అశ్వారావుపేట/ రఘునాథపాలెం, ఆగస్టు 24 : బదిలీలపై ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సొసైటీల సీఈవోలు పెదవి విరుస్తున్నారు. మార్గదర్శకాల్లో కనీస స్పష్టత ఇవ్వకుండా ఉన్నపళంగా బదిలీలు చేపట్టడమేంటని నిలదీస్తున్నారు. ఎక్కడికి బదిలీ చేసినా వెళతామని, కానీ వేతనాల చెల్లింపునకు ష్యూరిటీ కావాలని అంటున్నారు. అయితే, ఇప్పటికే సస్పెన్షన్, డీఫాల్ట్ల జాబితాలో ఉన్న సొసైటీల సీఈవోలకు కూడా బదిలీ అవకాశం కల్పించడంపై విస్మయం వ్యక్తమవుతోంది.
ముందుగా ప్రమోషన్లు కల్పించాలని, తద్వరా ఏర్పడే ఖాళీలను తరువాత బదిలీల ద్వారా భర్తీ చేయాలని పీఏసీఎస్ (పాక్స్) యూనియన్ బాధ్యులు డిమాండ్ చేస్తున్నారు. బదిలీల కోసం సోమవారం మధ్యాహ్నం వరకు ఆప్షన్లు ఇచ్చుకోవడానికి స్టేట్ లెవెల్ ఎంపవర్డ్ కమిటీ (ఎస్ఎల్ఈసీ) గడువు నిర్దేశించడం పట్ల కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అయితే, కొన్ని జిల్లాల యూనియన్లు కోర్టును ఆశ్రయించనున్నట్లు సమాచారం.
ఏళ్ల తరబడి తిష్టవేసిన సీఈవోలను జీవో నంబర్ 44 ద్వారా బదిలీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా సీఈవోలు తమ బదిలీలకు ఈ నెల 25న మధ్యాహ్నం కల్లా ఆప్షన్లు ఇచ్చుకోవాలంటూ తెలంగాణ స్టేట్ కో-ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ లిమిటెడ్ ఈ నెల 22న సర్క్యులర్ జారీ చేసింది. అయితే, ఈ బదిలీలపై పాక్స్ యూనియన్ల నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మొదటిసారి బదిలీ ప్రక్రియ చేపట్టినప్పుడు ఉద్యోగుల అనుమానాలను నివృత్తి చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
బదిలీల ప్రక్రియపై సీఈవోలను అనేక అనుమానాలు వెంటాడుతున్నాయి. అనేక డిమాండ్లూ చేస్తున్నారు. ముందుగా ప్రమోషన్లు కల్పించాకే బదిలీలు చేపట్టాలన్నది ప్రధాన డిమాండ్. ఉమ్మడి జిల్లాలోని సొసైటీలను టర్నోవర్ల వారీగా గ్రేడ్లుగా విభజించారని, ఒక గ్రేడ్లో సీనియర్లు, జూనియర్లు ఉంటారని అంటున్నారు. అయితే, ప్రమోషన్లలో వారికి ఎలాంటి ప్రాధాన్యమినిస్తారో స్పష్టం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ‘ఏ’ గ్రేడ్ స్థాయి అధికారులను అదే గ్రేడ్ పరిధిలో బదిలీ చేస్తే వారి సినియారిటీని నిర్లక్ష్యం చేయడమే అవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే, ఇప్పటికే సస్పెండ్ అయిన, డీఫాల్ట్ అయిన సొసైటీల్లోని సీఈవోలపై చర్యలు తీసుకోకుండానే బదిలీల్లో వారికి ఎలా అవకాశం ఇస్తారన్న సందేహం లేకపోలేదు.
