కొత్త రేషన్‌కార్డులు జనాన్ని పరేషాన్ చేస్తున్నాయి. ప్రతి కుటుంబానికి రేషన్‌కార్డు ఇవ్వాల్సిన రాష్ట్ర సర్కార్‌కు స్పష్టత లేకపోవడంతో ప్రజల్లో తీవ్ర గందరగోళం నెలకొన్నది. అధికారంలోకి రాగానే ప్రతి కుటుంబానికి కొత్త రేషన్‌కార్డు ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రజాపాలన సభలు ఏర్పాటు చేసి కుప్పలుతెప్పలుగా దరఖాస్తులు స్వీకరించింది. కానీ ఇంతవరకు కొత్త రేషన్‌కార్డులు జారీ చేయకపోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అయితే పథకాల అమలు కోసం మండలానికో పైలట్ గ్రామాన్ని ఎంచుకున్న కాంగ్రెస్ సర్కార్ అక్కడ కూడా పూర్తిస్థాయిలో ప్రజలకు న్యాయం చేయడం లేదు.
– భద్రాద్రి కొత్తగూడెం, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ)
పైలట్ గ్రామాల్లో కొన్ని రేషన్‌కార్డుల్లో అధికారులు మార్పులు.. చేర్పులు చేసినప్పటికీ అవన్నీ తప్పులతడకగా దర్శనమిస్తున్నాయి. జూలూరుపాడు మండలం కాకర్ల గ్రామానికి చెందిన రాజబోయిన శ్రీను కుటుంబంలో ఏకంగా తొమ్మిది మంది పేర్లు ఒకే రేషన్‌కార్డులో వచ్చాయి. వీరు వేర్వేరు కుటుంబాలు అయినప్పటికీ అందరి పేర్లను అధికారులు ఒకే కార్డులో చేర్చారు. చింతలతండా గ్రామంలో రాములు అనే యజమాని రేషన్‌కార్డులో కొడుకు పేరు లేదు.. కానీ కోడలు, పిల్లల పేర్లు వచ్చాయి.
ఇలాంటి ఘటనలు జిల్లా అంతా ఉండటంతో బాధితులు ఆందోళన చెందుతున్నారు. చింతలతండాకు చెందిన పాలూరి రాంబాబు కుటుంబంలో తల్లీ తండ్రితో కుమారులు ఉన్నారు. ఆయన కుమారుడు నరేష్ వేరే కార్డు కోసం దరఖాస్తు చేసుకుని తండ్రి కార్డులో పేరును డిలీట్ చేయించుకున్నాడు. తీరా కొత్త కార్డులో అతని పేరులేదు. భార్యాపిల్లల పేర్లు మాత్రం తండ్రి కార్డులో ప్రత్యక్షమయ్యాయి. అయితే కార్డులో ఉన్న పేర్లకు బియ్యం ఇవ్వడం లేదు. జిల్లాఅంతటా ఇలాంటి గందరగోళమే ఉండటంతో లబ్ధిదారులు తలలు పట్టుకుంటున్నారు.
కొత్త సర్కారు రాగానే ప్రజాపాలన గ్రామసభలు ఏర్పాటు చేసి రేషన్‌కార్డులు లేనివారి నుంచి దరఖాస్తు తీసుకొని రసీదులు కూడా ఇచ్చారు. తర్వాత జనవరి 26న కొత్త రేషన్‌కార్డులకు మీ సేవలో ఆన్లైన్ చేసుకోమని సర్కార్ చెప్పడంతో మళ్లీ ఆన్లైన్ చేశారు. కానీ వాళ్లందరికీ రేషన్‌కార్డులు ఇచ్చినా అందులో పేర్లు లేకపోవడంతో అయోమయంలో పడ్డారు. జిల్లాలో ప్రజాపాలనలో 25,000 మంది దరఖాస్తులు చేసుకున్నారు. చేర్పులు.. మార్పుల కోసం ఆన్లైన్లో మరో 30వేల మంది దరఖాస్తులు ఇచ్చారు. ఇప్పటికీ అధికారులు మాత్రం 1,250 మాత్రమే కొత్త రేషన్‌కార్డుల పత్రాలు ఇచ్చారు. పైలట్ గ్రామాలకే కాకుండా అన్ని గ్రామాల్లో కొత్త వారి జాబితాను ఆన్లైన్లో ఉంచారు. అవీ తప్పులతడకలుగా ఉన్నట్లు అధికారులు కూడా ధ్రువీకరించారు. గతంలో పాతవి 2.93 లక్షల కార్డులు ఉన్నట్లు అధికారులు లెక్కలు చెప్తున్నారు.
మొన్నటివరకు మా నాన్నకార్డులో నా పేరు ఉండేది. నాకు పెళ్లియింది. ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రజాపాలనలో దరఖాస్తు ఇచ్చాను. మీ సేవలో కూడా ఆన్లైన్ చేశాను. కొత్తగా మా నాన్న కార్డులో నా భార్యపిల్లల పేర్లు కలిపారు. కానీ నాకు కొత్తకార్డు ఇవ్వలేదు. నా పేరు అందులో లేదు. భార్యాపిల్లలకు బియ్యం ఇవ్వడం లేదు. కొత్త కార్డు ఇస్తారా మళ్లీ ఇలానే జరుపులు పెడతారా అర్థంకావడం లేదు.
– పాలూరి నరేష్, కాకర్ల, జూలూరుపాడు మండలం
మా కుటుంబానికి పాత కార్డు ఉంది. నాకు పెళ్లి అయ్యింది. భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. నా పేరు డిలీట్ కాలేదు. భార్య ముగ్గురు పిల్లల పేర్లు ఆన్లైన్లో వచ్చాయి. కొత్త కార్డు ఎప్పుడు ఇస్తారో తెలియదు. అందరి పేర్లు ఒక దానిలో ఉన్నట్లు ఆన్లైన్ పేపరు ఇవ్వమంటే ఇవ్వడం లేదు. సరిచేస్తామని చెప్తున్నారు.
– ధర్మసోత్ నరేష్, చింతల్‌తండా, జూలూరుపాడు మండలం
అర్హులందరికీ కొత్త రేషన్‌కార్డులు వస్తాయి. సాంకేతిక సమస్య వల్ల పేర్లు యాడింగ్ అయ్యాయి. ప్రజాపాలనలో ఇచ్చిన దరఖాస్తులు, మీ సేవలో ఇచ్చిన దరఖాస్తులు ఒకటే అయ్యాయి. రెండుసార్లు దరఖాస్తులు చేయడం వల్ల సమస్య వచ్చింది. ఆధార్ డేటా సరిచేస్తున్నారు. లోపాలను సరిచేసి కొత్త రేషన్‌కార్డులను త్వరలోనే జారీ చేస్తాం. కొత్త కార్డులు జారీ చేశాక రేషన్ బియ్యం వస్తాయి.
– రుక్మిణి, సివిల్ సైప్లె అధికారి, భద్రాద్రి కొత్తగూడెం