ఖమ్మం సిటీ/ మామిళ్లగూడెం, సెప్టెంబర్ 12: కొణిజర్ల పీఏసీఎస్ వద్ద యూరియా కోసం రైతులు పడుతున్న ఇబ్బందులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్న ‘టీ న్యూస్’ ఉమ్మడి జిల్లా ప్రతినిధి వెన్నబోయిన సాంబశివరావు, కెమెరామెన్, 4జీ టెక్నీషియన్లపై స్థానిక పోలీసులు నమోదు చేసిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని టీయూడబ్ల్యూజే (టీజేఎఫ్) జిల్లా అధ్యక్షుడు ఆకుతోట ఆదినారాయణ డిమాండ్ చేశారు.
ఈ మేరకు జర్నలిస్టులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని కోరుతూ టీజేఎఫ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు ఖమ్మం పోలీసు కమిషనరేట్‌లోని లా అండ్ ఆర్డర్ అదనపు డీసీపీ ప్రసాదరావుకు శుక్రవారం వినతిపత్రం అందజేశారు. సంఘం నాయకులు చిర్రా రవి, బొల్లం శ్రీనివాస్, ప్రశాంత్‌రెడ్డి, ఎంవీ రమణ, శెట్టి రజినీకాంత్, గుద్దేటి రమేష్‌బాబు, ఉదయ్, ఉపేందర్, తిరుపతిరావు, కొరకొప్పుల రాంబాబు, రంగా నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.