కూసుమంచి/ ఖమ్మం రూరల్, మార్చి 12: పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ మాజీ సర్పంచులు తలపెట్టిన ‘చలో హైదరాబాద్’ కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. బుధవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు మంగళవారం రాత్రే రంగంలోకి దిగారు. మంగళవారం అర్ధరాత్రి, బుధవారం తెల్లవారుజాము వేళల్లో బీఆర్ఎస్ మాజీ సర్పంచుల ఇళ్ల వద్దకు వెళ్లారు. ఎక్కడికక్కడ ముందస్తు అరెస్టులు చేసి పోలీసుస్టేషన్లకు తరలించారు.
మధ్యాహ్నం తరువాత వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని పది మంది మాజీ సర్పంచులను, ఖమ్మంరూరల్ మండలంలో ఒక సర్పంచ్‌ను అదుపులోకి తీసుకున్నారు. కూసుమంచి మండలంలో పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో బీఆర్ఎస్ మాజీ సర్పంచులు కొండా సత్యం, బాణోత్ కిషన్, కాసాని సైదులు, తేజావత్ రాములు, జక్కుల వెంకటేశ్వర్లు, దామళ్ల మమత, కుంభం రమణ, రాయభారపు స్వాతి, నలబోలు మాధవి, వాసంశెట్టి అరుణ, ఖమ్మం రూరల్ మండలం నుంచి తీర్థాల మాజీ సర్పంచ్ బాలునాయక్ తదితరులు ఉన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తాము చలో హైదరాబాద్ వెళ్లడం లేదని చెప్పినా వినకుండా పోలీసులు తమను అరెస్టు చేశారని మండిపడ్డారు. కొద్ది నెలలుగా తాము చలో అసెంబ్లీకి పిలుపునిచ్చిన ప్రతిసారీ తమను ఇలాగే పోలీసులతో ప్రభుత్వం అరెస్టు చేయిస్తోందని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం పెండింగ్ బిల్లులను, బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
సమస్యల పరిష్కారం కోసం చలో హైదరాబాద్‌కు తరలివెళ్లకుండా కూసుమంచిలోని మాజీ వీఆర్ఏలను కూడా పోలీసులు అడ్డుకున్నారు. బుధవారం వారిని ముందస్తుగా అరెస్టు చేశారు. సాయంత్రానికి విడుదల చేశారు. అరెస్టయిన వారిలో మాజీ వీఆర్ఏలు సలువాది రాము, కందుల మోహన్, దాదె రాణి, చప్పిడి బాబు ఉన్నారు.