలకు కల్పించేందుకు అధికారులు ప్రణాళిక రూపొందించారు. ఇందుకోసం రూ.332 కోట్లతో ప్రతిపాదనలు పంపించారు. వాటిలో రూ.199 కోట్లు కూలీలకు పనిదినాల వారీగా వేతనాలు చెల్లించనున్నారు. రూ.133 కోట్లు మెటీరియల్ కొనుగోలు చేసేందుకు జిల్లా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. గ్రామ పంచాయతీల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, ఇతర అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. పనులకు కేటాయించే నిధుల్లో 75 శాతం ఎన్ఆర్ఈజీఎస్ వాటా కాగా, 25 శాతం రాష్ట్ర ప్రభుత్వ వాటా ధనం.
జిల్లాలో కొనసాగుతున్న పనులు
జిల్లా వ్యాప్తంగా ఉపాధి హామీ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. జిల్లాలో సామాజిక వనాల పెంపకం, వైకుంఠధామాలు, పల్లె ప్రకృతి, బృహత్ వనాలు, హరితహారం, రైతు వేదికలు, మరుగుదొడ్ల నిర్మాణం, పల్లె ప్రగతి పనులకు నిధులు కేటాయించనున్నారు. గ్రామాల్లో అంతర్గత రహదారులను సీసీ రోడ్లుగా మార్చడం, మురుగు కాలువల నిర్మాణం వంటి పనులకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. రానున్న సంవత్సరానికి జిల్లాలో పనులు చేపట్టేందుకు అవసరమైన పనిదినాల ద్వారా నిధులు మంజూరు చేయనున్నారు. ఎంపీడీవోల ద్వారా జిల్లా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేసి ఆమోదం కోసం నివేదికలు పంపించారు. 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 6.86 లక్షల జాబ్ కార్డుదారులకు ఖమ్మం జిల్లాలో 109 లక్షల పనిదినాలు కల్పించాలి. ఇప్పటికే కూలీలకు 60.92 లక్షల పనిదినాలు కల్పించారు. రూ.90.90 కోట్లు చెల్లించారు.
మంత్రి అజయ్ ప్రతిపాదనలతో..
రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ చొరవతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా గ్రామాల్లో సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్స్ నిర్మాణాలకు నిధులు మంజూరు చేస్తూ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధిశాఖ రాష్ట్ర కమిషనర్ శరత్ ఉత్తర్వులు జారీ చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా స్థానిక ప్రజాప్రతినిధుల ద్వారా ప్రతిపాదించిన పనులకు ఈ నిధులు ఖర్చు చేయాలని సూచించారు.
నిధులు ఇలా..
జిల్లా వ్యాప్తంగా 20 మండలాల్లో 247 గ్రామ పంచాయతీల్లో రూ.20.59 కోట్లు, భద్రాద్రి జిల్లాకు రూ.13.85 కోట్లు మంజూరయ్యాయి. ఈ ఏడాది ఇప్పటివరకు ఖమ్మం జిల్లాకు మూడు విడతలుగా ఎన్ఆర్ఈజీఎస్ నిధులు, భద్రాద్రి జిల్లాకు రెండు విడతలుగా నిధులు విడుదలయ్యాయి. ఖమ్మం జిల్లాకు మొదటి విడతగా రూ.8 కోట్లు, రెండో విడతగా రూ.10 కోట్లు, మూడో విడతగా రూ.20.59 కోట్లు విడుదలయ్యాయి. మొత్తం రూ.38.59 కోట్లతో పనులు కొనసాగుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు మొదటి విడతగా రూ.1.69 కోట్లు, రెండో విడతగా రూ.13.85 కోట్లు విడుదల కాగా, మొత్తం రూ.15.50 కోట్లకు చేరాయి. గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణాలకు ప్రాధాన్యం ఇస్తుండడంతో పల్లెల రూపురేఖలు మారుతున్నాయి. ఖమ్మం జిల్లాకు మొదటి, రెండు విడతల్లో రూ.18 కోట్లు మంజూరు కాగా.. పనులు కొనసాగుతున్నాయి. మరో రూ.20.59 కోట్లు మంజూరు కావడంతో యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మొదటి విడతగా రూ.1.69 కోట్లతో పనులు, రెండో విడతలో జిల్లాకు రూ.13.85 కోట్లు మంజూరయ్యాయి. పాత, కొత్త పనులు చేపట్టాల్సి ఉంది.