తెలంగాణ సర్కారు పంపిణీ చేస్తున్న పోడు పట్టాలు అందుకు నేందుకు గిరిజన బిడ్డలు కుటుంబ సమేతంగా సంబురంగా తరలివస్తున్నారు. పోడు భూమి సొంతమవుతున్నందుకు.. ఏళ్లనాటి కల నెరవేరినందుకు ఆనంద పరవశులవుతున్నారు. సీఎం కేసీఆర్ పట్టాలు ఇవ్వడంతోనే సరిపెట్టకుండా పథకాల వర్తింపునకూ మాటివ్వడంతో అవధులు లేని ఆనందంలో మునిగితేలుతున్నారు. సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా ఆయా నియోజకవర్గాల్లో ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు మంగళవారం పండుగ వాతావరణంలో పట్టాలు పంపిణీ చేశారు. తొలుత పట్టాలు ఇవ్వడానికి వచ్చిన ఎమ్మెల్యేలకు పోడు రైతులు, వారి కుటుంబ సభ్యులు తమదైన శైలిలో పూలుచల్లి.. నృత్యాలు చేస్తూ స్వాగతం పలికారు.
– నమస్తే నెట్వర్క్
పెనుబల్లి/ సత్తుపల్లి టౌన్, జూలై 4:ఏళ్ల తరబడి పోడు సాగు చేసుకుంటున్న గిరిజనుల కళ్లల్లో ఆనందం చూడాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్యేయమని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. అందుకోసమే ఏళ్లనాటి పోడు సమస్యను పరిష్కరించి అటవీ భూములపై శాశ్వత హక్కులు కల్పించారని అన్నారు. దశాబ్దాలుగా ఉన్న పోడు భూముల సమస్యకు తొమ్మిదేళ్లలో పరిష్కారం చూపిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని అన్నారు. పెనుబల్లి మండలం వీఎం బంజరలోని ఓ ఫంక్షన్ హాల్లో మంగళవారం నిర్వహించిన పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
11 గ్రామ పంచాయతీలకు చెందిన 801 లబ్ధిదారులకు 1,437 ఎకరాల భూమిపై ప్రభుత్వం హక్కులు కల్పించినట్లు చెప్పారు. 60 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ ఇవ్వలేని పోడు పట్టాలున తొమ్మిదేళ్లలోనే బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చి చూపించిందని అన్నారు. కాంగ్రెస్ నాయకులు దీనిని ఓర్వలేకనే సీఎం కేసీఆర్‌పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. స్కాముల పార్టీగా కాంగ్రెస్ నిలిస్తే.. ప్రజల పార్టీగా బీఆర్ఎస్ ఆదరణ చూరగొంటోందని అన్నారు.
పోడు భూములకు పట్టాలు ఇస్తామని, సామాజిక పింఛన్లను రూ.4 వేలకు పెంచుతామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ఇటీవల ఖమ్మం సభలో ప్రకటించడం విడ్డూరంగా ఉందని అన్నారు. ఇప్పటికే వీటిని తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న విషయం తెలుసుకోవాలని సూచించారు. మరి రూ.4 వేల పింఛన్‌ను కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. అనంతరం కలెక్టర్ వీపీ గౌతమ్, డీఎఫ్‌వో విక్రమ్ సిద్ధార్థ్‌సింగ్, ఐటీడీ పీవో పొట్రు గౌతమ్‌తో కలిసి లబ్ధిదారులకు పోడు పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పోడుభూముల పట్టాలు గిరిజనులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
అనంతరం లబ్ధిదారులతో కలిసి ఎమ్మెల్యే సండ్ర, కలెక్టర్ గౌతమ్, డీఎఫ్‌వో, ఐటీడీఏ పీవోలు సహపంక్తి భోజనాలు చేశారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు మంజుల, సూర్యనారాయణ, లక్కినేని అలేఖ్య, చెక్కిలాల మోహన్‌రావు, కొత్తూరి ఉమామహేశ్వరరావు, వాసు, కావూరి మహాలక్ష్మి, రమాదేవి, కనగాల వెంకట్రావు, భుక్యా ప్రసాద్, మందడపు అశోక్‌కుమార్, భుక్యా పంతులి, తేజావత్ తావునాయక్, చీపు లక్ష్మీకాంతం, చోడే రాంబాబు, కుంజా సామ్రాజ్యం, శంకర్, తాతారావు తదితరులు పాల్గొన్నారు.
అడవిబిడ్డల ఆపద్బాంధవుడు కేసీఆర్..
సీఎం కేసీఆర్ అడవి బిడ్డల ఆపద్బాంధవుడని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. సత్తుపల్లి పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లబ్ధిదారులకు ఆయన పోడు పట్టాలు పంపిణీ చేసి మాట్లాడారు. మండలంలోని బుగ్గపాడు, చెరుకుపల్లి, కాకర్లపల్లి, రేగళ్లపాడు, రుద్రాక్షపల్లి గ్రామాలకు చెందిన 1,196 మంది రైతులకు 1,649 ఎకరాలపై హక్కులు కల్పిస్తూ పోడు పట్టాలు మంజూరైనట్లు చెప్పారు. కలెక్టర్ వీపీ గౌతమ్, ఐటీడీఏ పీవో పొట్రు గౌతమ్, డీఎఫ్‌వో విక్రమ్ సిద్ధార్థ్ సింగ్‌లతో గిరిజనులకు పట్టాలు పంపిణీ చేశారు. ప్రజాప్రతినిధులు, అధికారులు కొత్తూరు ఉమామహేశ్వరరావు, కూసంపూడి మహేశ్, కూసంపూడి రామారావు, దొడ్డా హైమావతి, సూర్యనారాయణ, శ్రీనివాసరావు, సుభాషిణి తదితరులు పాల్గొన్నారు.
