కారేపల్లి, ఏప్రిల్ 08 : గర్భిణీలు పోషకాహారం తీసుకోవడంతో పాటు ప్రతీ నెల ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని, తద్వారా ఆరోగ్యవంతమైన బిడ్డకు జన్మ ఇవ్వొచ్చని ఐసీడీఎస్ సూపర్వైజర్ పి.మాలతి కుమారి అన్నారు. ఖమ్మం జిల్లా కామేపల్లి ప్రాజెక్ట్ కారేపల్లి మండల పరిధిలోని భాగ్యనగర్ సెక్టార్ లోని లావుడియాతండా అంగన్వాడీ సెంటర్లో మంగళవారం పోషణ పక్షంలో భాగంగా వెయ్యి రోజుల ప్రాముఖ్యతను తల్లులకు వివరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ 22వ తేదీ వరకు అంగన్వాడీ కేంద్రాల్లో పోషణ పక్షోత్సవాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. అందులో భాగంగానే మంగళవారం మొదటి రోజు గర్భిణీల బరువు, ఎత్తు చూసినట్లు చెప్పారు.
వెయ్యి రోజులు అంటే ఒక స్త్రీ గర్భం దాల్చినప్పటి నుండి బిడ్డకు రెండు సంవత్సరాలు పూర్తయ్యేంత వరకు ఉన్న సమయాన్ని వెయ్యి రోజులు అంటారన్నారు. ఈ వెయ్యి రోజుల్లో గర్భిణీ సరైన పోషకాహారం తీసుకుని, పుట్టిన వెంటనే శిశువుకు ముర్రుపాలు పట్టించడం, ఆరు నెలల వరకు కేవలం తల్లిపాలే పట్టడం ఆరోగ్యకరమన్నారు. ఆరు నెలలు నిండిన తర్వాత తల్లిపాలను కొనసాగిస్తూ అనుబంధ పోషకాహారం మొదలుపెట్టాలన్నారు. వయసుకు తగ్గ ఆహారం పెడుతూ శిశువుకు రెండు సంవత్సరాలు పూర్తయ్యేంత వరకు ఎటువంటి అనారోగ్యాలు దరిచేరకుండా తల్లులు చూసుకోవడంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం కృష్ణవేణి, అంగన్వాడీ టీచర్ ఎల్. సుజాత, ఆశ గమ్లి, అంగన్వాడీ ఆయ లక్ష్మి, గర్భిణీలు, బాలింతలు పాల్గొన్నారు.