రాష్ట్ర ప్రభుత్వంలో ఖమ్మం జిల్లా నుంచి ముగ్గురు కీలక మంత్రులు ప్రాతినిథ్యం వహిస్తున్నప్పటికీ వారి సొంత జిల్లాలోని ముఖ్యమైన శాఖలకు దిక్కులేకుండా పోయింది. ముఖ్యమైన పది శాఖలకు విభాగాధిపతులుగా జిల్లాస్థాయి అధికారులు లేక ఇన్చార్జులతో నెట్టుకొస్తుండడం గమనార్హం. చివరికి గ్రూప్-1 స్థాయి పోస్టుల్లోనూ అందుకు తగిన అర్హత లేని అధికారులే బాధ్యతలు నిర్వహిస్తుండడం విశేషం. అయితే, రాష్ట్ర ప్రభుత్వంలో నిర్ణయాత్మకంగా ఖమ్మం జిల్లా నుంచి ముగ్గురు కీలక మంత్రులు ఉన్నప్పటికీ యంత్రాంగం నుంచి సమగ్ర పాలన అందించలేని పరిస్థితులు నెలకొనడం గమనార్హం. జిల్లాలో ఏకంగా పది శాఖలకు జిల్లాస్థాయి అధికారుల కొరత ఉండడం విడ్డూరం. దీంతో కలెక్టర్లు కూడా ఇన్చార్జి అధికారులతోనే పాలన నెట్టుకొస్తున్నారు. దీంతో ఆయా శాఖల్లో జవాబుదారులు కూడా కరువైనట్లయింది. అయితే, పొరుగు జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చి పనిచేసేందుకు కొద్దిమంది జిల్లాస్థాయి అధికారులు ఆసక్తి చూపినప్పటికీ ఇక్కడి మంత్రుల మధ్య నలగలేక తరువాత వెనుకడుగు వేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.
-మామిళ్లగూడెం, జూన్ 18
‘ఖమ్మం జిల్లా’ అంటేనే ‘వామ్మో అక్కడ మేం పనిచేయలేం’ అంటున్నారు కొందరు అధికారులు. ఇతర జిల్లాల నుంచి బదిలీపై వచ్చేందుకు కూడా జంకుతున్నారు. దీంతో ఖాళీ అయిన కీలక శాఖలన్నీ ఇక్కడి ఇన్చార్జి అధికారుల పర్యవేక్షణలోనే కొనసాగుతున్నాయి. నెలల తరబడి వారితోనే నెట్టుకొస్తున్నారు.
ఖమ్మం జిల్లాలో సుమారు డజను వరకు కీలక శాఖలకు ఇన్చార్జి అధికారులే దిక్కయ్యారు. జిల్లాలో ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పర్యవేక్షించేందుకు తగిన సంఖ్యలో కీలక అధికారులు లేరు. ఉన్న వాళ్లందరూ ఇన్చార్జులే కావడంతో కొన్ని కీలక విషయాల్లో నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు. ఖమ్మం జిల్లా నుంచి కీలకమైన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పాలనపై సమగ్ర పట్టున్న సీనియర్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, సీఎం తరువాత నంబర్-2గా ప్రాచుర్యం పొందిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. కానీ, వీరి సొంత జిల్లాలోనే పలు ముఖ్యమైన శాఖలకు జిల్లాస్థాయి అధికారులు లేరు. అయితే, ‘ముగ్గురు మంత్రుల మధ్య తాము విధులు నిర్వహించలేమని, వారు పెట్టే టార్గెట్లను చేయలేమనే భావనతోనే ఇక్కడి జిల్లాస్థాయి పోస్టుల్లోకి రావడానికి అధికారులు వెనుకంజ వేస్తున్నారు. మండల స్థాయి అధికారులకు జిల్లాస్థాయి బాధ్యతలు..
ఇక మరికొన్ని శాఖల్లో మండల స్థాయి అధికారులకు జిల్లాస్థాయి బాధ్యతలు అప్పగించారు. దీంతో వారు ఆయా స్థానాల్లో నెట్టుకొస్తున్నారు. మండల స్థాయి అధికారి అయిన తహసీల్దార్ ఎండీ ముజాహిద్‌ను జిల్లా మైనార్టీ సంక్షేమాధికారిగా నియమించారు. అదే తహసీల్దార్ కేడర్ స్థాయి అధికారి తుంబూరు సునీల్‌రెడ్డికి జిల్లా సివిల్ సప్లయీస్ మేనేజర్‌గా, జిల్లా పౌరసరఫరాల కార్పొరేషన్ మేనేజర్‌గా బాధ్యతలు అప్పగించారు. వాస్తవానికి ఈ పోస్టుల్లో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ లేదా ఆర్డీవో స్థాయి అధికారిని నియమించాల్సి ఉంది. ఇదే అధికారి ప్రస్తుతం జిల్లా యువజన, క్రీడల శాఖ ఇన్చార్జి అధికారిగా పనిచేస్తున్నారు. వాస్తవంగా మండల తహసీల్దార్ కేడర్‌లో విధులు నిర్వహించాల్సిన ఇలాంటి అధికారులు కీలక శాఖలకు జిల్లాస్థాయి అధికారులుగా పనిచేస్తున్నారు.
