మధిర, ఏప్రిల్ 07 : ప్రజా పాలనలో ముందస్తు అరెస్టులు చేయడం దారుణమని రాష్ట్ర ఎంప్లాయీస్ యూనియన్ కార్యదర్శి తిమ్మినేని రామారావు అన్నారు. సోమవారం టీజీఎస్ఆర్టీసీ జేఏసీ సమ్మె సమరభేరి కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ జేఏసీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముద్దిశెట్టి రామచంద్రరావు, ఎంప్లాయీస్ యూనియన్ మధిర డిపో కార్యదర్శి షేక్ నాగుల్ మీరాను సమ్మె సమరభేరికి వెళ్లకుండా పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేసి స్టేషన్ తరలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… అధికారంలోకి వస్తే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని ఎన్నికలకు ముందు కాంగ్రెస్ చెప్పింది. ఆర్టీసీ కార్మికుల సమస్యలన్నీ పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చింది.
కానీ ప్రభుత్వం వచ్చి 15 నెలలు గడిచినప్పటికీ ఏ ఒక్క హామీని కూడా అమలు పరచలేదన్నారు. ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్ల సాధనకై పోరాటం చేస్తుంటే ముందస్తుగా అరెస్టులు చేసి అన్యాయంగా ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కారం చేసి, ఆర్టీసీ కుటుంబాల్లో వెలుగులు నింపాలన్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా సిబ్బందిపై తీవ్రమైన పని ఒత్తిడి పడడంతో అనేక ఇబ్బందులకు గురవుతున్నట్లు చెప్పారు. పని భారాన్ని తగ్గించి, మహాలక్ష్మి పథకం ద్వారా వచ్చే పైకాన్ని ప్రభుత్వం వెంటనే ఆర్టీసీ సంస్థకు చెల్లించాలని డిమాండ్ చేశారు.