ఇల్లెందు, జూలై 28 : హమాలీ కార్మికులకు పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని, పని గంటలు పెంచే 282 జీఓను ప్రభుత్వం రద్దు చేయాలని టీయూసీఐ నాయకులు అన్నారు. ఈ నెల 31వ తేదీన కలెక్టర్ కార్యాలయం ముందు నిర్వహించే ధర్నాలో హమాలీలు పెద్ద ఎత్తున పాల్గొని విజయంతం చేయాలని కోరారు. ఈ మేరకు ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా (టీయూసీఐ) రాష్ట్ర మహాసభ పిలుపులో భాగంగా సోమవారం ఇల్లెందు పట్టణం గిరిజన ప్రాథమిక సహకార సంఘం గోడౌన్లో పనిచేస్తున్న హమాలీల ఆధ్వర్యంలో గిరిజన కార్పొరేషన్ (జిసిసి)లో గోదాము ఇన్చార్జి వీరేశం కు వినతి పత్రం అందజేశారు. అనంతరం హమాలీ సెక్రటరీ బోల్ల సీతారాములు అధ్యక్షతన జరిగిన సభలో ఇల్లెందు ఏరియా అధ్యక్ష, కార్యదర్శులు పాయం వెంకన్న, మల్లెల వెంకటేశ్వర్లు పాల్గొని మాట్లాడారు.
హమాలీలకు ఉపాధి భద్రతతో కూడిన సమగ్రమైన చట్టం ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్రంలో 3 లక్షలకు పైగా హమాలీలు వివిధ రంగాల్లో పని చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నుండి నేటి వరకు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి హమాలీ కార్మికుల సమస్యలపై అనేకసార్లు మంత్రులకు, ఎమ్మెల్యేలకు, అధికారులకు విన్నవించినా చర్యలు తీసుకోవడంలో చొరవ చూపడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం అసంఘటితరంగ కార్మికుల సమస్యల అధ్యయనం కోసం అమృతసేన్ కమిషన్ను నియమించింది. ఈ కమిషన్ రిపోర్టు ప్రకారం కేంద్ర ప్రభుత్వం 2008లోనే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్ర కార్మికుల స్థితిగతులు పరిశీలించి రూల్స్ రూపొందించుకోవాలని సూచనలు చేసినా ఇప్పటికీ వీరిపై కన్నెత్తి చూడకపోవడం బాధాకరమన్నారు. పొద్దంతా మూటలు మోసి పనిచేసినా పూట గడవడం లేదన్నారు.
ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హమాలీ కార్మికుల పట్ల తమ చిత్తశుద్ధిని నిరూపించుకుని పీఎఫ్, ఈఎస్ఐతో పాటు ఉపాధి భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలన్నారు. ఈ నెల 31న తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టర్ల కార్యాలయం ముందు ధర్నా నిర్వహించాలని హమాలీలకు పిలుపునిచ్చారని. ఈ కార్యక్రమంలో ఏరియా సహాయ కార్యదర్శి వేముల గురునాథం, హమాలీ దడ్వాయి బొల్లి రవి, మోటార్ సంపత్, శ్యామ్, భాజ్య, శ్రీను, రాజశేఖర్, రామ చంద్రు, ఉపేందర్, సాయి పాల్గొన్నారు.