ఖమ్మం రూరల్ : ఇది పాత కాలపు ప్రాచీన యుగం కాదని, జెన్ జీల ( Gen Z ) ఆధునిక యుగమని ఈ యుగంలో రాజకీయ కక్ష సాధింపులకు తావు లేదని పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి ( Kandala Upender Reddy ) అన్నారు. శుక్రవారం ఖమ్మం రూరల్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బెల్లం వేణుగోపాల్‌తో కలిసి ఖమ్మం రూరల్ మండలం, ఏదులాపురం మున్సిపాలిటీ లో విస్తృతంగా పర్యటించారు.
ఈ పర్యటనలో భాగంగా గూడూరు పాడులో పర్యటించిన కందాల ఇటీవల రాజకీయ కక్షల నేపథ్యంలో కొందరు వ్యక్తుల దాడిలో గాయపడిన బీఆర్ఎస్ కార్యకర్త మారుతి రామారావు, మరో బాధితుడు బట్టు రామారావును పరామర్శించారు. ఈ సందర్భంగా కందాల మాట్లాడుతూ అకారణంగా పార్టీ కార్యకర్తలపై దాడి చేస్తే సహించేది లేదన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో తగిన రీతిలో గుణపాఠం చెప్పడం ఖాయమన్నారు.
మంచితనంతో ప్రజల మనసులు, మన్ననలు పొందాలని భయభ్రాంతులను చేసి రాజకీయం చేస్తామనుకోవడం సరికాదన్నారు. అనంతరం మంగళ గూడెం లో జరిగిన పలు ఆలయాల విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అదేవిధంగా తీర్థాల, సత్యనారాయణపురం, నాయుడుపేట, పొన్నెకల్ గ్రామాలలో పర్యటించి బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ యండపల్లి వరప్రసాద్, ఏదిలాపురం సొసైటీ చైర్మన్ లక్ష్మణ్ నాయక్, బీఆర్ఎస్ నేతలు పేరం వెంకటేశ్వర్లు, అల్లిక వెంకటేశ్వరరావు ఆ గ్రామాల పార్టీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.