ఆటపాటలతో ఇన్నాళ్లూ ఇళ్లలో సందడి చేసి పిల్లలందరూ ఇక బడిబాట పట్టనున్నారు. పాఠశాలలకు, విద్యార్థులకు బుధవారంతో వేసవి సెలవులు ముగిశాయి. గురువారం నుంచి తరగతి గదుల తలుపులు తెరుచుకోనున్నాయి. కానీ.. సర్కారు నిర్లక్ష్యం కారణంగా ప్రతికూల పరిస్థితుల్లో ఈ విద్యాసంవత్సరం ప్రారంభమవుతోంది. సర్కారు బడుల్లో విద్యార్థులతోపాటు ఉపాధ్యాయులకూ ఎన్నో సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. విద్యారంగ సమస్యలను యథాతథంగా మోసుకొచ్చిన నూతన విద్యాసంవత్సరం గురువారం ప్రారంభమవుతోంది.
-ఖమ్మం, జూన్ 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
పేరులో తప్ప మిగతా ఏ ఒక్క అంశంలోనూ నూతనత్వం లేకుండా ఈ నూతన విద్యాసంవత్సరం ప్రారంభమవుతుండడం గమనార్హం. విద్యారంగాన్ని ఏళ్లకేళ్లుగా పట్టిపీడిస్తున్న పాఠశాలల హేతుబద్ధీకరణ, ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ ఊసెత్తకుండానే విద్యాసంవత్సరం మొదలవుతుండడం.. ఉపాధ్యాయులతోపాటు విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యావేత్తలు, విద్యాభిమానులకు తీవ్ర నిరాశను కలిగిస్తోంది. విద్యారంగాన్ని మరింత పటిష్టం చేస్తామని, అదే తమ తొలి ప్రాధాన్యమని.. రాష్ట్రంలో కొలువుదీరిన కొత్తలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించుకుంది. పైగా అట్టహాసంగా అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలను కూడా ఏర్పాటు చేసింది.
దీంతోపాటు తెలంగాణ రాష్ట్ర విద్యా కమిషన్‌ను కూడా ఏర్పాటు చేసి.. దానికి చైర్మన్‌గా మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళిని నియమించింది. ముందుగా పాఠశాలలను క్రమద్ధీకరిస్తామని, దాంతోపాటే ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ చేపడుతామని ప్రకటించింది. ఈ ప్రక్రియను వేసవి సెలవుల్లోగా ముగిస్తామని, నూతన విద్యాసంవత్సరాన్ని పండుగ వాతావరణంలో ప్రారంభిస్తామని గొప్పలు చెప్పింది. కానీ.. ఆచరణలో మాత్రం ఆ దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు పడకపోవడం గమనార్హం.
ఉపాధ్యాయుల కొరత..
కొన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులు, విద్యార్థుల నిష్పత్తికి మించి ఉపాధ్యాయులున్నారు. మరికొన్ని చోట్ల ఈ నిష్పత్తి తక్కువగా ఉండి ఉపాధ్యాయుల కొరత వేధిస్తోంది. దీంతో ఖమ్మం జిల్లాలో ఏటికేడాది విద్యార్థుల్లేక మూతపడుతున్న పాఠశాలల సంఖ్య పెరుగుతోంది. ఆ సంఖ్య గత విద్యాసంవత్సరం నాటికి 66కి చేరుకుంది. దీంతోపాటు రెండంకెలకు చేరని విద్యార్థులున్న పాఠశాలల సంఖ్య 137గా ఉంది. ఇవి కూడా రేపోమాపో మూతపడడం ఖాయంగా కనిపిస్తోంది.
