ఖమ్మం/ అశ్వారావుపేట, జూన్ 4 : ముందస్తు ప్రణాళిక లేకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయం ఇటు రేషన్ డీలర్లకు, అటు లబ్ధిదారులకు ముప్పుతిప్పలు తెచ్చిపెడుతోంది. ఈ వర్షాకాలంలో భారీ వర్షాలు కురిసే అవకాశమున్నందున లబ్ధిదారులకు రేషన్ పంపిణీలో ఇబ్బందులు తలెత్తకూడదని, సకాలంలో చౌకబియ్యం అందని కారణంగా వారు పస్తులుండాల్సిన పరిస్థితి రాకూడదని భావించిన కేంద్ర ప్రభుత్వం.. జూన్, జూలై, ఆగస్టు నెలల రేషన్ బియ్యాన్ని జూన్ నెలలో కార్డుదారులు పంపిణీ చేయాలని రాష్ర్టాలను ఆదేశించిన విషయం విదితమే. అందుకనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం హడావిడిగా రంగంలోకి దిగడంతో అడుగడుగునా అవాంతరాలు ఎదురవుతున్నాయి.
కొత్త సాఫ్ట్‌వేర్‌పై డీలర్లకు అవగాహన కల్పించకపోవడం, బ్లూటూత్ కనెక్షన్లో సాంకేతిక సమస్యలు తలెత్తుతుండడం, ఈ-పాస్ యంత్రంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కోటా బియ్యం వేర్వేరుగా చూపిస్తుండడం, కేంద్రం కోటా తీసుకునేందుకు ఒకసారి, రాష్ట్రం కోటా తీసుకునేందుకు మరోసారి వేలిముద్రలు తీసుకోవాల్సి రావడం, మూడు నెలల రేషన్ కోటాకు ఆరుసార్లు బియ్యాన్ని తూకం వేయాల్సి రావడం, ఈలోపు సర్వర్ మొరాయిస్తే మళ్లీ మళ్లీ వేలిముద్రలు వేసి తూకాలు పెట్టాల్సి రావడం వంటివి అటు డీలర్లకు, ఇటు కార్డుదారులకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. దీంతో డీలర్లు, కార్డుదారులు రోజంతా చౌకదుకాణం వద్దనే పడిగాపులు కాయాల్సిన పరిస్థితి తలెత్తింది.
మూడు నెలల రేషన్ బియ్యాన్ని జూన్ నెలలోనే పంపిణీ చేసే ప్రక్రియను మొదలుపెట్టడం.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని రేషన్ డీలర్లకు, కార్డుదారులకు పరేషాన్‌గా మారింది. అధికారికంగా ఈ నెల 1నే రేషన్ పంపిణీ ప్రారంభమైనప్పటికీ చాలా చోట్ల ఇంకా పూర్తిస్థాయిలో రేషన్ దుకాణాలు తెరుచుకోలేదు. మూడు నెలల బియ్యం ఒకేసారి ఇస్తుండడంతో కార్డుదారులు కూడా ఒక్కసారిగా రేషన్ దుకాణాల వద్దకు చేరుకొని క్యూ కడుతున్నారు. దీంతో సర్వర్ డౌన్ సమస్యలు తలెత్తుతున్నాయి. ఫలితంగా డీలర్లు, లబ్ధిదారులు చిరాకు పడుతూనే సహనంతో వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.
మూడు నెలల బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేయాల్సి వచ్చినప్పుడు అందుకనుగుణంగా కొత్త సాఫ్ట్‌వేర్‌పై డీలర్లకు సరైన శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ.. ఆ శిక్షణ అందించకపోవడం, చాలామంది డీలర్లు కొత్త సాఫ్ట్‌వేర్‌పై అవగాహన లేకపోవడం వంటి కారణాలతో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. పైగా మూడు నెలల బియ్యం ఒకేసారి ఒకే థంబ్లో, ఒకే తూకంలో ఇచ్చే అవకాశం లేకపోయింది. సర్వర్ సమస్య కూడా తోడుకావడంతో లెక్కకు మిక్కిలిసార్లు వేలిముద్రలు వేయాల్సి వస్తోంది, అంతకుమించిన సార్లు బియ్యాన్ని తూకం పెట్టాల్సి వస్తోంది. ఫలితంగా ఒక్కో లబ్ధిదారుడికి బియ్యం పంపిణీ చేసేందుకు అరగంట సమయం పడుతోంది. బియ్యం పంపిణీ పూర్తయ్యాక కూడా స్టాక్‌లో రేషన్ కట్ కాకపోవడంతో డీలర్లు తలలు పట్టుకుంటున్నారు.
మూడు నెలల రేషన్ బియ్యం పంపిణీకి ప్రభుత్వం కొత్త సాఫ్ట్‌వేర్‌ను తీసుకొచ్చింది. దీనిపై శిక్షణ ఇవ్వకుండానే పంపిణీని ప్రారంభించడంతో డీలర్లు ఇబ్బందులు పడుతున్నారు. డీలర్లకు అవగాహన కలిగేందుకే రెండు మూడు రోజులు పడుతుండడంతో కార్డుదారులు ఎండలో ఇబ్బందులు పడుతున్నారు.
