ఖమ్మం ఎడ్యుకేషన్, అక్టోబర్ 19: విద్యార్థుల్లో దాగి ఉన్న కళలను వెలికితీసేందుకు, చదువుతోపాటు కళల్లోనూ రాణించేలా ప్రోత్సహించేందుకు నిర్వహించే కార్యక్రమం కళాఉత్సవ్. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులకు పోటీలు నిర్వహించి రాష్ట్ర పోటీలకు ఎంపిక చేయాలి. దీనికోసం వారం రోజుల ముందు నుంచే విద్యార్థులకు సమాచారం ఇచ్చి సన్నద్ధం చేయాలి. రాష్ట్రస్థాయిలో సత్తా చాటాలంటే జిల్లాలో అత్యధిక ప్రదర్శనల కోసం కృషిచేయాలి. కానీ దీనికి భిన్నంగా శనివారం ఖమ్మంలోని సైన్స్ మ్యూజియంలో నిర్వహించిన కళాఉత్సవ్ ‘కళ’లేని ఉత్సవ్‌గా మారింది.
జిల్లాస్థాయిలో నిర్వహించే కార్యక్రమంలో చేయాల్సిన ఏర్పాట్లు లేనేలేవు. సాధారణ కార్యక్రమంలా ముగించారు. విద్యార్థులు తమలోని నైపుణ్యాలను ప్రదర్శించే వేదిక ఉత్సాహాన్నిచ్చేలా ఉండాలి. కానీ తిలకించే వారికి, ప్రదర్శించే వారికి వ్యత్యాసం లేకుండా ఉంది. నాపరాళ్లపై విద్యార్థులు నాట్య ప్రదర్శనలు చేశారు. కార్పెట్ కూడా ఏర్పాటుచేయకపోవడంతో పోటీల్లో పాల్గొన్న విద్యార్థులు అసౌకర్యానికి గురయ్యారు. ఆరు అంశాల్లో విద్యార్థులకు పోటీలు నిర్వహించి.. మొదటి స్థానాల్లో నిలిచిన వారిని రాష్ట్ర స్థాయికి పంపించాలి. ప్రచారం లేకపోవడంతో విద్యార్థుల హాజరు అంతంత మాత్రంగానే ఉంది. కళా ఉత్సవ్ పర్యవేక్షణ బాధ్యతలు కూడా ఒక్కో సంవత్సరం ఒక్కో అధికారికి అప్పగిస్తున్నారు. గతంలో జీసీడీవో, సీఎంవోలు నిర్వహించగా ఈ సంవత్సరం ఏఎంవోకి అప్పగించారు.
ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమంపై ఉన్నతాధికారులు పట్టింపు లేకుండా ఉన్నారు. విద్యాశాఖలో పర్యవేక్షణ లోపంతో ఇటీవల గెజిటెడ్ హెడ్మాస్టర్ కాని వ్యక్తితో సర్టిఫికెట్ల పరిశీలన చేయించినా, అమెరికాలో ఉన్న హెచ్ఎంకు ఎంఈవో బాధ్యతలు అప్పగించినా, రూ.1.84 కోట్లు స్వాహా చేసినా నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారు. ఈ నెల 8న రాష్ట్ర విద్యాశాఖ నుంచి కళా ఉత్సవ్ నిర్వహించడానికి ఉత్తర్వులు వచ్చాయి. దీంతో ఉత్సవాలు నిర్వహించాలని ఈ నెల 17న ఏఎంవోకి బాధ్యతలు అప్పగించారు. 19న నిర్వహించాలంటూ ఒక రోజు ముందు మాత్రమే బాధ్యతలు ఇవ్వడం పట్ల ప్రాధాన్యం లేదనే అంశం స్పష్టమవుతోంది. ఈ బాధ్యతలు అప్పగించిన ఏఎంవోకే మళ్లీ 18న డీఎస్సీ నూతన ఉపాధ్యాయులతో కలెక్టర్ ముఖాముఖి కార్యక్రమ బాధ్యతలూ అప్పగించారు.
అన్ని యాజమాన్యాల పరిధిలోని పాఠశాలల్లో చదువుతున్న 9 నుంచి 12 తరగతుల విద్యార్థులు ఈ కళా ఉత్సవ్‌లో పాల్గొనడానికి అర్హులు. ఒక ఆర్ట్ ఫామ్‌లో ఒక టీం లేదా వ్యక్తిగతంగా ఒకరు మాత్రమే పాల్గొనాలి. జిల్లాస్థాయిలో ప్రతిభ కనబర్చిన వారికి నవంబర్ 1 లేదా 2 తేదీల్లో రాష్ట్రస్థాయిలో నిర్వహించే పాటీల్లో పాల్గొంటారని ఏఎంవో కేశవపట్నం రవికుమార్ తెలిపారు. వోకల్ మ్యూజిక్, ఇన్స్టూమెంటల్ మ్యూజిక్, విజువల్ ఆర్ట్‌ఫామ్స్, డ్యాన్స్, థియేటర్, ట్రెజిషనల్ స్టోరీ టెల్లింగ్‌లో పోటీలు నిర్వహించారు.
వోకల్ మ్యూజిక్ (నయన శ్రేష్ట – హార్వెస్ట్ స్కూల్), ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ (అసిఫియా ఫాతిమా – ఆక్స్ఫర్డ్ స్కూల్), డ్యాన్స్ (జడ్పీహెచ్ఎస్ కైకొండాయిగూడెం), విజువల్ ఆర్ట్స్ (శ్రీజ – జడ్పీహెచ్ఎస్ తెల్దారుపల్లి), థియేటర్ (హార్వెస్ట్ పబ్లిక్ స్కూల్), ట్రెడిషనల్ స్టోరీ టెల్లింగ్ (లాస్య – బ్లూమింగ్ మైండ్స్) విజేతలుగా నిలిచారు.