భద్రాద్రి కొత్తగూడెం, నమస్తే తెలంగాణ/ భద్రాచలం, జూలై 15: ఏజెన్సీ ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని అదృష్టంగా భావిస్తున్నామని భద్రాద్రి కొత్తగూడెం నూతన కలెక్టర్ డాక్టర్ ప్రియాంకా ఆల, భద్రాచలం ఐటీడీఏ నూతన పీవో ప్రతీక్ జైన్ పేర్కొన్నారు. తమ తమ స్థానాల్లో శనివారం నూతనంగా బాధ్యతలు తీసుకున్న అనంతరం వారు మాట్లాడుతూ.. అందరి సహకారంతో మరింత సమర్థవంతంగా పనిచేద్దామని, ప్రభుత్వ ప్రాధాన్యాలు, లక్ష్యాలను నెరవేరుద్దామని అన్నారు.
తెలంగాణలోనే పుట్టా: కలెక్టర్ ప్రియాంక
తాను తెలంగాణలోనే జన్మించానని, తనకు ఈ ప్రాంతం తనకు కొత్తకాదని నూతన కలెక్టర్ ప్రియాంక పేర్కొన్నారు. శనివారం హైదరాబాద్ నుంచి వచ్చిన ఆమెకు అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, జిల్లా అధికారులు స్వాగతం పలికారు. సాయంత్రం 4:23 గంటలకు ఆమె బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్బంగా అధికారులను పరిచయం చేసుకొని మాట్లాడారు. తాను పుట్టిన రాష్ట్రంలో పనిచేయడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ముందుగా వైద్యవిద్యను చదివానని, ప్రజలకు సేవ చేసేందుకే సివిల్ సర్వీసెస్‌లోకి వచ్చానని అన్నారు. 2016లో సివిల్స్ సాధించానని, భువనగిరి, జీహెచ్ఎంసీలలో పనిచేశానని అన్నారు.
నూతన కలెక్టర్ బయోడేటా
భద్రాద్రి కొత్తగూడెం, జూలై 15 (నమస్తే తెలంగాణ): భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్‌గా ప్రియాంక ఆల శనివారం బాధ్యతలు చేపట్టారు. ఆమె 1987 జనవరి 6న హైదరాబాద్ ఉప్పల్‌లో జన్మించారు. హైదరాబాద్ హబ్సిగూడలోని జాన్సన్ గ్రామర్ స్కూల్లో పాఠశాల విద్య పూర్తి చేశారు. భువనగిరి యాదాద్రి జిల్లా అసిస్టెంట్ కలెక్టర్‌గా, జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్‌గా, శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్‌గా పని చేశారు. 2016 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన ఆమె 529వ ర్యాంకు సాధించారు. నాన్న లోరా నారాయణ.. ఆయుష్ విభాగంలో ఆయుర్వేద డాక్టర్‌గా, తల్లి.. సీసీఎంబీఏలో ఇంజినీర్‌గా ఉన్నారు. చెల్లి శశాంక కూడా 2014లో ఐఏఎస్ సాధించారు. భర్త డాక్టర్ మణిపాల్ కుమార్ పువ్వాల గాంధీ ఆస్పత్రిలో సర్జన్‌గా చేస్తున్నారు. కలెక్టర్ దంపతులకు కుమార్తె మైరా, కుమారుడు కియాన్ ఉన్నారు.
విద్యావైద్యంపై దృష్టి పెడతా: పీవో ప్రతీక్
ఏజెన్సీలో గిరిజనుల విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తానని ఐటీడీఏ నూతన పీవో ప్రతీక్ జైన్ పేర్కొన్నారు. శనివారం మధ్యాహ్నం భద్రాచలం వచ్చిన ఆయన.. పూర్వ పీవో గౌతమ్ పొట్రు నుంచి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అందరమూ కలిసి ఐక్యంగా పనిచేసి గిరిజనులకు మెరుగైన సేవలందిద్దామని అన్నారు. ఢిల్లీలో జన్మించిన తాను.. అక్కడి దయానంద విహార్ పబ్లిక్ స్కూల్లో చదివానని, 2009 – 2013 మధ్య గౌహతిలో ఇంజినీరింగ్, 2017 2019 మధ్య జేఎన్‌యూలో ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పూర్తి చేశానని వివరించారు. సివిల్స్‌లో ఆలిండియా 88వ ర్యాంకు రావడంతో 2018 – 2019 మధ్య అసిస్టెంట్ కలెక్టర్‌గా, కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వ శాఖలో అసిస్టెంట్ సెక్రటరీగా పనిచేసినట్లు చెప్పారు. 2020 ఫిబ్రవరి 9న రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్‌గా పనిచేసి పదోన్నతిపై ఇప్పుడు భద్రాచలం ఐటీడీఏ పీవోగా వచ్చినట్లు వివరించారు. కాగా, బదిలీపై వెళ్తున్న పీవోను, నూతన పీవోను ఆర్డీవో రత్నకల్యాణి, ఐటీడీఏ అధికారులు సన్మానించారు. డేవిడ్‌రాజ్, తానాజీ, భీమ్, రమణయ్య, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.