ఖమ్మం వ్యవసాయం, ఆగస్టు 30 : విక్రయానికి పెసర రైతులు పడుతున్న ఇబ్బందులను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం తొలివిడతగా జిల్లాలోని వైరా, ఖమ్మం వ్యవసాయ మార్కెట్లలో మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. ‘మద్దతు ధర మిథ్య!’ అనే శీర్షికన పెసర సాగు రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ‘నమస్తే తెలంగాణ’లో శుక్రవారం కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే.
దీనికి స్పందించిన యంత్రాంగం.. మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో డీసీఎంఎస్ ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో ఉమ్మడి జిల్లా మార్క్‌ఫెడ్ మేనేజర్ సునీత, జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి అలీం, మార్కెట్ కార్యదర్శి ప్రవీణ్‌కుమార్, డీసీఎంఎస్ మేనేజర్ సందీప్‌కుమార్‌తో కలిసి శుక్రవారం ప్రారంభించారు. అనంతరం మార్కెట్ యార్డుకు రైతులు తీసుకొచ్చిన పంటను తేమ యంత్రాల ద్వారా శాతాన్ని నిర్ధారించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పెసర పంటకు గిట్టుబాటు ధర కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రత్యేక కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని, రైతులు నాణ్యమైన పంటను కేంద్రానికి తీసుకొస్తే క్వింటాకు రూ.8,682 చొప్పున కొనుగోలు చేస్తామన్నారు. పంట ఉత్పత్తులను విక్రయించడానికి వచ్చే రైతులు విధిగా పట్టాదారు పాస్‌బుక్, ఆధార్ కార్డు, బ్యాంక్ ఖాతా పుస్తకం,
పెసర పంట సాగు ధ్రువీకరణ జిరాక్స్ పత్రాలు వెంట తెచ్చుకోవాలన్నారు. రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని మరిన్ని కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో వర్తక సంఘం కోశాధికారి తల్లాడ రమేశ్, దిగుమతి శాఖ అధ్యక్ష, కార్యదర్శులు దిరిశాల వెంకటేశ్వర్లు, ముత్యం ఉప్పలరావు, కల్వకుంట్ల గోపాల్‌రావు, అపరాల యార్డు సూపర్వైజర్ ఆర్.ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.