భద్రాద్రి కొత్తగూడెం, జూన్ 26 (నమస్తే తెలంగాణ) : ప్రతి ఏటా వానకాలం సీజన్ వచ్చిందంటే చాలు మన్యంపై వ్యాధుల పంజా విసురుతూనే ఉంది. వైద్య శాఖ ఎంత అప్రమత్తంగా ఉన్నా ఏజెన్సీ జనం రోగాలబారిన పడక తప్పడం లేదు. గత ఏడాదితో పోల్చితే జ్వరాలు తగ్గుముఖం పట్టినప్పటికీ గ్రామాలు, పట్టణాల్లో మురుగునీరు నిల్వ ఉంటూనే ఉంటుంది. మురికి కాలువల్లో నీరు నిల్వ ఉండి దోమలు స్వైరవిహారం చేయడంతో వైరల్ జ్వరాలు వెంటాడుతున్నాయి. దీంతో పేదలు ప్రైవేటు ఆసుపత్రులపాలై జేబులకు చిల్లు పెట్టుకోవాల్సిన పరిస్థితి దాపురిస్తున్నది. వైద్యారోగ్య శాఖ ఎన్ని ప్రయత్నాలు చేసినా జ్వరాలను నిలుపుదల చేయడంలో ఒకడుగు వెనక ఉన్నట్లే తెలుస్తుంది. ప్రస్తుతం వానలు పడుతున్నాయి.. ఆరోగ్య శాఖ ముందస్తు చర్యలు తీసుకోకపోతే ప్రజలు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉంటుంది. జనం కూడా పరిసరాలు, వ్యక్తిగత పరిశుభ్రతపై జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య శాఖ అధికారులు సూచిస్తున్నారు. మరి ఈ ఏడాది వైద్యారోగ్య శాఖ వ్యాధులు ప్రబలకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచిచూడాలి.
పంచాయతీలు, మున్సిపాలిటీల్లో డ్రైనేజీలు మురుగుకూపాలుగా దర్శనమిస్తున్నాయి. పాల్వంచ, కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోని కాలువల్లో మురుగు పేరుకుపోయింది. పాఠశాలల్లో తాగునీరు ట్యాంకుల పరిస్థితి దారుణంగా ఉంది. ట్యాంకుల వద్ద అపరిశుభ్రత ఉన్నా సంబంధిత ఉపాధ్యాయులు దానిపై దృష్టిపెట్టడం లేదనే విమర్శలు ఉన్నాయి. పల్లెల్లో పశువుల కొట్టాలు, మేకలు, గొర్రెల పాకలు మురికి కూపాలకు అడ్డాలుగా మారుతున్నాయి.
ప్రతి పీహెచ్సీ నుంచి వైద్యులు, సిబ్బందితో కలిసి గ్రామాల్లో వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. కొత్తగా వచ్చిన కలెక్టర్ జితేశ్ వి పాటిల్ వైద్యంపై ప్రత్యేక దృష్టి పెట్టడంతో ఆరోగ్య శాఖ మరో అడుగు ముందుకు వేసింది. దీంతో ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో జ్వరాలకు సంబంధించిన మందులను సిద్ధంగా ఉంచుకున్నారు. ఇంటింటికీ వెళ్లి సర్వే చేసి రోగుల పరిస్థితిని తెలుసుకుంటున్నారు. ముఖ్యంగా గొత్తికోయ గూడేలను జల్లెడ పడుతున్నారు. ఇతర రాష్ర్టాల నుంచి వలస వచ్చిన ఆదివాసీలు గతంలో మలేరియా వచ్చిన వారికి పరీక్షలు చేసి క్లోరిక్విన్ మాత్రలు వేస్తున్నారు. మలేరియా ప్యారాసైట్ బాడీలో ఉండడం వల్ల అది ఇతరులకు వ్యాప్తి చెందే అవకాశం ఉండడం వల్ల ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ముందస్తు చర్యల్లో భాగంగా ఇప్పటికే ఆరోగ్య శాఖ ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలతో 2లక్షల మందికి రక్తనమూనాలు తీసి మందులు పంపిణీ చేశారు. దీనికితోడు వైద్య శిబిరాలు కూడా నిర్వహించారు. మూడు వేల మందికి డెంగీ శాంపిల్స్‌ను తీశారు. 30 వేల మందికి పారా చెక్ టెస్టింగ్‌లను చేశారు. దీంతోపాటు గ్రామాల్లోని మురికి గుంతల్లో దోమల నివారణకు కిమోపాస్ 5 లీటర్లు, డిప్లుబెంజారిన్ 2 కిలోలు ఆయా పంచాయతీలకు అప్పగించారు. 200 డెంగీ కిట్లను అందుబాటులో ఉంచారు. ఐటీడీఏ ద్వారా 2 లక్షల గంబూషియా చేపలను గుంతల్లో వదలడానికి సిద్ధం చేశారు.
జ్వరాలను అదుపు చేయడంలో భాగంగా వైద్యారోగ్య శాఖ ప్రభుత్వ వసతి గృహాలపై ఫోకస్ పెట్టింది. ఇప్పటికే 188 వసతి గృహాల్లో స్పెషల్ డ్రైవ్ పేరుతో దోమల మందు పిచికారీ చేయించింది. దీంతోపాటు 131 హైరిస్క్ గ్రామాలను గుర్తించి అక్కడ కూడా అడుగడుగునా స్ప్రేయింగ్ కార్యక్రమాన్ని చేపట్టడంతో గత ఏడాదికంటే ఈ ఏడాది మలేరియా, డెంగీ కేసులు తగ్గుముఖం పట్టినట్లు వైద్యారోగ్య శాఖ లెక్కలు చెబుతున్నాయి. గత ఏడాది మలేరియా 88 కేసులు నమోదు కాగా.. డెంగీ 125 కేసులు వచ్చాయి. ఈ ఏడాది ఇప్పటివరకు మలేరియా 32 కేసులు, డెంగీ 11 కేసులు నమోదయ్యాయి. దీంతో మలేరియా అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అయినా రానున్న సమయం చాలా కీలకం కాబట్టి ఆరోగ్య శాఖ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటే తప్ప జ్వరాలు అదుపులోకి రావని నిణుపులు అంటున్నారు.
ప్రతి ఏటా వానకాలం వచ్చిందంటే జ్వరాలు వస్తుంటాయి. ఈ ఏడాది ముందస్తు చర్యల్లో భాగంగా ఇప్పటికే దోమల మందు పిచికారీ మొదటి విడత పూర్తి చేశాం. ముఖ్యంగా పిల్లలు చదువుకునే హాస్టళ్లలో దోమల మందు చల్లించాం. హైరిస్క్ గ్రామాలపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టాం. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది ఇప్పటివరకు మలేరియా, డెంగీ కేసులు తగ్గాయి. ఇప్పటికే 2 లక్షల మందికి బ్లడ్ శాంపిల్స్ తీశాం.