మూడు నెలల బియ్యం కోసం లబ్ధిదారులు ఈ-పాస్ యంత్రంలో మూడుసార్లు థంబ్ వేయాల్సి వస్తోంది. డీలర్లు ఆరుసార్లు బియ్యాన్ని తూకం పెట్టాల్సి వస్తోంది. ఉదాహరణకు.. ఒక లబ్ధిదారుడికి 6 కేజీల బియ్యం ఇవ్వాల్సి వస్తే కేజీ ఒకసారి, 5 కేజీలు మరోసారి చొప్పున మూడు నెలల బియ్యాన్ని ఆరుసార్లు తూకం వేయాల్సి వస్తోంది. రాష్ట్రం ఇచ్చే ఒక కేజీ బియ్యాన్ని, కేంద్రం ఇచ్చే 5 కేజీల బియ్యాన్ని వేర్వేరుగా తూకం వేయాలని కొత్త సాఫ్ట్‌వేర్‌లో స్పష్టంగా ఉంది. అలాగే, 12 కేజీల వారికి 2 కేజీలు ఒకసారి, 10 కేజీలు మరోసారి, 18 కేజీల వారికి 3 కేజీలు ఒకసారి, 15 కేజీలు మరోసారి, 24 కేజీల వారికి 4 కేజీలు ఒకసారి, 20 కేజీలు మరోసారి తూకం వేయాల్సి వస్తోంది. ఫలితంగా పంపిణీ ప్రక్రియ మరింత ఆలస్యమవుతోంది.
రేషన్ డీలర్లు, అధికారులతో ఫౌరసరఫరాల శాఖ కమిషనర్ మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లోనూ డీలర్లు తమ సమస్యలను కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. బ్లూ టూత్ తీసివేయాలని, మూడు నెలలకు కలిపి ఒకేసారి థంబ్ తీసుకునే అవకాశం కల్పించాలని, మూడు నెలల బియ్యానికి మూడుసార్లు మాత్రమే తూకం వేసేలా సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేయాలని వేడుకున్నారు. కానీ.. కమిషనర్ నుంచి ఎలా హామీ రాలేదని డీలర్ల సంఘం బాధ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని రేషన్ దుకాణాలకు బియ్యం ఇంకా పూర్తిస్థాయిలో దిగుమతి కాలేదు. దఫాల వారీగా బియ్యం దిగుమతి చేస్తున్నారు. అన్ని దుకాణాలకు ఒక దఫా బియ్యం దిగుమతి అయ్యాయి. రెండో దఫా బియ్యం పంపిణీ కొన్ని మండలాల్లో ప్రారంభమైంది.
భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా 443 రేషన్ దుకాణాలున్నాయి. వీటి పరిధిలో 2,93,754 రేషన్ కార్డులు ఉన్నాయి. వీటిల్లో అంతోద్యయ కార్డులు 21,145, అన్నపూర్ణ కార్డులు 3, ఫుడ్ సెక్యూరిటీ కార్డులు 2,72,606 కార్డులు ఉన్నాయి. ఈ కార్డులకు ప్రభుత్వం ప్రతి నెలా 5 వేల నుంచి 6 వేల మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేస్తుంది. అయితే ఈ మూడు నెలలకు గాను 15 వేల నుంచి 18 వేల మెట్రిక్ టన్నుల బియ్యం రేషన్ డీలర్లు పంపిణీ చేయాల్సి ఉంటుంది. అయితే మూడు నెలల బియ్యం నిల్వ పెట్టలేక డీలర్లు అవస్థలు పడుతున్నారు. మరోవైపు దొడ్డు బియ్యం పాత నిల్వలు కూడా దుకాణాల్లో పేరుకుపోయాయి. జిల్లాలో సుమారు 1,500 నుంచి 2,000 మెట్రిక్ టన్నుల దొడ్డు బియ్యం రేషన్ దుకాణాల్లోనే ఉన్నట్లు అంచనా.
కొత్తగూడెం టౌన్, జూన్ 4: భద్రాద్రి జిల్లా రేషన్ షాపుల్లో కొనసాగుతున్న మూడు నెలల రేషన్ బియ్యం పంపిణీ ప్రక్రియను డీసీఎస్వో రుక్మిణీదేవి బుధవారం పరిశీలించారు. బియ్యం పంపిణీ ప్రక్రియ ఆదివారం నుంచే మొదలైనందున బుధవారం ఆమె పలు దుకాణాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో కార్డుదారులకు అవసరమైన 17,287 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి చౌక ధరల దుకాణాలను దఫాల వారీగా తరలించనున్నట్లు చెప్పారు. రేషన్ షాపుల్లో ఈ నెల 30 వరకు కార్డుదారులకు బియ్యాన్ని పంపిణీ చేస్తామన్నారు. డీలర్లు సమయపాలన పాటించాలని సూచించారు. బుధవారం నాటికి జిల్లాలోని 443 రేషన్ షాపుల్లో 32,488 మంది కార్డుదారులు బియ్యం తీసుకున్నట్లు తెలిపారు. కాగా, ఈ-పాస్ యంత్రాల్లోని పలు సాంకేతిక సమస్యలను పలువురు డీలర్లు ఈ సందర్భంగా డీసీఎస్వో దృష్టికి తీసుకెళ్లారు.
