భద్రాచలం, జూన్ 14 : ఏజెన్సీలోని భద్రాచలం, దుమ్ముగూడెం మండలాల్లో శుక్రవారం సాయంత్రం ఈదురు గాలులు, ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురిసింది. గాలుల ధాటికి పెద్ద పెద్ద వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. కొన్నిచోట్ల విద్యుత్ తీగలపై చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. పిడుగుపాటు శబ్ధానికి భద్రాచలం పట్టణంలోని అర్చకుడు విశ్వతేజకు చెందిన ద్విచక్ర వాహనం బ్యాటరీ దగ్ధమైంది. గాలులకు బ్రిడ్జి సెంటర్లోని అయ్యప్ప స్వామి దేవాలయం సమీపంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ సెట్టింగ్ కూలిపోయింది. పట్టణంతోపాటు పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు కొన్ని గంటలపాటు అంతరాయం ఏర్పడింది. విద్యుత్, పంచాయతీ సిబ్బంది తీగలపై పడిన చెట్ల కొమ్మలను తొలగించి రాత్రి 8 గంటల సమయంలో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. సరిహద్దు ఉన్న ఏపీ రాష్ట్రంలోని యటపాక ప్రధాన రహదారిపై భారీ వృక్షం నేలకొరగడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అయితే కొన్ని రోజులుగా ఉక్కపోతతో అల్లాడిన ప్రజలకు శుక్రవారం కురిసిన భారీ వర్షంతో ఉపశమనం లభించింది. కాగా.. విద్యుత్‌ను సకాలంలో పునరుద్ధరించిన విద్యుత్ అధికారులు, సిబ్బందికి పట్టణ ప్రజలు అభినందనలు తెలిపారు.