భద్రాద్రి కొత్తగూడెం, డిసెంబర్ 26 (నమస్తే తెలంగాణ)/సారపాక/ భద్రాచలం: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం భద్రాచలంలో పర్యటించనున్నారు. రాష్ట్రపతి పర్యటనపై ఇప్పటికే రాష్ట్ర రవాణాశాఖ మంత్రి అజయ్‌కుమార్ ప్రభుత్వ అధికారులతో సమీక్ష నిర్వహించారు. పర్యటనలో ఎలాంటి లోటుపాట్లకు తావు ఉండకూడదని ఆదేశాలు జారీ చేశారు. భద్రాద్రి కలెక్టర్ అనుదీప్, ఎస్పీ వినీత్ స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. సారపాక బీపీఎల్ హైస్కూల్లో హెలిపాడ్ పనులను ఆర్అండ్బీ ఈఈ భీమ్లా పూర్తి చేయించారు. రాష్ట్రపతికి సాదర స్వాగతం పలికేందుకు అదనపు కలెక్టర్ కర్నాటి వెంకటేశ్వర్లు ప్రత్యేక అధికారిగా నియమితుడయ్యారు. భద్రాచలం ఏఎస్పీ రోహిత్‌రాజ్, జిల్లా అగ్నిమాపకశాఖ అధికారి శ్రీనివాసరావు, వివిధ మండలాల తహసీల్దార్లు యంత్రాంగాన్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తారు. ఎన్ఐసీ అధికారులు రాష్ట్రపతి భద్రతకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.
ముమ్మరంగా తనిఖీలు..
రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో 27, 28 న బూర్గంపహాడ్, భద్రాచలం మండలాల్లో 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు పోలీస్‌శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పోలీసులు ఇంటింటికీ వెళ్లి కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నారు. గ్రామాల్లో కొత్త ముఖాలు కనిపిస్తే వారిపై నిఘా పెట్టారు. ప్రతి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యుల వివరాలు తెలుసుకుంటారు. అపరిచితుల కదలికలపై నిఘా ఏర్పాటు చేశారు. వైద్యారోగ్యశాఖ అధికారులు రామాలయ ఆవరణలో క్రిటికల్ కేర్ బాక్స్ ఏర్పాటు చేస్తున్నారు. వైద్యులు ఉచిత వైద్యశిబిరం నిర్వహించనున్నారు. అంబులెన్స్‌లను అందుబాటులో ఉంచనున్నారు. వైద్యపరమైన సేవలను ఎప్పటికప్పుడు డీఎంహెచ్‌వో శిరీష, డీసీహెచ్ఎస్ రవికుమార్ పర్యవేక్షిస్తున్నారు.
రాష్ట్రపతి పర్యటన ఇలా..
రాష్ట్రపతి తొలుత సారపాక హెలిపాడ్‌లో దిగి ఐటీసీ గెస్ట్ హౌస్‌కు చేరుకుంటారు. తర్వాత అక్కడి నుంచి భద్రాచలంలోని శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో స్వామివారిని దర్శించుకుంటారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా రూ.41 కోట్లతో అమలు చేస్తున్న ప్రసాద్ పథకాన్ని ప్రారంభిస్తారు. భద్రాచలం కూనవరం రోడ్‌లోని వీరభద్ర కల్యాణ మండపంలో ఆదివాసీలతో ముఖాముఖి నిర్వహిస్తారు. వర్చువల్ విధానంలో మహబూబాబాద్, ఆసిఫాబాద్ జిల్లాలో నిర్మించిన ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలను ప్రారంభిస్తారు.
ఆర్మీ హెలికాఫ్టర్ ట్రయల్ రన్..
రాష్ట్రపతి పర్యటన ట్రయల్న్‌క్రు సోమవారం హైదరాబాద్ నుంచి ఆర్మీ హెలికాఫ్టర్ వచ్చింది. సారపాకలో ఏర్పాటు చేసిన మూడు హెలిప్యాడ్ల నుంచి భద్రతా సిబ్బంది, పైలట్స్ ట్రయల్న్ నిర్వహించారు. మంగళవారం మరో మూడు హెలికాఫ్టర్లు సారపాక చేరుకోనున్నాయి. మరోసారి భద్రతా సిబ్బంది ఏర్పాట్లను పునః పరీశీలించనున్నారు.