కారేపల్లి, నవంబర్ 15: ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలోని సూర్యాతండా శివారులో పేకాట స్థావరంపై కారేపల్లి పోలీసులు ఆదివారం దాడులు జరిపారు. సూర్యాతండా సమీపంలో పేకాట ఆడుతున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్ఐ బైరు గోపి సిబ్బందితో కలసి పేకాట స్థావరంపై దాడిచేశారు.
పేకాట ఆడుతున్న వారినుంచి రూ.23,500 నగదు, మూడు సెల్ ఫోన్లు,ఒక బైక్ను స్వాధీనం చేసుకున్నారు. పేకాట ఆడుతున్న వారిలో ఇద్దరు పరార్ కాగా ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడుల్లో ఎస్ఐ తో పాటు పోలీస్ సిబ్బంది ఓంకార్, వెంకన్న, సైదులు పాల్గొన్నారు. పేకాట ఆడుతున్న వారి పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ గోపి తెలిపారు.