వైరాటౌన్, జూలై 5 : అర్హులైన నిరుపేదలకు ఇండ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ వైరా మున్సిపాలిటీ పరిధిలోని రెండో వార్డులో గల నిరుపేదలు మున్సిపల్ కార్యాలయం ఎదుట శనివారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు నిరుపేదలు మాట్లాడుతూ సొంత ఇండ్లు లేకపోవడంతో పూరి గుడిసెలు, రేకుల షెడ్లలో ఉంటూ వర్షాకాలంలో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని తెలిపారు.
అర్హులైన నిరుపేదలకు కాకుండా.. ఆస్తులు, భూములు, భవనాలు ఉన్న వారికి ఇండ్లు మంజూరు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మొదటి జాబితాలో పేరున్నప్పటికీ తీరా పట్టాలు ఇచ్చే సమయానికి అధికారులు పేర్లు మార్చారని ఆరోపించారు. వెంటనే అర్హులైన నిరుపేదలకు ఇండ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బత్తుల వెంకటేశ్వర్లు, మంజుల, వెంకటరమణ, బి.రజిని, అశ్విని, ఉష, మల్లేశ్వరి తదితరులు పాల్గొన్నారు.