భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 28 (నమస్తే తెలంగాణ) : ఆ మందు తాకినా వాసన చూసినా చాలా డేంజర్. గడ్డి నివారణ కోసం కొట్టే ఆ మందు పంటలపై తీవ్ర ప్రభావం చూపుతున్నదని ప్రభుత్వమే ఆ గడ్డిమందును నిషేధించింది. ఇంతకీ ఆ మందు పేరు ైగ్ల్రెఫోసెట్. ప్రస్తుతం పురుగు మందుల డీలర్ల వద్ద ఈ మందు దొరకదు. కానీ.. రైతులు మాత్రం గ్రామాల్లో పంటలపై దర్జాగా వినియోగిస్తున్నారు.
ఎక్కువగా ఏజెన్సీ ప్రాంతాల్లో రైతుల వద్ద తరచూ ఈ మందు కనబడుతున్నది. కూలీల కొరత కారణంగా కలుపును నివారించడానికి రైతులకు గడ్డిమందే శరణ్యం. అయితే నిషేధిత మందులను దొడ్డిదారిలో పోస్టల్, ఆన్లైన్ సర్వీసుల ద్వారా కంపెనీల నుంచి నేరుగా తెప్పించుకుంటున్నారు.
ద్రవ పదార్థాలు పార్సిల్ ద్వారా రావాలంటే పోస్టల్ శాఖలో అనుమతి లేదు. అదేవిధంగా ఆన్లైన్ ద్వారా కూడా అనుమతి లేకపోయినా గుట్టుచప్పుడు కాకుండా సిబ్బంది కళ్లు గప్పి అట్టపెట్టెల్లో పార్సిల్ చేసి సరఫరా చేస్తున్నారు. తెలియని సంబంధిత ఆన్లైన్ సిబ్బంది ఎలాంటి పార్సిల్ వచ్చినా డెలివరీ చేయడానికి వెనుకాడడం లేదు. ఒక్కోసారి వాసన పసిగట్టినా మనకెందుకులే అని నోరు మూసుకుంటున్నారు. హైదరాబాద్‌తోపాటు ఇతర ప్రాం తాల నుంచి నేరుగా కంపెనీల నుంచి ఇలాంటి పార్సిళ్లు ప్రత్యక్షమవుతున్నట్లు తెలుస్తుంది. ఇటీవల భద్రాచలం డివిజన్లో పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా పార్సిల్లో వచ్చినట్లు రైతులే చెప్పడం గమనార్హం.
బస్సులు, ఇతర రవాణా సాధనాల్లో వచ్చే ఈ గడ్డిమందు కొంచెం ఓపెన్ అయినా ప్రమాదం కొనితెచ్చుకోవాల్సిందే. ఈ మందు పార్సిల్ కొంచెం లీకు అయి నా బస్సులో ప్రయాణికులకు ఎలర్జీతోపాటు కండ్లు తిరిగి పడిపోయే అవకాశాలు లేకపోలేదు. ఇలాంటి మందుల రవాణాపై అధికారులు నిఘా పెట్టకపోతే భారీ మూల్యం చెల్లించక తప్పదు. గంజాయి వంటి డ్రగ్స్ కూడా ఈ మార్గంలో రవాణా అయ్యే అవకాశాలు లేకపోలేదు. సంబంధిత అధికారులు నిఘా పెట్టి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
దూరప్రాంతాల నుంచి వస్తే మేము నియంత్రించడం కొంచెం కష్టమే అవుతుంది. మా జిల్లా నుంచి అలాంటి పార్సిల్స్ రాకుండా చూస్తున్నాం. రావు కూడా. బయటి నుంచి వచ్చే వాటిపై నిఘా పెడతాం. ద్రవ పదార్థాలు పార్సిల్లో రాకూడదు. డివిజన్ మీటింగ్‌లు పెట్టినప్పుడు అందరికీ తెలియజేస్తాం.
– వీరభద్రస్వామి, పోస్టల్ సూపరింటెండెంట్
నిషేధించిన మందును మన జిల్లాలో ఎవరూ తీసుకురావడం లేదు. ఆన్లైన్లో వస్తే మనం ఏమీ చేయలేం. పంటలు ఉన్నచోట ఆ మందులను వాడకూడదు. అందరికీ తెలుసు. ఆయిల్‌ఫాం ఉన్నచోట వాడుకోవచ్చు. రైతులు తమ అవసరాన్ని స్థానిక ఏవోకి తెలియజేస్తే ఆహార పంటలు లేనిచోట ఇచ్చే అవకాశాలు ఉంటాయి. డీలర్ల వద్ద మాత్రం అలాంటి మందులు లేవు. పక్కాగా తనిఖీలు చేస్తున్నాం.
– బాబూరావు, డీఏవో, భద్రాద్రి కొత్తగూడెం