సత్తుపల్లి రూరల్, మార్చి 22 : ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలోని ఓ నగల దుకాణంలో వారం రోజుల క్రితం అపహరించిన బంగారు నగలు, నగదు సత్తుపల్లి పోలీసులు రికవరీ చేసి కేసును చేధించారు. ఈ సంఘటనకు సంబంధించి పట్టణ సీఐ కరుణాకర్ వివరాలు వెల్లడించారు. మండలంలోని కిష్టాపురంలో హిమబిందు నగల దుకాణంలో ఈ నెల 15న రాత్రి తాళాలు పగులగొట్టి షాపులోని రూ.9లక్షల విలువైన బంగారు, వెండి నగలతో పాటు నగదును గుర్తుతెలియని వ్యక్తులు అపహరించారు.
యజమానుల ఫిర్యాదు మేరకు సీఐ కరుణాకర్ ఆధ్వర్యంలో పలు కోణాల్లో దర్యాప్తు నిర్వహించారు. ఈ క్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం నాచారం గ్రామానికి చెందిన చేపలమడుగు నాగసురేశ్, వేముల జగదీశ్ సోమవారం రాత్రి ఎన్టీఆర్ కాలనీ వద్ద ఉండగా పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు అనుమానం వచ్చి అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా చోరీచేసినట్లు నిర్ధారణకు రావడంతో వారి వద్ద ఉన్న 11 తులాల బంగారు, ఏడున్నర కిలోల వెండి నగలతో పాటు నగదు రూ.3వేలను స్వాధీనం చేసుకుని వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.