ఉదాహరణకు నిధుల దుర్వినియోగం సహా ఇతర కారణాల వల్ల ఇల్లెందు సొసైటీ సీఈవోను గత ఏడాది అప్పటి డీసీవో సస్పెండ్ చేశారు. కానీ తాజా బదిలీల్లో ప్రభుత్వం అతడికి బదిలీ అవకాశం కల్పించడం గమనార్హం. కొద్దిరోజుల క్రితం సొసైటీ పాలకవర్గాల పదవీ కాలాన్ని పొడిగించిన ప్రభుత్వం.. సంఘాల నష్టానికి కారణమైన, నిధుల దుర్వినియోగానికి పాల్పడిన, ఇతర అవినీతి అరోపణలు ఉన్న సొసైటీలకు పదవీకాలం పొడిగింపును వర్తింపజేయలేదు. ఆ సొసైటీలకు పర్సన్ ఇన్చార్జులను నియమించాలంటూ ఉత్తర్వుల్లో స్పష్టతనిచ్చింది. మరి, ఇంకొన్ని సొసైటీలు డీఫాల్ట్ జాబితాలో ఉన్నప్పుడు వాటి సీఈవోలకు బదిలీ అవకాశం ఎలా ఇస్తారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
అంతేకాకుండా, ‘ఎక్కడికి బదిలీ చేసినా వెళతాం, కానీ వేతనాల చెల్లింపునకు ష్యూరిటీ ఇవ్వాలి’ అనే డిమాండ్ కూడా సీఈవోల నుండి వినిపిస్తోంది. మార్జిన్ ఖాతా నుంచే వేతనాలు చెల్లించాలని పట్టుబడుతున్నారు. సొసైటీల నుంచి వేతనాలు తీసుకోవడం కష్టమని చెబుతున్నారు. ఎందుకంటే కొన్ని సొసైటీల టర్నోవర్ ఆధారంగా వాటిల్లోని సీఈవోలు అక్కడి నుంచి వేతనాలు తీసుకోవడం సాధ్యం కాదని చెబుతున్నారు. ఇలాంటి అనుమానాలున్న నేపథ్యంలో బదిలీలు చేయడం సరికాదని అంటున్నారు. అయితే, క్లారిటీ ఇవ్వకుండా బదిలీలు చేపడితే కోర్టును ఆశ్రయించాలనే ఆలోచనలో కొన్ని జిల్లాల యూనియన్లు ఉన్నాయి.
ఉమ్మడి జిల్లాలోని కొన్ని సొసైటీలను ఖాళీలు వెంటాడుతున్నాయి. తాత్కాలికంగా స్టాఫ్ అసిస్టెంట్లను ఇన్చార్జులుగా పెట్టి నడిపిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 100 సహకార సంఘాలున్నాయి. వీటిల్లో గార్ల, బయ్యారం సొసైటీలు మహబూబాబాద్ జిల్లాలోకి; వాజేడు, వెంకటాపురం సొసైటీలు ములుగు జిల్లాలోకి వెళ్లాయి. మిగతా 96 సొసైటీల్లో ‘ఏ’ గ్రేడ్లో 16 సొసైటీలకుగాను 3, ‘బీ’ గ్రేడ్లో 23 సొసైటీలకు గాను 4, ‘సీ’ గ్రేడ్లో 45 సొసైటీలకు గాను 8, ‘డీ’ గ్రేడ్లో 12 సొసైటీలకు గాను 7 ఖాళీలు ఉన్నాయి. మొత్తం 24 సీఈవో పోస్టులు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ముందుగా వీటిని భర్తీ చేసిన తర్వాతే బదిలీలు చేపట్టాలని యూనియన్లు డిమాండ్ చేస్తున్నాయి.
సొసైటీల్లో మొదటిసారి చేపడుతున్న బదిలీల్లో విధివిధానాలు సక్రమంగా లేవు. అనుమానాలను నివృత్తి చేసిన తర్వాతే బదిలీ చేయాలి. ఇందుకోసం వారం రోజులు గడువు కోరుతున్నాం. ముఖ్యంగా వేతనాలు చెల్లింపులో ష్యూరిటీ లేదు. కొన్ని సంఘాల్లో వేతనాలు చెల్లించే పరిస్థితి లేదు. అక్కడ వేతనాలు ఎలా తీసుకోగలం? ఇలాంటి వాటిపై సోమవారం అత్యవసర సమావేశం నిర్వహించి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం.
-విప్ప శ్రీనివాసరావు, రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ, తెలంగాణ పాక్స్ ఎంప్లాయీస్ యూనియన్