– వెంకటేశ్వర్లు హత్య కేసులో నిందితుల అరెస్ట్
– కేసు వివరాలు వెల్లడించిన ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతిరెడ్డి
ఖమ్మం రూరల్, అక్టోబర్ 09 : ఖమ్మం జిల్లా కేంద్రంలో గల నెలలో జరిగిన హత్య కేసును పోలీసులు విజయవంతంగా చేధించారు. కేసు వివరాలను గురువారం ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతిరెడ్డి ఇతర అధికారులతో కలిసి విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పరిమి అశోక్ కొంతకాలంగా ఖమ్మం జిల్లాలో నివాసం ఉంటున్నాడు. ఖమ్మం అర్బన్ మండలం పల్లెలో వంగతోట సాగు చేసేవాడు. సాగులో నష్టాలు రావడం, అప్పులపాలు కావడంతో ప్రత్యామ్నాయ వ్యాపారం చేసేందుకు ఖమ్మం వచ్చాడు. ఈ క్రమంలో ఖమ్మం నగర కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆయా గా పనిచేసే కొమ్ము నగ్మాతో అశోక్‌కు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త శారీరక సంబంధానికి దారితీసింది.
ఈ క్రమంలోనే ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం కెప్టెన్ బంజర గ్రామానికి చెందిన గట్ల వెంకటేశ్వర్లు గ్రంథాలయం వద్ద అశోక్‌కు పరిచయం అయ్యాడు. కాలక్రమంలో వీరి పరిచయం స్వలింగ సంపర్కానికి దారితీసింది. అశోక్ రూమ్ కు వెంకటేశ్వర్లు తరచూ వచ్చిపోతుండేవాడు. వచ్చిన ప్రతిసారి అశోక్ కు ఆర్థిక సహకారం చేసేవాడు. అయితే ఏక మొత్తంలో ఒకేసారి వెంకటేశ్వర్లును చంపి అతడి వద్ద ఉన్న బంగారం, ఇతర ఆస్తులను చేజిక్కించుకోవాలనే దురుద్దేశ్యంతో అశోక్ కుట్రకు తెరలేపాడు. ఈ క్రమంలో బాలపేటలో తాను వ్యవసాయం చేస్తున్న సమయంలో పరిచయమైన పెంటి కృష్ణయ్య సహకారం తీసుకున్నాడు. వెంకటేశ్వర్లును ఎలా చంపాలి, చంపిన తర్వాత శరీర భాగాలను గుర్తు తెలియని ప్రదేశాల్లో ఎలా వేయాలి అనే అంశాలను యూట్యూట్‌లో సెర్చ్ చేశాడు. గత నెల 15వ తేదీన వెంకటేశ్వర్లు యాథావిధిగా అశోక్ రూమ్‌కు వచ్చి పడుకున్నాడు. నిద్రలో ఉన్న వెంకటేశ్వర్లును తెల్లవారుజామున అతి కిరాతంగా అశోక్ నరికి చంపాడు. మెడపై పలుమార్లు నరికి తల మొండెం వేరు చేశాడు. ఆ సమయంలో నగ్మాను రూమ్ బయట కాపలాగా ఉంచాడు.
శరీరాన్ని ముక్కలుగా నరికిన తర్వాత ఆ భాగాలను ప్లాస్టిక్ కవర్లలో కట్టి కరోనావ్ గిరి ప్రాంతంలో పొదలు, చెత్తలో విసిరేశాడు. ఆ తర్వాత గదిలోని రక్తపు మరకలను శుభ్రపరిచినట్లు విచారణలో తేలిందని ఏసీపీ తెలిపారు. నిందితులు ఏ-1 పరిమి అశోక్, ఏ-2 కొమ్ము నగ్మా, ఏ-3 పెంటి కృష్ణపై కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. వారి వద్ద నుండి రెండు తులాల గోల్డ్ చైన్, సెల్ఫోన్లు, రెండు కత్తులు, దుస్తులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ కేసులో ప్రతిభ కనబరిచిన సింగరేణి సీఐ తిరుపతిరెడ్డి, బి.సాయికుమార్, కారేపల్లి ఎస్ఐ గోపి, కానిస్టేబుల్ సంపత్కారేపల్లి ఎస్ఐ గోపి, కానిస్టేబుల్ సంపత్, ఆనంద్, అంజి, రాజేశ్, ఉపేందర్, సైదాను ఏసీపీ అభినందించారు.