కొణిజర్ల, ఫిబ్రవరి 15 : ఆటో మోటార్ కార్మిక ఐక్య రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు తీగలబంజర గ్రామంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ దిష్టిబొమ్మను శనివారం దహనం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రగతిశీల ఆటో అండ్ మోటార్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్కే లాల్మియా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు పథకంతో ఆటో కార్మికుల కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు.
దాదాపు 6.5 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన వారు పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, పీజీలు చదివి ఏ ఉపాధి లేకపోవడంతో కుటుంబ పోషణ కోసం ఫైనాన్స్‌లో ఆటోలు తీసుకొని నడుపుకుంటుంటే.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి వారి నోట్లో మట్టి కొట్టిందన్నారు.
ఉచిత బస్సుల వల్ల మహిళలు ఆటోలు ఎక్కకపోవడంతో ఆర్థికంగా సతమతమవుతున్నారని, వందలాదిగా ఆటో కార్మికులు కిస్తీలు కట్టలేక ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఆటో కార్మికులను ఆదుకునేందుకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, ప్రమాద బీమా రూ.10 లక్షల చొప్పున చెల్లించాలని కోరారు. కార్యక్రమంలో యూనియన్ జిల్లా నాయకులు భూక్యా బాలు, ముత్తనబోయిన లెనిన్, చందు, భాష, చంద్రియ, మంగ్యా, శ్రీను, సాయి తదితరులు పాల్గొన్నారు.