మామిళ్లగూడెం, జనవరి 8 : బదిలీపై కేంద్ర సర్వీసులకు వెళ్తున్న పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్ వారియర్‌కు ఖమ్మం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఆత్మీయ వీడోలు పలికారు. నగరంలోని కేఎల్సీలో జరిగిన కార్యక్రమంలో జిల్లాలోని ఏసీపీలు, సీఐలు, ఎస్సైలు, మినిస్టీరియల్ స్టాఫ్, పోలీసు సిబ్బంది హాజరై ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పలువురు పోలీస్ అధికారులు మాట్లాడుతూ జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని ఎప్పటికప్పుడు సమన్వయం చేస్తూ.. విధి నిర్వహణలోవిజయవంతంగా ముందుకు నడిపించిన జిల్లా పోలీస్ అధికారి బదిలీ కావడం కొంత బాధగానే ఉందన్నారు. కీలకమైన కేంద్ర సర్వీస్ విభాగానికి వెళ్తున్న ఆయన మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. బదిలీపై వెళ్తున్న సీపీ విష్ణు మాట్లాడుతూ జిల్లా అధికారులు, సిబ్బంది తనపై చూపిన అభిమానానికి కృతజ్ఞతలు తెలిపారు.
నూతన పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆధ్వర్యంలో పోలీస్ యంత్రాంగం మరింత సమర్థంగా పని చేయాలన్నారు. మరో రెండు రోజుల్లో కేంద్ర సర్వీస్‌లోని కీలక విభాగంలో బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలిపారు. కార్యక్రమం అనంతరం పూల వర్షం కురిపిస్తూ పోలీస్ సిబ్బంది తమ అభిమానాన్ని చాటుకున్నారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ ప్రసాద్‌రావు, ఏసీపీలు గణేశ్, హరికృష్ణ, ప్రసన్నకుమార్, బస్వారెడ్డి, రెహమాన్, రామనుజం, శివరామయ్య, రవి, నర్సయ్య, సుశీల్‌సింగ్, ఆర్ఐలు, సీఐలు, ఎస్ఐలు, సెక్షన్ సూపరింటెండెంట్ జానకీరాం తదితరులు పాల్గొన్నారు.