చండ్రుగొండ/ టేకులపల్లి, నవంబర్ 18: గిరిజన విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో లగచర్లలోని గిరిజన కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్తున్న గిరిజన విద్యార్థి సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి మూడ్ బాలాజీనాయక్, భారతీయ గోర్ బంజారా పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు రవిచందర్ చౌహాన్లను చండ్రుగొండ పోలీసులు సోమవారం ముందస్తు అరెస్టు చేశారు.
అలాగే సేవాలాల్ సేన జిల్లా అధ్యక్షుడు దరావత్ సురేశ్‌ను టేకులపల్లి పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకొని ఠాణాకు తరలించారు. ఈ సందర్భంగా ఆయా పోలీస్స్టేషన్ల ఆవరణలో వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలోని గిరిజన రైతుల భూములను లాక్కోవాలని చూస్తున్న ప్రభుత్వ కుట్రను తిప్పికొడతామన్నారు. వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాలను పోషించుకునే పేద గిరిజనుల జోలికొస్తే సేవాలాల్ సేన ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. అరెస్టులతో కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజనుల హక్కులను కాలరాయాలని చూస్తే ఊర్కునేది లేదన్నారు.