జూలూరుపాడు, డిసెంబర్ 17: వానర దండు జూలూరుపాడు మండలంలోని గ్రామాలపై దండెత్తి వస్తున్నాయి.. ఇళ్లలోకి చొరబడి నచ్చిన ఆహార పదార్థాలను ఎత్తుకెళ్తున్నాయి.. రైతులు సాగు చేస్తున్న పండ్లు, కూరగాయల తోటలను ధ్వంసం చేస్తున్నాయి.. మండలం ఆటవీప్రాంతానికి దూరంగా ఉన్నప్పటికీ అడవిలో ఆహారం దొరక్క వానరాలు జనావాసాల్లోకి వస్తున్నాయి. ఇంటి పైకప్పులు, రేకుల షెడ్లపై ఎక్కి బీభత్సం సృష్టిస్తున్నాయి. ఆదమరిచి ఇంటి తలుపులు వేయకుండా ఉంటే ఇంటిని కొల్లగొడుతున్నాయి. క్షణాల్లో ఆహార పదార్థాలను మాయం చేసి ఉడాయిస్తున్నాయి.
కోతులు గుంపులు గుంపులుగా గ్రామాల్లోకి వస్తున్నాయని, పంటల దిగుబడిపైనా వాటి ప్రభావం కనిపిస్తున్నదని మండలానికి చెందిన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము సాగు చేస్తున్న కూరగాయలు, పండ్ల తోటలను ధ్వంసం చేస్తున్నాయంటున్నారు. పిందె దశలో ఉండగానే కాయలను తెంపేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తినేందుకు పనికిరాని పత్తికాయలనూ వదలడం లేదంటున్నారు. కోతల నుంచి పంటను కాపాడేందుకు పొలాల వద్ద ప్రత్యేకంగా ఒక మనిషిని కాపలా ఉంచాల్సి వస్తుందంటున్నారు. రేయింబవళ్లు కంటి మీద కునుకులేకుండా చేస్తున్నాయంటున్నారు.
కోతుల బెడదకు తాళలేక గ్రామస్తులు ఇంటికొకరు కాపలా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎవరోఒకరు ఉండేలు, కర్ర చేత పట్టుకొని వానరాలను అదిలించాల్సి వస్తున్నది. జాతీయ రహదారికి ఇరువైపులా ఉన్నా వెంగన్నపాలెం, జూలూరుపాడు గ్రామాల కోతుల బెడద ఎక్కువగా ఉంది. కిరాణా దుకాణాలు, ఇండ్లు.. ఇలా దేన్నైయినా కోతులు వదలడం లేదు. వాటి బెడద నుంచి విముక్తి కల్పించాలని, ఎవరికి ఫిర్యాదు చేసినా స్పందన లేదని, అధికారులెవరూ పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటవీశాఖ అధికారులైనా స్పందించి సమస్యకు పరిష్కారం చూపాలని కోరుతున్నారు.