ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొర్రీలు పెట్టడం షరా మామూలైపోయింది. దీంతో రైతులకు ప్రతియేటా ధాన్యం అమ్మకాల వద్ద ఇబ్బందులు తప్పడం లేదు. గత వానకాలంలో కూడా కొనుగోలు కేంద్రాల వద్ద నానారకాల నిబంధనలు పెట్టడం వల్ల రైతులు బయట విక్రయాలకు మొగ్గు చూపారు. ఈసారైనా అధికారులు చిత్తశుద్ధితో కొనుగోలు కేంద్రాల వద్ద వడ్లు సక్రమంగా కొంటారా.. కొర్రీలు పెడతారా.. అనే సందేహాలు రైతుల నుంచి వ్యక్తమవుతున్నాయి.
తేమ పేరుతో రైతుల్ని కేంద్రాల వద్ద క్యూలో ఉంచడం వల్ల రోజులకొద్దీ అక్కడ ఉండలేక ముందుగానే షాపుకార్లకు రేటు ఎట్లా ఉన్నా అమ్మకాలు చేసుకుంటున్నారు. ఏదేమైనా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలపై రైతులకు పూర్తిగా నమ్మకంపోయింది. ఇదే అదనుగా దళారులు యాసంగి ధాన్యంపై కన్నేసి రైతులను మోసం చేసేందుకు సిద్ధమయ్యారు. మరీ అధికారులు రైతులను ఇబ్బంది పెట్టకుండా ధాన్యాన్ని కొనుగోలు చేస్తారో లేదో వేచిచూడాలి.
-భద్రాద్రి కొత్తగూడెం, ఏప్రిల్ 11 (నమస్తే తెలంగాణ)
ఒకవైపు వానలు లేక.. మరోవైపు పంట దిగుబడి సరిగా రాకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమయంలో అకాల వర్షం వచ్చి యాసంగి పంటపై పిడుగు పడినట్లయింది. దీంతో రైతులు తడిసిన ధాన్యాన్ని ఎండబెట్టుకునే పనిలో పడ్డారు. అసలే గిట్టుబాటు ధరలు అంతంత మాత్రంగా ఏ గ్రేడ్ రకం రూ.2,320, మామూలు రకం రూ.2,300 ధరను నిర్ణయించారు.
మార్కెట్లో బియ్యం ధరలు ఆకాశాన్నంటుతున్నా ప్రభుత్వం మాత్రం ధాన్యం రేట్లు పెంచడం లేదని రైతులు విమర్శిస్తున్నారు. పేరుకే సన్నబియ్యానికి బోనస్ అంటున్నారు.. కానీ.. సమయానికి బోనస్ ఇవ్వకపోవడంతో వానకాలం పంటల విక్రయాల సమయంలో రైతులు ఇబ్బందులు పడ్డారు. మరోవైపు దళారుల చేతుల్లో రైతులు మోసపోవాల్సి వస్తున్నది. రేటు ఎక్కువ ఇస్తానని చెప్పి కాంటాల్లో తేడా చేసి రైతుల్ని మోసం చేస్తున్నారు.
కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు ఏటా సమస్యలు ఎదుర్కొంటున్నారు. తేమశాతం చూసి ఇంకా వడ్లు ఆరాలని కేంద్రాల వద్దనే ఉంచడం వల్ల రోజులకొద్దీ అక్కడే వేచి ఉండాల్సి వస్తున్నది. మరోవైపు గన్నీ బ్యాగులు సకాలంలో రాక కొంత ఇబ్బంది పడుతున్నారు. బ్యాంకు ఖాతా నెంబర్లు ఇచ్చినా సకాలంలో ఖాతాలో సొమ్ములు పడకపోవడం వల్ల డబ్బుల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి వస్తోంది.
భద్రాద్రి జిల్లాలో యాసంగి పంటను అంచనా వేసిన అధికారులు 67 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని లెక్కలు వేశారు. ఇందుకోసం 144 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించి ఇప్పటికే 124 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. అకాల వర్షం కురియడంతో హార్వెస్టింగ్ ఆలస్యం అవుతున్నందున రైతులు కేంద్రాలకు ధాన్యం తీసుకురావడం లేదని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. గన్నీ బ్యాగులు, హార్వెస్టింగ్ పరికరాలు, తేమ శాతం మిషనరీలను ఇప్పటికే మార్కెటింగ్ శాఖ నుంచి కేంద్రాలకు చేరవేశారు.
ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రానికి వడ్లు తెచ్చినప్పుడల్లా తేమ శాతం రాలేదని అధికారులు ఆలస్యం చేస్తున్నారు. అందుకే ఇక్కడ అమ్మాలంటే ఇబ్బందిగా ఉంది. రేటు తక్కువైనా సరే బయటనే అమ్ముతున్నాం. కొనుగోళ్ల తర్వాత కూడా వారంరోజులైనా సొమ్ములు బ్యాంకు ఖాతాలో పడవు. డబ్బుల కోసం పడిగాపులు కాయాలి. ప్రతి ఏటా కొనుగోలు కేంద్రాల వద్దనే సమస్య వస్తున్నది. పై అధికారులు తనిఖీలు చేస్తే సమస్య లేకుండా ఉంటుంది.
-పూసం వెంకటేశ్వర్లు, రైతు, బెండాలపాడు, చండ్రుగొండ
ఇప్పటికే కొన్ని కేంద్రాలకు ధాన్యం వచ్చింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 124 కేంద్రాలను ప్రారంభించాం. అన్ని కేంద్రాల్లో గన్నీబ్యాగులు సిద్ధంగా ఉంచాం. ఎక్కడా ఎలాంటి సమస్యలు లేవు. వారంరోజుల్లో అన్ని ఏరియాల నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుంది. వర్షం వల్ల రైతులు కొంత ఇబ్బంది పడ్డమాట వాస్తవమే. ఎంత త్వరగా ఆరబెడితే అంత త్వరగా కొనుగోలు చేస్తాం.
-త్రినాథ్బాబు, డీఎం, పౌరసరఫరాల శాఖ