భద్రాద్రి కొత్తగూడెం, మే 13 (నమస్తే తెలంగాణ) : వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని కలెక్టర్ అనుదీప్ వైద్యాధికారులను ఆదేశించారు. వ్యాధుల సంక్రమణ జరగకుండా చేపట్టాల్సిన పటిష్ఠ నియంత్రణ చర్యల గురించి శుక్రవారం ప్రకటనలో పేర్కొన్నారు. వర్షాకాలంలో అంటువ్యాధులు ప్రబలే అవకాశమున్నందున ముందస్తు చర్యలు సత్ఫలితాలను ఇస్తాయని తెలిపారు. మురుగునీరు నిల్వ ఉండే ప్రాంతాలను గుర్తించి నీటి నిల్వలు లేకుండా చేయాలని, ఈ నెల 20వ తేదీ నుంచి పల్లె ప్రగతి కార్యక్రమాలు ప్రారంభమవుతున్నందున నీరు నిల్వ ఉండే ప్రాంతాలను గుర్తించాలన్నారు. వారంలో రెండురోజులు తప్పనిసరిగా డ్రైడే పాటించి, ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. మలేరియా, డెంగీ, చికున్‌గున్యా వ్యాధులు ప్రబలిన గ్రామాల్లో యాంటీ లార్వా స్ప్రే చేయాలని సూచించారు. ఆరోగ్య శిబిరాలు నిర్వహించి ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించాలని, అత్యవసర వైద్య సేవలు నిర్వహణకు ప్రతి ఆశ కార్యకర్తకు అత్యవసర మందుల కిట్‌ను అందజేయాలన్నారు. మారుమూల ప్రాంతాల్లో నివసించే ప్రజల ఆరోగ్య పరిరక్షణపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని పేర్కొన్నారు.
కలెక్టర్‌ను కలిసిన ఉద్యోగుల సంఘం
జిల్లాలో నూతనంగా ఏర్పడిన తెలంగాణ నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం కొత్త కార్యవర్గం కలెక్టర్ అనుదీప్‌ను శుక్రవారం మర్యాద పూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛాన్ని అందించారు. జిల్లా గౌరవ అధ్యక్షుడు అజ్మీరా రాంరవి, అధ్యక్షుడు సాదిక్‌పాషా, ఉపాధ్యక్షులు రాయబారపు నాసరయ్య, కృష్ణ, జిల్లా కార్యదర్శి దినేశ్, సహాయ కార్యదర్శి హరిబాబు, ప్రచార కార్యదర్శి వెంకటరామయ్య, నరసింహారావు, మైనార్టీ రాష్ట్ర ఉద్యోగుల సంఘం ఉపాధ్యక్షుడు మహబూబ్, మేడి ఎల్లయ్య పాల్గొన్నారు.
బుద్ధ జయంతికి కలెక్టర్‌కు ఆహ్వానం
కొత్తగూడెం కల్చరల్, మే 14 : బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జరిగే గౌతమ బుద్ధుడి జయంతి వేడుకలకు రావాలని కలెక్టర్ దురిశెట్టి అనుదీప్‌ను కమిటీ పెద్దలు శుక్రవారం కోరారు. జిల్లా అధ్యక్షుడు సిద్దెల రవి, ట్రెజరర్ రొడ్డా పద్మావతి కలెక్టర్‌ను కలిసి ఈ నెల 16వ తేదీన జరిగే వేడుకల్లో ముఖ్యఅతిథిగా పాల్గొనాలని కోరారు.
Precautions against the spread of diseases