గత అనుభవాలను విస్మరిస్తున్న ప్రస్తుత పాలకులు, ఉన్నతాధికారుల వైఖరి కారణంగా ఈ స్థితి తలెత్తుతోంది. క్రమంగా విద్యారంగం క్షీణదశకు చేరుకుంది. జిల్లాలో 202 ఉన్నత పాఠశాలలుండగా.. 169 మంది మాత్రమే ప్రధానోపాధ్యాయులు పనిచేస్తున్నారు. 33 ఖాళీలు ఉన్నాయి. అన్ని విభాగాల్లో కలిపి 5,815 మంది ఉపాధ్యాయులు పనిచేయాల్సి ఉండగా.. 4,957 మంది మాత్రమే పనిచేస్తున్నారు. 858 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
తాము అధికారంలోకి వచ్చాక ఉపాధ్యాయుల బదిలీలు, ఉద్యోగోన్నతులకు అవకాశం ఇస్తామని హామీలిచ్చిన కాంగ్రెస్.. పాలనా పగ్గాలు చేపట్టి 18 నెలల గడుస్తున్నా నేటికీ ఆ హామీలు అమలుచేయలేదు. దీంతో ఉపాధ్యాయుల్లో నిరుత్సాహం నెలకొంది. గత బదిలీల్లో విద్యార్థుల సంఖ్య అధికంగా ఉన్న ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పాఠశాలలు సైతం ఉపాధ్యాయులు కోరుకోకుండా మిగిలిపోయాయి. హేతుబద్ధీకరణ లేకపోవడమే అందుకు కారణం. ఫలితంగా అత్యధిక విద్యార్థులున్నచోట ఉపాధ్యాయుల కొరత ఏర్పడింది. దీంతో అప్పటికే ఉన్న ఉపాధ్యాయులకు అక్కడి బోధన వారి తలకు మించిన భారంగా మారింది.
జిల్లాలో పాఠశాలల వివరాలు..
జీరో ఎన్రోల్మెంట్ స్కూళ్లు : 47
సింగిల్ టీచర్ స్కూళ్లు : 156
5 కంటే తక్కువమంది విద్యార్థులున్న స్కూళ్లు : 48
6 నుంచి 10 మంది కంటే తక్కువ విద్యార్థులున్న స్కూళ్లు : 87
200 కంటే ఎక్కువ మంది విద్యార్థులున్న ప్రైమరీ స్కూళ్లు : 2
ఖమ్మం జిల్లాలోని మొత్తం ఉపాధ్యాయుల సంఖ్య : 4,956
పూర్తిస్థాయిలో చేరని పాఠ్యపుస్తకాలు..
కొత్త పాఠ్యపుస్తకాలు, ఏకరూప దుస్తులు ఇంకా ప్రభుత్వ పాఠశాలలకు పూర్తిస్థాయిలో చేరలేదు. దీంతో ఈ ఏడాది సర్కారు పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు నిరాశే మిగలనుంది. ఈ ఏడాది పార్ట్-1లో జిల్లాకు 4,92,970 పాఠ్యపుస్తకాలు అవసరం. వీటిల్లో 4,46,410 పుస్తకాలు జిల్లా కేంద్రానికి చేరాయి. కానీ.. వీటిల్లో 60 శాతం పుస్తకాలు కూడా ఎంఈవోల ద్వారా పాఠశాలలకు చేరలేదు.
వివిధ సబ్జెక్టుల పుస్తకాలు ఒకేసారి రాకపోవడం, మరికొన్ని రోజుల తరువాత ఇంకొన్ని పుస్తకాలు రావాల్సి ఉండడం, వీటిని మండల కేంద్రాలు/పాఠశాలలకు తీసుకెళ్లేందుకు విడతల వారీగా వాహనాలకు అద్దెలు చెల్లించాల్సి ఉండడం వంటి కారణాలతో ఎంఈవోలు జిల్లా కేంద్రం నుంచి వెనువెంటనే పాఠ్య పుస్తకాలు తీసుకెళ్లడం లేదు.
హైదరాబాద్‌లోని పాఠ్యపుస్తకాల ముద్రణ సంస్థ నుంచి అన్ని సబ్జెక్టుల పుస్తకాలు జిల్లా కేంద్రానికే వచ్చాకే తాము మండలాలు/పాఠశాలలకు తీసుకెళ్తామని, అప్పుడైతే ఒక వాహనంలో ఒకేసారి అన్ని పుస్తకాలనూ తీసుకెళ్లొచ్చని, వాహన చార్జీలు ఎక్కువసార్లు చెల్లించే భారం తప్పుతుందని ఎంఈవోలు అంటున్నారు. ఇక పార్ట్-2 పుస్తకాలు ఎప్పుడొస్తాయో? అవి పాఠశాలలకు ఎప్పుడు చేరతాయో ప్రభుత్వానికే తెలియాలి?