ఇంత కంటే ఆనందం లేదు
ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తుంది ఈ పాస్ పుస్తకం కోసమే. ప్రభుత్వం పోడు రైతులకు పట్టా పాస్ పుస్తకం ఇవ్వడం సంతోషంగా ఉంది. నాకు ఈ పుస్తకం అన్ని విధాలా ఉపయోగపడుతుందనే నమ్మకం ఉంది. సీఎం కేసీఆర్ సారును ఎప్పటికీ మరిచిపోలేం.
– మీడియం ముత్తమ్మ, మహిళా రైతు, శ్రీనివాసపురం, పెనుబల్లి మండలం
కేసీఆర్‌కు రుణపడి ఉంటాం
ఏళ్ల కలను సాకారం చేసిన సీఎం కేసీఆర్‌కు మా కుటుంబం రుణపడి ఉంటుంది. పోడు భూమి ఐదెకరాలకు పట్టా వచ్చింది. రైతుబంధు కూడా వస్తుండడంతో సంతోషంగా ఉంది. రైతుబీమా కల్పించడం వల్ల నా కుటుంబానికి ఏదైనా ప్రమాదం జరిగితే ఆసరాగా ఉంటుంది. మేమంతా కేసీఆర్ వెంటే ఉంటాం. సీఎం కేసీఆర్ చేసిన మేలును గిరిజనులు మరువరు.
– గీగా సుబ్బమ్మ, అనంతారం, అశ్వారావుపేట మండలం
కేసీఆర్‌కి రుణపడి ఉంటాం
అనేక ఏళ్లుగా పోడు సాగు చేసుకొని జీవిస్తున్నాం. ఏ ప్రభుత్వం మాగోడు పట్టించుకోలేదు. సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం మాకు 2.20 ఎకరాల భూమికి హక్కు పత్రాలు ఇచ్చారు. కేసీఆర్‌కి జీవితాంతం మా కుటుంబం రుణపడి ఉంటుంది. మా జీవితాల్లో కేసీఆర్ సార్ పండుగ తెచ్చారు.
– తెల్లం శ్రావణి, మహిళా రైతు, బచ్చలకోయగూడెం, జూలూరుపాడు మండలం
చాలా ఆనందంగా ఉంది
తాతల కాలం నుంచి సాగు చేసుకుంటున్న పోడు భూమికి పట్టాలు వస్తాయని అనుకోలేదు. హక్కు పత్రాలు రావడం చాలా ఆనందంగా ఉంది. నాకు 5.22 ఏకరాలకు హక్కు పత్రం వచ్చింది. సీఎం కేసీఆర్ సారు మా కష్టాలను చూసి పట్టాలు ఇచ్చారు. సారు ఎప్పటికీ చల్లంగా ఉండాలి.
– భూక్యా శంకర్, పోడు రైతు, చింతలతండా, జూలూరుపాడు మండలం
కేసీఆర్ దేవుడి రూపంలో ఇచ్చారు
ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న పోడు పత్రాలను సీఎం కేసీఆర్ దేవుడి రూపంలో వచ్చి అందించారు. ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పట్టాలు అందించడానికి ఎంతో కృషి చేశారు. సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే, కలెక్టర్‌కు మా కుటుంబ సభ్యులు రుణపడి ఉంటారు.
– మాలోతు హతీరాం, పోడు రైతు, గంగదేవిపాడు, పెనుబల్లి మండలం
గిరిజన బాంధవుడు సీఎం కేసీఆర్
కనీవినీ ఎరుగని రీతిలో పోడు పట్టాలు అందించి గిరిజన బాంధవుడిగా సీఎం కేసీఆర్ నిలిచారు. నిజంగా మాకు పత్రాలు వస్తాయో లేదో అని గతంలో కలత చెందేవాళ్లం. కానీ సీఎం కేసీఆర్ వచ్చాక ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. మాకు పట్టాలు అందించి ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు.
– బి.సోమేశ్వరరావు, పోడు రైతు, గంగదేవిపాడు, పెనుబల్లి మండలం
కేసీఆర్‌యే మా దేవుడు
పట్టాలు అందించడం ఎంతో సంతోషంగా ఉంది. ఈ జన్మకు ఇంతకు మించిన ఆనందం లేదు. సీఎం కేసీఆర్ దేవుడి రూపంలో మా కష్టాలను గుర్తించి పట్టాలు అందించారు. ఆయనకు ఎప్పుడూ అండగా ఉండి రుణం తీర్చుకుంటాం.
– ఇస్లావత్ సాలి, మహిళా రైతు, గంగదేవిపాడు, పెనుబల్లి మండలం
కేసీఆర్ రుణం తీర్చుకుంటాం
పోడు పట్టాలు అందించిన కేసీఆర్‌కు రుణం తీర్చుకునే సమయం వచ్చింది. ఊహించని విధంగా పోడు పట్టాలు అందించి మా కుటుంబాల్లో వెలుగులు నింపారు. ఆయనకు ఎల్లవేళలా అండగా ఉంటాం. ఎమ్మెల్యే సండ్రకు రుణపడి ఉంటాం.
– మాలోతు కమిలీ, మహిళా రైతు, గంగదేవిపాడు, పెనుబల్లి మండలం