ఖమ్మం, జూలై 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రాష్ట్రంలోని ఏ ఒక్క రైతుకు అన్యాయం జరిగినా అగ్గి పుట్టిస్తామని జనగామ శాసనసభ్యులు, బీఆర్ఎస్ నేత పల్లా రాజేశ్వర్‌రెడ్డి రేవంత్ సర్కార్‌ను హెచ్చరించారు. ఖమ్మంజిల్లాలోని చింతకాని మండలం ప్రొద్దుటూరులో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న రైతు ప్రభాకర్ కుటుంబాన్ని ఆదివారం బీఆర్ఎస్ బృందంతో కలిసి పరామర్శించారు. అనంతరం మాజీ వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, శాసన మండలి సభ్యుడు తాతా మధుసూదన్, మాజీ శాసనసభ్యుడు సండ్ర వెంకటవీరయ్య, ఖమ్మం జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజుతో కలిసి విలేకరులతో ఆయన మాట్లాడారు. తన భూమిని కాపాడమని రెవెన్యూ, పోలీస్ అధికారులను ఎన్నిసార్లు వేడుకున్నా పట్టించుకోకపోవడం వల్లనే ప్రభాకర్ ఆత్మహత్య చేసుకున్నాడని విమర్శించారు. రాష్ట్రంలో రెవెన్యూశాఖలో అవినీతి పెట్రేగిపోయిందని, అధికారులు డబ్బులు లేకుండా ఏ పనీ చేయడం లేదని, సాక్షాత్తు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తమను ఏమీ అనరనే ఉద్దేశంతో రెవెన్యూ ఉద్యోగులు ప్రజలను పట్టి పీడిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో పలువురు మంత్రులు రెండుచేతులతో కాకుండా నాలుగు చేతులతో సంపాదిస్తున్నారని.. అందులో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒకరని విమర్శించారు. రేవంత్ సర్కార్ విధ్వంసకర కార్యక్రమాలు చేస్తున్న వారికి మద్దతుగా నిలుస్తోందని మండిపడ్డారు. ప్రభాకర్ తన భూమిని 40ఏళ్లుగా సాగు చేసుకుంటున్నాడని, ధరణి పాస్ పుస్తకం కలిగి ఉండి 11సార్లు రైతుబంధు పొందినట్లు తెలిపారు.
భూమికి కావాల్సిన అన్ని రకాల ఆధారాలను ప్రభాకర్ కలిగి ఉన్నాడన్నారు. ఐనప్పటికీ ప్రభాకర్ భూమికి ట్రెంచ్ కొట్టి చెరువులో కలపడం దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు. చట్టబద్దంగా ఉన్న ప్రభాకర్‌కు చెందిన 7.10 కరాలను రక్షించలేని రెవెన్యూ యంత్రాంగం ఎందుకుని పల్లా ప్రశ్నించారు. ప్రభాకర్ ఆత్మహత్య చేసుకొని వారంరోజులైనా బాధితులను కలిసి పరామర్శించాల్సిన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తాను, మాజీమంత్రి తన్నీరు హరీశ్‌రావు వస్తున్నామని తెలిసి కంటితుడుపు చర్యగా వచ్చి వెంటనే తిరిగి నిందితులను కలిసి వెళ్లడం బాధాకరమన్నారు. బోజడ్ల ప్రభాకర్ కుటుంబానికి వారి 7.10 ఎకరాల భూమి కచ్చితంగా చెందేవిధంగా చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని పల్లా డిమాండ్ చేశారు. ప్రభాకర్ ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోగా ఆత్మహత్యకు కారణమైన తహసీల్దార్, సీఐను తక్షణం సస్పెండ్ చేయాలన్నారు. ప్రభాకర్ కుటుంబానికి రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇచ్చి పిల్లలకు అండగా నిలవాలన్నారు. చనిపోయిన రోజు బాధిత కుటుంబాన్ని నిందితుల పేర్లు చెప్పొదంటూ పోలీసులు ఇబ్బందులకు గురిచేయడం బాధాకరమైన విషయమన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అనేకమార్లు చింతకాని మండలానికి వచ్చారని, దళితబంధు పథకాన్ని సైతం ఇక్కడి నుంచే పైలెట్ ప్రాజెక్టుగా అమలుచేసిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రభాకర్ ఆత్మహత్యకు కారణమై ఏ-1గా ఉండాల్సిన నిందితుడిని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తన కారులో తిప్పుకోవడం సిగ్గుచేటు చర్యగా మండిపడ్డారు. ఏమాత్రం సంబంధం లేని, గ్రామానికి పెద్దగా ఉన్న పుల్లయ్యపై కేసు పెట్టించి ఇబ్బందులు పెట్టడం దుర్మార్గమైన చర్య అన్నారు. అన్యాయంగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై కేసులు పెడితే మాత్రం సహించేది లేదని, తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరించారు. పోలీసులు అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారని దీనిని ఏమాత్రం సహించమన్నారు. మీరు చేసే అన్యాయాల చిట్టాలను రాసుకొని తిరిగి మేం అధికారంలోకి వచ్చాక ఉద్యోగాలు ఊడగొడతామని హెచ్చరించారు. ప్రభాకర్ కుటంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా నిలుస్తుందని పల్లా భరోసా కల్పించారు.