ఖమ్మం అర్బన్/ ఆళ్ళపల్లి, ఆగస్టు 21 : ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులకు సంబంధించి సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని టీఎస్ సీపీఎస్ఈయూ జిల్లా అధ్యక్షుడు చంద్రకంటి శశిధర్ డిమాండ్ చేశారు. పాత పెన్షన్ సాధనే లక్ష్యంగా ఈ నెల 23న హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరుతూ ముద్రించిన వాల్ పోస్టర్లను కలెక్టరేట్లో శుక్రవారం ఆవిష్కరించారు.
జిల్లాలోని అన్ని విభాగాల నుంచి హాజరైన ఉద్యోగులనుద్దేశించి ఆయన మాట్లాడారు. పాత పెన్షన్ ఇస్తామని ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టినందున ఆదివారం చలో హైదరాబాద్ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. గత నెల 13న ఖమ్మంలో జనజాగరణ యాత్ర బైక్ ర్యాలీ నిర్వహించామని, ఉద్యోగులు ఈ కార్యక్రమంలో కూడా అధిక సంఖ్యలో పాల్గొని తమ ఆవేదన, పాత పెన్షన్ ఆవశ్యకతను, బలాన్ని చాటాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం జిల్లా కార్యదర్శి మోదుగు వేలాద్రి కార్యక్రమంలో పాల్గొని, సంఘీభావం ప్రకటించారు.
నాయకులు ఎస్డీఏకే జిలాని, బంగారయ్య, మోత్యా, నరసమాంబ, సురేందర్, దేవేందర్, ప్రసన్నకుమార్, శంకర్, పవన్ తదితరులు పాల్గొన్నారు. అలాగే ఆళ్లపల్లి మండల కేంద్రంలో ‘చలో హైదరాబాద్’ పోస్టర్ ఆవిష్కరించిన అనంతరం టీఎస్ సీపీఎస్ఈయూ మండల బాధ్యులు రమేశ్, లక్ష్మణ్‌లు మాట్లాడారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎంఈవో శాంతారావు, హెచ్ఎంలు బాబులాల్, రామకృష్ణ, హతీరాం, లక్ష్మణ్, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.