ఖమ్మం, మే 2 : భూ భారతి దరఖాస్తుల పరిషారానికి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఖమ్మం కలెక్టరేట్ నుంచి కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్, పోలీస్ కమిషనర్ సునీల్‌దత్, అదనపు కలెక్టర్లు డాక్టర్ పి.శ్రీజ, పి.శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ పైలెట్ ప్రాజెక్టు మండలాల్లో ప్రజల వద్దకు వెళ్లి సమస్యలు పరిషరిస్తే ప్రభుత్వానికి మంచిపేరు వస్తుందన్నారు.
కలెక్టర్ మాట్లాడుతూ నేలకొండపల్లి మండలంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో 23 రెవెన్యూ గ్రామాల నుంచి 3వేల 224 దరఖాస్తులు వచ్చాయని, వాటిలో 1,264 సాదాబైనమా దరఖాస్తులు వచ్చాయని, కటాఫ్ తేదీ 2 జూన్ 2014 తర్వాత 700 మంది, కటాఫ్ తేదీలోపు ఉన్న దరఖాస్తులు 564 ఉన్నాయని, వీటిలో 264 ఆన్లైన్ దరఖాస్తులు చేసుకున్నారని, క్షేత్రస్థాయి తనిఖీలో 30 మంది మాత్రమే ఫీల్డ్‌లో ఉన్నారని తెలిపారు. సమావేశంలో ఎస్డీసీ ఎం.రాజేశ్వరి, ఆర్డీవోలు నరసింహారావు, ఎల్.రాజేందర్, హౌసింగ్ ఈఈ భూక్యా శ్రీనివాస్, డీపీవో ఆశాలత, ఇతర అధికారులు పాల్గొన్నారు.