జిల్లాలో ఎస్సీల అభివృద్ధిలో అత్యంత కీలకంగా పనిచేయాల్సిన ఎస్సీ కార్పొరేషన్ గురించి పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ఈ కార్పొరేషన్‌కు గతంలో ఉన్న వైభవం ఇప్పుడు లేకుండాపోయింది. గతంలో గ్రూప్-1 స్థాయి అధికారులు ఈ కార్పొరేషన్లో ఈడీలుగా విధులు నిర్వహించి ఎస్సీల అభివృద్ధిలో కీలకపాత్ర పోషించారు. కానీ, ఇప్పుడు ఈ శాఖకు ఆ స్థాయి అధికారి దిక్కేలేరు. టీఎన్జీవోస్ అధ్యక్షుడు ఏలూరు శ్రీనివాసరావును రెండున్నరేళ్ల క్రితం ఖమ్మం జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఈడీగా నియమించారు. కానీ, ఆయన సేవలన్నీ రాష్ట్ర రాజధాని కేంద్రంలో కొనసాగతున్నాయి. దీంతో ఇక్కడే మండల అగ్రికల్చర్ అధికారిగా పనిచేసే కే.నవీన్‌బాబు ఇన్చార్జి ఈవోగా నియమితులైనట్లు ఉత్తర్వులు తెచ్చుకున్నారు. ఇన్చార్జి ఈడీ అధికారాలను కూడా ఆయనకే అప్పగించారు. కానీ, ఆయన కూడా కొద్దిరోజులకే ఓ అధికార పార్టీ ఎమ్మెల్సీకి పీఏగా వెళ్లిపోయాడు. ప్రస్తుతం జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి ఎండీ ముజాహిద్కే ఎస్సీ కార్పొరేషన్ ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు.
జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి(డీఆర్డీవో)గా రెగ్యులర్ అధికారిగా పనిచేసిన సన్యాసయ్య ఏడాది క్రితం ప్రమోషన్‌పై రాష్ట్ర కార్యాలయానికి వెళ్లారు. అప్పటి నుంచి ఆయన స్థానంలో రెగ్యులర్ అధికారిని నియమించలేదు. దీంతో గ్రామీణాభివృద్ధిలో కీలకమైన ఈ శాఖ పనితీరు కుంటుపడుతోంది. అయితే, గతంలో డీఆర్డీవోగా గ్రూప్-1 స్థాయి అధికారిగానీ లేదా ఐఏఎస్, ఐఎఫ్ఎస్ అధికారులుగానీ పని చేసేవారు. కానీ, కీలకమైన ఈ శాఖకు ఇప్పుడు ఇన్చార్జులే దిక్కయ్యారు. ఉమ్మడి జిల్లాలో గ్రూప్-1 అధికారిగా, జిల్లా ఉపాధి కల్పన అధికారిగా ఉన్న కొండపల్లి శ్రీరామ్ ప్రస్తుతం భద్రాద్రి జిల్లా ఉపాధి కల్పన అధికారిగా పని చేస్తున్నారు. ఆయనను తీసుకొచ్చి ఖమ్మం ఇన్చార్జి డీఆర్డీవోగా నియమించారు. ప్రస్తుతం ఆయన రెండు జిల్లాల్లోనూ విధులు నిర్వహించాల్సి వస్తోంది.
ఇక జిల్లాలో ఎస్సీల సంక్షేమాన్ని పట్టించుకునే నాథుడే లేనట్లుగా కన్పిస్తోంది. డీడీగా పనిచేసిన కస్తాల సత్యనారాయణ గత ఆగస్టులో ఉద్యోగ విరమణ పొందారు. ఆయన స్థానంలో.. జిల్లా బీసీ సంక్షేమాధికారి జీ.జ్యోతికి ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. అయితే, హనుమకొండ జిల్లాలో పనిచేస్తున్న ఓ అధికారి ఈ పోస్టులోకి రావాలని ప్రయత్నం చేశారు. అయితే, ఇక్కడి ముగ్గురు మంత్రుల మూడు ముక్కలాటలో తాము ఇమడలేనని భావించి తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు ఆ శాఖలో చర్చలు జరుగుతున్నాయి.
జిల్లాలో అత్యంత కీలకమైన శాఖలకు జిల్లాస్థాయిలో రెగ్యులర్ అధికారులను నియమించుకోవడంలో జిల్లా మంత్రులకు పట్టింపులేదా? అనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర క్యాబినెట్లో అత్యంత కీలకంగా ఉంటూ.. రాష్ట్ర అభివృద్ధినంతా తమ భుజస్కందాలపై మోస్తున్నామని ప్రగల్భాలు పలుకుతున్న ఈ మంత్రులు తమ జిల్లాలోని కీలక శాఖలకు పూర్తిస్థాయి అధికారులను నియమించుకోవడంలో ఎందుకు విఫలమవుతున్నారనే ప్రశ్నలు మొదలవుతున్నాయి.
పల్లెలే దేశాభివృద్ధికి పట్టుగొమ్మలంటూ సూక్తులు చెబుతున్న ప్రభుత్వం.. చివరికి పల్లెల ప్రగతిని కూడాపట్టించుకోవడం లేదు. పల్లెల పాలనలో అతి ముఖ్యమైన పంచాయతీరాజ్ శాఖకు కూడా ఇన్చార్జి అధికారే దిక్కయ్యారు. జిల్లా పంచాయతీ అధికారిగా విధులు నిర్వహించిన ఆశాలత నిరుడు ఉద్యోగ విరమణ పొందారు. నాటి నుంచి.. ఖమ్మం డీఎల్పీవో రాంబాబే ఇన్చార్జి డీపీవోగా విధులు నిర్వహిస్తున్నారు. దీంతో ఆయన అటు డీపీవోగానూ, ఇటు డీఎల్పీవోగానూ రెండు స్థాయిల్లో పనిచేయాల్సి వస్తోంది. మరి వర్షాలు మొదలైతే పరిస్థితి ఏమిటో చూడాలి.