ఆ 26 వేల పుస్తకాలు ఏమైనట్లు?
గత విద్యాసంవత్సరంలో జిల్లాకు చేరిన పాఠ్యపుస్తకాల్లో సుమారు 26 వేల పుస్తకాలు లెక్కల్లోకి రావడం లేదు. అటూ గోదాముల్లోనూ లేవు. నిరుడు జిల్లాకు చేరిన పుస్తకాలకూ, విద్యార్థులకు పంపిణీ చేసిన పుస్తకాలకూ మధ్య సుమారు 26 వేల పుస్తకాల వ్యత్యాసం ఉండడం గమనార్హం. ఈ పుస్తకాలు ఉండి ఉంటే.. ఈ సంవత్సరంలో ఈ పుస్తకాల చేరిక ఆలస్యమైనా నిరుటి పుస్తకాలను విద్యార్థులకు పంపిణీ చేసే అవకాశం ఉండేది. మరి లెక్కల్లోకి రాని నిరుటి 26 వేల పుస్తకాల అంశంపై విద్యాశాఖ అధికారులు ఎలాంటి విచారణ చేపడతారో చూడాలి.
తెరుచుకోని యూనిఫాం క్లాత్ బండిళ్లు..
ఇక విద్యార్థుల ఏకరూప దుస్తులు కూడా ఇంకా పూర్తిస్థాయిలో పాఠశాలలకు చేరలేదు. జిల్లా కేంద్రంలోని యూనిఫాం క్లాత్ బండిళ్లు కనీసం తెరుచుకోనూ లేదు. మొదటి జత యూనిఫాం క్లాత్ జిల్లాలోని అన్ని పాఠశాలలకూ(1,269) చేరింది. స్టిచ్చింగ్ కోసం ఆ క్లాత్‌ను సంబంధిత ఎస్‌హెచ్‌జీ టైలర్లకు ఆయా హెచ్ఎంలు అందజేశారు.
ఇక రెండో జత క్లాత్ ఇప్పటికీ పూర్తిస్థాయిలో చేరలేదు. అసలు జిల్లా కేంద్రంలోని గోదాములో ఉన్న క్లాత్ బండిళ్లను కనీసం తెరిచిన దాఖలాలు కూడా లేకపోవడం గమనార్హం. ఈ నెల 3 నాటికి జిల్లా కేంద్రం నుంచి కేవలం 9 మండలాలకు మాత్రమే రెండో జత యూనిఫాం క్లాత్ చేరింది. అయితే, పాఠశాలల ప్రారంభం నాటికి విద్యార్థులకు రెండు జతల యూనిఫాం అందిస్తామన్న ప్రభుత్వ ప్రకటనలు మాత్రం ఆచరణలో సాధ్యం కాలేదు.
అల్పాహారం బిల్లులూ అందనేలేదు..
నిరుడు పదో తరగతికి సంబంధించిన అల్పాహారం బిల్లులు నేటికీ రాలేదు. వీటికి తోడు మధ్యాహ్న భోజన(ఎండీఎం) పథకానివి కూడా మూడు నెలల బిల్లులు పెండింగ్‌లోనే ఉన్నాయి. దీంతో ఈ విద్యాసంవత్సరం తమ పరిస్థితి ఏమిటని మధ్యాహ్న భోజన నిర్వాహకులు ప్రశ్నిస్తున్నారు. అయితే, కలెక్టర్ తన ఫండ్ నుంచి చెల్లిస్తానని చెప్పినప్పటికీ ఇప్పటికీ పదో తరగతికి సంబంధించిన బిల్లులు పూర్తిస్థాయిలో చెల్లింపులు జరగలేదని ఓ హెచ్ఎం తెలిపారు. ప్రస్తుతం మధ్యాహ్న భోజనంలో అందించే గుడ్డు ధరలు, కూరగాయల ధరలు పెరిగాయి. దీంతో విద్యార్థుల మధ్యాహ్న భోజనానికీ ఆర్థిక సమస్యలు స్వాగతం పలుకుతున్నట్లయింది.