కొత్తగూడెం సింగరేణి, మే 29: ప్రభుత్వ బొగ్గు సంస్థలు డిమాండ్‌కు తగ్గట్టుగా నాణ్యమైన బొగ్గును ఉత్పత్తి చేసేలా సమాయత్తం చేసేందుకు కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ నడుం బిగించింది. రానున్న రోజుల్లో ఇంధన రంగంలో స్వయం సమృద్ధి సాధించే క్రమంలో కోలిండియా సహా సింగరేణి సంస్థపై కీలక సమీక్షా సమావేశాన్ని నిర్వహించింది. బొగ్గు ఉత్పత్తి వ్యయం తగ్గింపు, నాణ్యమైన బొగ్గు సరఫరా తదితర అంశాల్లో ఎదురవుతున్న సవాళ్లు, వాటిపై తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు.
కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి అధ్యక్షతన ఢిల్లీ నుంచి గురువారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో బొగ్గు శాఖ కార్యదర్శి విక్రం దేవ్‌దత్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సింగరేణి సంస్థ తరఫున హైదరాబాద్ సింగరేణి భవన్ నుంచి సీఎండీ బలరాం సమీక్షలో పాల్గొన్నారు. సింగరేణి సంస్థ ప్రగతి, భవిష్యత్ ప్రణాళికలు తదితర అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కూలంకశంగా వివరించారు. ఈ సందర్భంగా కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ కార్మికుల జీతాలు, సంక్షేమ కార్యక్రమాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా బొగ్గు ఉత్పత్తి చేయాలన్నారు.
ఇందుకోసం కార్మిక సంఘాల సహకారం తీసుకోవాలని, పని సంస్కృతి మెరుగుపర్చాలని సూచించారు. అలాగే ఉత్పత్తి ఖర్చు తగ్గింపు కోసం సింగరేణి అధికారులు, బొగ్గు మంత్రిత్వ శాఖ నిపుణులతో ఒక కమిటీ వేయాలని సూచించారు. కార్యక్రమంలో సింగరేణి డైరెక్టర్లు సత్యనారాయణరావు, ఎల్వీ సూర్యనారాయణరావు, వెంకటేశ్వర్లు, పీఅండ్‌పీ, పా ఈడీ ఎస్డీఎం సుభాని పాల్గొన్నారు.