రఘునాథపాలెం, జూన్ 4: చౌక ధరల దుకాణాల్లోని బియ్యం స్టాకు నిల్వల వివరాలను ప్రదర్శించాలని ఖమ్మం అదనపు కలెక్టర్ పీ.శ్రీనివాసరెడ్డి సూచించారు. సమయాన్ని పాటిస్తూ కార్డుదారులకు మూడు నెలల సన్న బియ్యం పంపిణీ చేయాలని రేషన్ డీలర్లను ఆదేశించారు. సివిల్ సప్లయీస్ డీఎం శ్రీలతతో కలిసి ఖమ్మం అర్బన్ పరిధిలోని పలు రేషన్ షాపులను బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇందులో భాగంగా ఖమ్మం జూబ్లీపుర రేషన్ షాపును పరిశీలించారు. ఈ సందర్భంగా రేషన్ షాపులో నిల్వలు, ఈ-పాస్ యంత్రాన్ని, తూకం మిషన్లను తనిఖీ చేశారు.
కార్డుదారులకు రేషన్ బియ్యం పంపిణీ చేసే సమయంలో ఈ-పాస్ మిషన్ ద్వారా జరుగుతున్న జాప్యాన్ని స్వయంగా పరిశీలించారు. రాష్ట్రం, కేంద్రం అందించే బియ్యాన్ని వేర్వేరుగా తూకం వేయడంలో ఆలస్యం జరుగుతున్నట్లు గుర్తించారు. అంతేగాక ఈ-పాస్ తూకం సమయంలో మిషన్ బ్లూ టూత్ కనెక్షన్ తీసుకోవడంలోనూ ఆలస్యం జరుగుతున్నట్లు డీలర్లు వాపోవడంతో ప్రత్యక్షంగా పరిశీలించారు. రేషన్ డీలర్ల సంఘం ప్రధాన కార్యదర్శి షేక్ జానీమియా, సివిల్ సప్లయీస్ అధికారులు పాల్గొన్నారు.
మూడు నెలల బియ్యం ఒకేసారి పంపిణీ చేయడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. రోజూ పనులు వదులుకొని దుకాణాల ఎదుట పడిగాపులు కాస్తున్నాం. బియ్యం తీసుకోవడం కోసం ఎండలో గంటల తరబడి క్యూలో నిల్చుని ఇబ్బందులు పడుతున్నాం.
-ఆరేపల్లి ఏసురత్నం, లబ్ధిదారు, అశ్వారావుపేట
ఈ-పాస్ యంత్రంలో ఎదురవుతున్న సాంకేతిక సమస్యలతో బియ్యం పంపిణీ కొంత ఆలస్యమవుతోంది. ఒక్కో లబ్ధిదారుడి నుంచి నాలుగుసార్లు వేలిముద్రలు తీసుకోవాల్సి వస్తోంది. బియ్యాన్ని ఆరుసార్లు తూకం వేయాల్సి వస్తోంది. దీని వల్ల బియ్యం పంపిణీ ఆలస్యమవుతోంది.
-శ్రీనివాసాచారి, రేషన్ డీలర్, అశ్వారావుపేట
ఖమ్మం జిల్లాలో ఈ నెల 30 వరకు బియ్యం పంపిణీ జరుగుతుంది. గతంలో ప్రతి నెలా 15వ తేదీ వరకే బియ్యం పంపిణీకి గడువు ఉండేది. కానీ.. ఈ నెలలో మూడు నెలల బియ్యం ఒకేసారి ఇవ్వాల్సి ఉండడం వల్ల గడువు పెంచాం. ఈ నెల ఆఖరు వరకు పంపిణీ ఉంటుంది. కాబట్టి లబ్ధిదారులు ఆందోళన చెందొద్దు.
-చందన్‌కుమార్, డీసీఎస్వో, ఖమ్మం
మూడు నెలల బియ్యం పంపిణీలో ఎదురవుతున్న సాంకేతిక సమస్యల పరిష్కారానికి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నాం. ప్రతి మూడు మండలాలకు ఒక టెక్నీషియన్‌ను అందుబాటులో ఉంచాం. బియ్యం నిల్వ సమస్య లేకుండా ఎప్పటికప్పుడు పంపిణీ చేయాలని, తిరిగి బియ్యం దిగుమతి చేసుకోవాలని డీలర్లకు ఆదేశాలిచ్చాం.
-రుక్మిణీదేవీ, డీసీఎస్వో,భద్రాద్రి కొత్తగూడెం